Fact Check: బాబుపై భక్తితోనే ఉన్మాదరాతలు | Eenadu Bad propaganda against the government | Sakshi
Sakshi News home page

Fact Check: బాబుపై భక్తితోనే ఉన్మాదరాతలు

Published Sun, Feb 25 2024 5:37 AM | Last Updated on Sun, Feb 25 2024 5:44 AM

Eenadu Bad propaganda against the government - Sakshi

కృష్ణా పుష్కరాలవేళ చంద్రబాబు ప్రభుత్వం పదుల సంఖ్యలో ఆలయాలు కూల్చేస్తే రామోజీకి చీమకుట్టినట్టయినా లేదు. అప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆయనకు అనిపించలేదు. పచ్చ కళ్ల మత్తులో జోగుతున్న ఈనాడుకు నిలదీయాలన్న ధ్యాసే లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని బాధ్యతగా పునరుద్ధరిస్తే కనీసం ప్రశంసించేందుకు కూడా మనసురాలేదు.

పైగా కరోనా కల్లోల వేళ కొన్ని అసాంఘిక శక్తులు చేసిన దుష్టచర్యలను ఆనాడే జగన్‌ హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తే ఇప్పుడు సర్కారును బాధ్యులను చేస్తూ ఈనాడులో వికృతరాతలు. ఎలాగోలా భక్తుల్లో అలజడి రేపితే మతఘర్షణలకు దారితీయదా... తద్వారా తెలుగుదేశానికి కలసిరాదా... ఈ ప్రభుత్వానికి అప్రదిష్ట కలగదా... అన్న ఉన్మాద రాతలకు తెగబడింది. ‘జగన్‌ ఏలుబడిలో దేవుళ్లకూ రక్షణ కరవే’ అంటూ ఓ అబద్ధాన్ని వండివార్చింది. 

సాక్షి, అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు రేపేందుకు ‘ఈనాడు’ పూనుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించేందుకు యత్నించింది. కరోనా విపత్కర వేళ ఎవరూ రోడ్డుపైకి రాలేకపోయిన రోజుల్లో  వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న 26 దుస్సంఘటనలను ఉదహరిస్తూ దానికీ జగన్‌ ప్రభుత్వానికి ముడిపెట్టింది.

2020 మార్చి 12 నుంచి 2021 ఏప్రిల్‌ 16వ తేదీ మధ్య కొన్ని అసాంఘిక శక్తులు ఉద్దేశ పూర్వకంగా పనిగట్టుకొని ఆలయాల్లో కొన్ని దురాగతాలకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆలయాల్లో స్వామివార్ల నిత్య పూజలకు, భక్తుల దర్శనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్పటికప్పుడే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో మరోచోట అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలతోపాటు ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలోని ఆలయాల్లో యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాత్రివేళల్లో ఆలయాల వద్ద పోలీసు గస్తీని పెంచింది. తద్వారా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండాచేసింది. కానీ చంద్రబాబుపై తనకున్న ‘స్వామి భక్తి’తో పూర్తిగా ఉన్మాదిగా మారిన ‘ఈనాడు’ ఇప్పుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనలను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. 

నాడు ఆలయాలు కూల్చేస్తే నోరెత్తలేదేమీ... 
టీడీపీ హయాంలో పవిత్ర కృష్ణానదీ తీరాన  విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో పవిత్ర దేవాలయాలను అధికారికంగా కూల్చేశారు.  ఆ సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా.. ‘ఈనాడు’ కనీసం స్పందించనైనా లేదు. పైగా చంద్రబాబు ఓ గొప్ప విజనరీగా, దార్శనికుడిగా చూపిస్తూ ఆకాశానికెత్తేసింది.

నాడు కూల్చేసిన ఆలయాలను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తిరిగి పునర్నిర్మించడంతో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, కొత్తగా ఆలయాలు నిర్మించింది. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 

దేవుడి ఆస్తుల రక్షణకు జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలు 
♦ రాష్ట్రంలోని దేవుడి ఆస్తులు, విలువైన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. చట్టంలోని లొసుగులను  అడ్డుపెట్టుకొని కొందరు పెత్తందార్లు దర్జాగా వాటిని కైంకర్యం చేసేశారు.  
♦ అలాంటి దుశ్చర్యలను కట్టడి చేస్తూ జగన్‌ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి... వారం రోజుల తర్వాత ఆ భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని ఆర్డినెన్స్‌ ద్వారా దేవదాయశాఖకు కట్టబెట్టింది.  
♦ ఇప్పటి వరకు ఆ భూములు స్వాధీనం  చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ముందుగా ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌లో పిటీషన్‌ వేయాల్సి ఉండేది. ట్రిబ్యునల్‌ ఆక్రమణదారునికి సైతం తమ లాయర్ల ద్వారా  వాదనలు వినిపించుకునే అవకాశమిచ్చింది. ట్రిబ్యునల్‌ దానిపై నిర్ణయం వెలువరించేవరకూ ఆ భూములు అనుభవించుకునే వెసులుబాటు ఆక్రమణదారులకే లభించేది.  
♦ ఒకవేళ ట్రిబ్యునల్‌ దేవదాయశాఖకు అనుకూలంగా తీర్పునిస్తే, దానిపై మళ్లీ అప్పీల్‌ చేసుకుని కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకుంది. దానివల్ల స్వాధీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేది కాదు. కొత్త చట్టంతో దానికి కళ్లెం వేయగలిగింది. 
♦ ఇంకోవైపు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి తొలిసారి ఆలయ అభివృద్ధి పనులకు నేరుగా నిధులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది.  
♦ ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ కేవలం ఆయా  ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదంటే వంశపారంపర్య అర్చకులకు, ఇతర హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది.  
♦ రాష్ట్రంలోనూ ఆలయాల నిర్వహణ, దేవదాయ శాఖ నిర్వహణలోనూ రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తగ్గిస్తూ వివిధ స్వామీజీలు, రిటైర్డు జడ్జిలు, రిటైర్డు దేవదాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్‌ను సుదీర్ఘకాలం తర్వాత 2022లో జగన్‌ ప్రభుత్వం రెండో విడత ఏర్పాటు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement