దుష్ప్రచారం చేయడంలో తనను మించిన వారు లేరంటూ ఈనాడు రామోజీ మరో అడుగు ముందుకు వేశారు. చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా తగ్గేదే లేదని పదే పదే చాటుకుంటున్న రామోజీ.. తుదకు పాత్రికేయ విలువలకూ తిలోదకాలు ఇచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయడంతో ఈయన గారికి బీపీ పెరిగిపోయింది.
న్యాయస్థానమైతే ఏంటనుకుంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ఈ కేసును విచారిస్తోంది ఎన్‌ఐఏ. బదిలీ చేస్తూ తీర్పు చెప్పింది విజయవాడలోని ఎన్‌ఐఏ న్యాయస్థానం. బదిలీ చేసింది విశాఖలోని ఆ కోర్టుకే. ఇందులో అభ్యంతరం ఏమిటి రామోజీ? తీర్పు ఎలా ఇవ్వాలో కూడా మీరే నిర్దేశిస్తారా?
సాక్షి, అమరావతి: పచ్చ (టీడీపీ) కామెర్లు సోకిన ఈనాడు రామోజీరావు ఏనాడో పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిత్యం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంతటితో ఆగక ఇప్పుడు ఏకంగా న్యాయస్థానాల నిర్ణయాలు, తీర్పులను సైతం వక్రీకరిస్తూ.. వక్రభాష్యాలు చెబుతూ.. దురుద్దేశాలు ఆపాదించేందుకూ బరితెగించారు.
చంద్రబాబు కోసం ఎంతకైనా దిగజారుతామని తన దివాలాకోరుతనాన్ని మరోసారి ప్రదర్శించారు. ఇందులో భాగంగా న్యాయ వ్యవస్థ అధికార పరిధిలోకి చొరబడి మరీ న్యాయమూర్తి నిర్ణయాలకు వక్రభాష్యం చెప్పారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై 2018 అక్టోబరు 25న విశాఖపట్నంలో జరిగిన హత్యాయత్నం కేసును విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేస్తూ విజయవాడ ఎన్‌ఐఏ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ ‘ఈనాడు’ సొంత వ్యాఖ్యలు చేయడం న్యాయ నిపుణులను విస్మయ పరిచింది.
న్యాయ వ్యవస్థను కించపరిచిన ఈనాడు
ఈ కేసును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడంపై ఈనాడు పత్రిక బుధవారం ప్రచురించిన కథనం పూర్తిగా వక్రీకరణే. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని ఈనాడు తీర్మానించేయడం న్యాయ వ్యవస్థను ప్రశ్నించడమే. రాజకీయ దురుద్దేశంతో ప్రచురించిన కథనం అది. ఏకంగా న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ... న్యాయ వ్యవస్థను కించపరుస్తూ కథనాన్ని ప్రచురించింది.
ఎన్‌ఐఏ కోరిక మేరకే విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను సాగదీసేందుకే విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానానికి కేసును బదిలీ చేశారని ఈనాడు పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు న్యాయస్థానాల్లో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది.
విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్‌ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతుందని హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. అందుకే రాష్ట్రంలో అదనంగా ఎన్‌ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ లేఖ ద్వారా కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్‌ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది.
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఐఏ, సీబీఐలకు ఇతర రాష్ట్రాల్లో కూడా వేర్వేరు చోట్ల ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవాడతోపాటు విశాఖపట్నం, కర్నూలులో ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. అదే విధంగా ఎన్‌ఐఏకు విజయవాడతోపాటు విశాఖపట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నంలో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది.
ఈనాడు పైశాచిక ఆనందం
ఎవరైనా బాధితునిపట్ల సానుకూలత, సానుభూతి చూపుతారు. దాడికి పాల్పడిన వారి పట్ల ఆగ్రహం ప్రదర్శిస్తారు. కానీ ఈనాడు పత్రిక అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ హత్యాయత్నం కేసులో బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయనపట్ల ఈనాడు పత్రిక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఆయన్ని అవహేళన చేయడమే కాకుండా, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కొన్నేళ్లుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ దుష్ప్రచారం చేస్తోంది. ఇలా పైశాచిక ఆనందం పొందుతోంది. నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తక్కువగా చూపేందుకు కుట్ర పన్నుతోంది.
నిజాలకు పాతర.. ‘ఈనాడు’ ఎత్తుగడ!
కేసులో వాస్తవాలు బయట పడకూడదనే ఈనాడు ఇలా వక్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నిందితుడు పథకం ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడని, మెడ భాగంలో పొడిచి.. జగన్‌ను హత్య చేయాలన్నది అతని లక్ష్యమని స్పష్టం చేసింది. చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని కూడా చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంత తీవ్రమైన దాడిని తక్కువగా చేసి చూపేందుకు ఈనాడు పత్రిక దిగజారుడు కథనాలు ప్రచురిస్తోంది.
కుట్ర కోణం, సూత్రధారులపై సమగ్ర దర్యాప్తు చేయాలి
ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు ఎన్‌ఐఏను, న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కింది అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.
♦ విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితునితో ఉన్న సంబంధం ఏమిటి?
♦ నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుపై గతంలో కేసు ఉన్నా సరే విమానాశ్రయంలోని రెస్టారెంట్‌లో ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్‌ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా!
♦ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో ఉన్నప్పుడు కాఫీ ఇచ్చేందుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావునే ఎందుకు పంపించారు?
♦ హర్షవర్ధన్ చౌదరికి విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు?
♦ హర్షవర్ధన్ చౌదరి, నారా లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment