
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు సులభంగా, అత్యంత పారదర్శకంగా ఇసుక సరఫరా అవుతుండడం ఈనాడుకు కంటగింపుగా మారింది. అందుకే ఎప్పుడూ ఏదో ఒక తప్పుడు కథనం ద్వారా విషంకక్కి ప్రజల్లో అపోహలు సృష్టించడమే పనిగా పెట్టుకుంది. హైదరాబాద్‌కు ఇసుక అక్రమంగా తరలిపోతోందంటూ తాజాగా నిస్సిగ్గుగా కథనాన్ని వండివార్చిన రామోజీకి చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక దోపిడీ మాత్రం కనిపించలేదు. అప్పట్లో ఐదేళ్ల బాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అడ్డూఅదుపులేకుండా ఇసుకను దోచుకుంటే ఎల్లో మీడియాకు అది ‘పారదర్శకంగా’ అనిపించింది. సాక్షాత్తూ అప్పటి సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినా ఆయనా పట్టించుకోలేదు.. సరికదా, ఎల్లో మీడియా కళ్లుండి కబోదిలా నటించింది. చివరికి ఆ వ్యవహారంపై ఎన్జీటీ మండిపడి చంద్రబాబు ప్రభుత్వంపై రూ.100 కోట్ల జరిమానా విధించింది. కానీ, ఇప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంటే మాత్రం ఈనాడు అక్రమం అంటూ గుండెలు బాదుకుంటోంది.
క్యూఆర్ కోడ్ రశీదులు ఇస్తుంటే కనపడదా?
నిజానికి.. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన ఇసుక విధానంలో అంతా పారదర్శకంగా జరుగుతోంది. ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్న జేపీ వెంచర్స్ సంస్థ ఇసుక విక్రయాలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన రశీదులు చేస్తోంది. దాన్ని స్కాన్‌చేస్తే కొనుగోలు సంబంధించిన అన్ని వివరాలు తెలుస్తాయి. ఇంత పకడ్బందీగా ఇసుక విక్రయాలు నిర్వహిస్తుంటే పనిగట్టుకుని అక్రమ రాతలు రాయడాన్ని చూస్తుంటే ప్రభుత్వంపై బురద జల్లడానికి తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. అంతేకాక..
► ఇసుక అక్రమంగా తరలించకుండా సరిహద్దు చెక్‌పోస్ట్‌ల దగ్గర సర్కారు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఇబి)ని నెలకొల్పి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపింది. గనుల శాఖ, రెవెన్యూ, స్థానిక పోలీస్ అధికారులు కూడా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై చర్యలు తీసుకునేలా అధికారాలు కల్పించింది.
► ఈ కేసుల్లో రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చింది.
► ఎస్‌ఈబి టోల్‌ఫ్రీ నెంబర్ 14500తోపాటు జిల్లాల్లోనూ ఇసుక ఆపరేషన్స్‌పై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించింది. గనుల శాఖకు ప్రతి జిల్లాలో ఒక విజిలెన్స్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు.
► ఇవి ఎప్పటికప్పుడు అన్ని ఖనిజాలు, వాటి రవాణా, చెక్‌పోస్టులను పర్యవేక్షిస్తున్నాయి. ఎక్కడైనా ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించి తనిఖీలు జరుపుతున్నాయి.
► ఇంత పకడ్బందీ నిఘా వ్యవస్థ ఉంటే ఏవో కొన్ని లారీల ఫొటోలు వేసి అక్రమ ఇసుకంటూ ఈనాడు ఓ కథనం వండివార్చేసింది.
సరిహద్దుల్లో అక్రమ రవాణా అవాస్తవం
ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులు దాటించి, వత్సవాయి మీదుగా తెలంగాణలోకి ఇసుక అక్రమ రవాణా అవాస్తవ కథనాన్ని ప్రచురించింది. సరుకు రవాణా వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే ప్రచారం కూడా సత్యదూరం. అలాగే..
► అసలు బ్రోకర్ల ద్వారా ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడాలేదు. వర్షాకాలంలో రీచ్‌లలో వరద నీరుచేరే అవకాశం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా 170 శాండ్ డిపోల్లో 82 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేశారు.
► ఇసుక కావాల్సిన వారు నేరుగా డిపోలకు వెళ్లి కావాల్సినంత కొనుగోలు చేసే పరిస్థితి ఉంది.
► ప్రతివారం గనుల శాఖ రీచ్‌ల వారీగా, అందుబాటులో ఉన్న ఇసుక రేట్లతో పత్రికల్లో ప్రకటనలు ఇస్తోంది.
► ఇలా.. ఇంత పారదర్శకంగా, కట్టుదిట్టంగా ఇసుక తవ్వకాలు, సరఫరా జరుగుతున్నా ఈనాడు కళ్లకు మాత్రం అదంతా అక్రమంగానే కనిపిస్తుండడం చూస్తుంటే పచ్చ కామెర్లున్న వ్యక్తికి అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతను గుర్తుచేస్తోంది.
అప్పట్లో ఉచితం పేరుతో వేలకోట్ల దోపిడీ
చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పేరుతో రూ.వేల కోట్ల దోపిడీ జరిగింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాఫియాగా మారి యథేచ్ఛగా దోచుకున్నారు. సాక్షాత్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఈ దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడిచేయడం జగమెరిగిన సత్యం. ఇదంతా అప్పట్లో ఈనాడుకు చిన్న విషయంగానే కనిపించింది. టీడీపీ నేతలు, కార్యకర్తల కనుసన్నల్లోనే ఇసుకరీచ్‌లు నడిచాయి. తద్వారా రూ.వేల కోట్లు పిండుకున్నారు. ఇలా ఇన్ని అక్రమాలు జరిగినా రామోజీ అప్పట్లో తన కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఇప్పుడు అంతా పారదర్శకంగా ఉన్నా నిత్యం రంకెలు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment