సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారం కోల్పోతేనే ఈనాడు రామోజీరావు గంగవెర్రులెత్తిపోతారు. అలాంటిది ఇక అవినీతి కేసుల్లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికి తన ఆత్మబంధువు జైలుకెళ్తే ఇక రామోజీ మామూలుగా ఉంటారా.. కల్లు తాగిన కోతిలా తయారై తన కలంతో విషం కక్కుతారు. ఇప్పుడు ఆయన పూనకం వచ్చినట్లుగా అదే చేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానంపై తెగ దుష్ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రోజురోజుకు జనాదరణ పెంచుకుంటున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాణ్యమైన మద్యం విక్రయించడంలేదని మరో అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఈనాడు ఎప్పటిలాగే మరోసారి బరితెగించింది. ఇటువంటి టీడీపీ, ఈనాడు దుష్ప్రచారాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగానే గతంలో ఎన్నోమార్లు సమర్థంగా తిప్పికొట్టింది. అయినప్పటికీ రామోజీ తన వంకర బుద్ధిని మార్చుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషాన్ని వెళ్లగక్కుతునే ఉన్నారు. అందుకే మరోసారి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్యాక్ట్‌చెక్..
బాబు హయాంలోనే పచ్చ సిండికేట్ దోపిడీ..
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సిండికేట్ మొత్తం ఆ పార్టీ నేతల గుప్పెట్లోనే ఉండేది. బడి పక్కన, గుడి పక్కన అనే విచక్షణ కూడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం దుకాణాలకు అనుమతులిచ్చేసి.. పర్మిట్ రూమ్‌ల పేరుతో అనధికారిక బార్లను తెరిచేసి.. మరో 43వేల బెల్డ్ దుకాణాలను ఏర్పాటుచేసి మరీ మద్యాన్ని ఏరులై పారించారు. ఈ మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి రూ.25 వరకు అధిక ధరకు విక్రయించినా అడిగే నాథుడే లేకుండాపోయారు. ఆనాడు మద్యం దందాపై కిమ్మనకుండా ఈనాడు సహకరించిందన్నది బహిరంగ రహస్యం.
ఆ బ్రాండ్లన్నీ తెచ్చింది చంద్రబాబే..
నిజానికి.. రాష్ట్రంలో మద్యం బ్రాండ్లపై ఈనాడు ఇప్పుడు నీతులు చెబుతుండటం విడ్డూరంగా ఉంది. వివిధ మద్యం బ్రాండ్ల పేర్లను ఉదాహరిస్తూ వాటితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తోంది. కానీ, అవన్నీ చంద్రబాబు బ్రాండ్లనే వాస్తవాన్ని రామోజీరావు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు. అప్పటివరకూ కనిపించని... వినిపించని మద్యం బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రంలోకి తీసుకొచ్చింది చంద్రబాబే అన్నది నిఖార్సైన నిజం. సంధి ప్రేలాపనలు పేలుతున్న రామోజీ.. ఆ వివరాలు ఇవిగో..
► ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూడీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017 నవంబరు 22న అనుమతిచ్చారు.
► గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు కూడా టీడీపీ ప్రభుత్వమే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది.
► హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం చంద్రబాబు నిర్వాకమే. ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది.
► రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు కూడా రామోజీ పార్ట్‌నర్ చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు.
► బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు అనుమతులు ఎప్పుడు ఇచ్చారో తెలుసా రామోజీ.. 2019 మే 14న మీ చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటికి ఇంకా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టలేదు.
► ఆ మర్నాడే టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతినిచ్చిందన్నది పచ్చి నిజం.
డిస్టిలరీలకు అనుమతులిచ్చింది ఆయనే రామోజీ..
ఇక రాష్ట్రంలో మద్యం తయారుచేస్తున్న డిస్టిలరీలన్నింటికీ అనుమతులిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు.
అంటే టీడీపీ నేతలకు చెందిన కంపెనీలకే చంద్రబాబు అనుమతులిచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుల కంపెనీలే మద్యాన్ని తయారుచేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రస్తుతం కూడా ఆ డిస్టిలరీలు తయారుచేస్తున్న మద్యాన్నే రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. అయినా సరే టీడీపీ అధికారంలో ఉంటే మద్యం నాణ్యమైనదీ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంటే మద్యంలో నాణ్యతలేదని దుష్ప్రచారం చేయడం ఈనాడుకే చెల్లింది.
ప్రతీ డిస్టిలరీకి సమాన అవకాశాలు..
అలాగే, మద్యం తయారీ కూడా అప్పట్లో మాదిరిగా ఒకే డిస్టిలరీకి 50శాతం ఆర్డర్ ఇచ్చేయకుండా ప్రతీ డిస్టిలరీకీ సమానంగా అవకాశం వచ్చేలాగా.. 4–6 శాతం ఉండేలా తయారీ ఆర్డర్లు ఇస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీకు ఎక్కడ తప్పు కనిపిస్తోంది?.. ఎక్కడ నాసిరకం ఉంది రామోజీ?
మద్యం డాన్ చంద్రబాబే..
రాష్ట్రంలో మద్యం డాన్ చంద్రబాబే అన్న వాస్తవాన్ని రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉంటే.. అందులో 14 చంద్రబాబు హయాంలోనే అనుమతులిచ్చారు. మరి మద్యం డాన్ చంద్రబాబే కదా రామోజీ. పైగా.. రాష్ట్రంలోని ఈ డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ది. ఆయన టీడీపీ నేత పుట్టా మధుసూదన్ యాదవ్‌కు కుమారుడు కూడా.
► శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబానిది.
► ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు.
► ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగ మేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో దశలవారీ మద్య నియంత్రణ..
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశల వారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం...
► టీడీపీ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉ.10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిస్తూ ఉండేవి. కానీ, ఇప్పుడు సమయాన్ని కుదించి కచ్చితంగా అమలుచేస్తున్నారు. ఉ.10 నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలకు అనుమతించారు.
► బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు రద్దుచేశారు. చంద్రబాబు హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ పూర్తిగా తొలగించింది. అలాగే, గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను అనుమతించారు. అవి అనధికారికంగా బార్లగా చలామణి అయ్యేవి. వాటినీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే రద్దుచేసింది.
► దుకాణాలనూ కుదించారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇక బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులివ్వలేదు.
► షాక్ కొట్టేలా ధరలు పెంచారు. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో చాలాసార్లు చెప్పారు. విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం తమ లక్ష్యం కాదని స్పష్టంచేశారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌ఈటీ) పన్నునూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. మద్యపాన వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్‌ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా పేదలు ఈ వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు.
► మరోవైపు.. అమ్మకాలూ భారీగా తగ్గాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి. అందుకు గణాంకాలే తార్కాణం.
మద్యం నాణ్యతపై ఈనాడు దుష్ప్రచారం
ఈనాడు కుట్రపూరితంగా సాగిస్తున్న మరో దుష్ప్రచారం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం నాణ్యత లేదని.. విషపు అవశేషాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబొరేటరీ పేరిట ఓ అబద్ధపు నివేదికను ప్రచారంలోకి తీసుకొచ్చింది. కానీ, ఈనాడు కుట్ర బెడిసికొట్టింది. తాము అసలు అలాంటి నివేదికే ఇవ్వలేదని ఆ సంస్థ స్పష్టంచేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరంకాని సహజసిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని స్పష్టంచేసింది.
తమ నివేదికను తప్పుగా అన్వయించారని చెప్పింది. అయినా సరే రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ల్యాబ్‌లో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని నివేదిక ఇచ్చింది. మద్యం నాణ్యతపై ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది.
రాష్ట్రంలో మద్యం తయారీకి డిస్టిలరీలు ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయంటే..
1. కాంటినెంటల్ వైన్స్, ఆటోనగర్, విజయవాడ, 1971, ఆగస్టు 9
2. బీఆర్కే స్పిరిట్స్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 1998, సెప్టెంబరు 15
3. పెర్ల్ డిస్టిలరీ లిమిటెడ్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, 1997, ఆగస్టు 14
4. సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చేబ్రోలు, తూ.గోదావరి జిల్లా, 2007, నవంబరు 7
5. సెంటిని బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గండేపల్లి, కృష్ణాజిల్లా 2010, జూన్ 9
6. బీవీఎస్ డిస్టిలరీస్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 2017, జనవరి 2
7. శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్, గంపలగూడెం, కృష్ణాజిల్లా, 2017, సెప్టెంబరు 29
8. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వంగూరు, ప.గోదావరి జిల్లా, 1997, నవంబరు 17
9. జీఎస్‌బీ అండ్ కో, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2008
10. బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొప్పరం, తూ.గోదావరి జిల్లా, 2017, ఆగస్టు 25
11. విశాఖ డిస్టిలరీస్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2019, ఫిబ్రవరి 25
12. పీఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2017, అక్టోబరు 23
13. ఈగిల్ డిస్టిలరీస్, తాడిగొట్ల, కడప, 1974, అక్టోబరు
14. ఎస్వీఆర్ డిస్టిలరీస్, తిరుపతి, 1982
15. శ్రీకృష్ణా ఎంటర్‌ప్రైజెస్, తిమ్మ సముద్రం, చిత్తూరు జిల్లా, 1998, జులై
16. ఎస్‌ఎన్‌జే సుగర్స్, ప్రొడక్ట్స్, వెంకటాచలం, నెల్లూరు జిల్లా, 2018, మే
17. మోహన్ బేవరేజస్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, పల్లూరు, చిత్తూరు జిల్లా, 1978
18. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, నంద్యాల, కర్నూలు జిల్లా, 2016, సెప్టెంబరు
19. ఖోడేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కుప్పం, చిత్తూరు జిల్లా, 1970
20. ప్రాగ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లమిల్లి, తూ.గోదావరి జిల్లా, 1997, మార్చి 31.
Comments
Please login to add a commentAdd a comment