ఏది నిజం ?: రామోజీ.. రామ  రామ!  | Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt | Sakshi
Sakshi News home page

ఏది నిజం ?: రామోజీ.. రామ  రామ! 

Published Thu, Aug 25 2022 3:21 AM | Last Updated on Thu, Aug 25 2022 10:02 AM

Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt - Sakshi

ద్రోణాచార్యుడిని పడగొడితే తప్ప తాము బతకజాలమని తెలుసుకున్నాకే అశ్వత్థామ మరణించాడనే అబద్ధాన్ని గట్టిగా చెప్పి... అది మనిషి కాదు ఆ పేరున్న ఏనుగనే సత్యాన్ని వినిపించనంత మెల్లగా చెప్పాడు ధర్మరాజు. అది ధర్మాన్ని గెలిపించడం కోసం!!. 

ఇక్కడ పూర్తిగా వలువలూడదీసుకుని పత్రికనే అడ్డంపెట్టుకున్న రామోజీరావు వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డిని పడగొట్టడం తన తరంకాదనే నిజాన్ని దిగమింగుకోలేక రోజూ ఆరు కాలాల్లో అబద్ధాలనే అచ్చేస్తుంటాడు. ఆ అక్షరాల్లో నిజమనేది చచ్చిపోయిందన్నదే ఇక్కడ పచ్చి నిజం!.  ... 

ఒక కుట్ర ప్రకారం... రెండు రోజులుగా ‘దివాలా మాటున దోపిడీ... 10వేల కోట్ల ఆస్తుల్ని 500 కోట్లకు అమ్మేస్తారా..’ అంటూ రకరకాల వార్తలు వండుతున్న రామోజీరావుకు గానీ... ఆయన చెప్పినట్టల్లా పలికే తెలుగుదేశం గోబెల్స్‌కు గానీ వేస్తున్న ప్రశ్న ఒక్కటే?. మీరు చెబుతున్నట్లే ఆ ఆస్తుల విలువ 10వేల కోట్లే అనుకుందాం. ఓ 3వేల కోట్లకో... 2వేల కోట్లకో... వెయ్యి కోట్లకో.. పోనీ ఇంతెందుకు... కనీసం 550 కోట్లకు బిడ్‌ వేసినా మీకే దక్కేవి కదా? ఈ ఓపెన్‌ టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చంటూ 2019 మార్చి 8న మీ ‘ఈనాడు’ పత్రికలోనే ఎన్‌సీఎల్‌టీ ప్రకటన ఇచ్చింది కదా? అప్పుడేం చేశారు రామోజీరావు గారూ? మీరెందుకు టెండర్‌ వేయలేదు? మీ తెలుగుదేశం మిత్రులచేత టెండర్‌ ఎందుకు వేయించలేదు? 

ప్రతి వాక్యం అబద్ధమే. టెండర్లలో పాల్గొన్న కంపెనీల నుంచి... టెండరు గెలుచుకున్న కంపెనీకి దక్కే ఆస్తుల వరకూ అన్నీ అశ్వత్థామ తరహా అర్థసత్యాలే. ఇదీ... రామోజీ పెంచి పోషించిన పాత్రికేయం. తొలి నుంచీ ఈ టెండర్లలో వై.ఎస్‌.జగన్‌ నీడ కనిపిస్తోందంటూ... రాంకీ ఎస్టేట్స్, శ్యామరాజు కంపెనీ వంటివి పాల్గొన్నాయని, ఇందులో రాంకీ సంస్థకు జగన్‌ కేసుతో సంబంధం ఉందనే అంశాన్ని ప్రస్తావించారు. కానీ ఇదే టెండర్లలో హైదరాబాద్‌ ఇన్వెస్టరు శ్రీని రాజుకు చెందిన ఐల్యాబ్స్‌ సంస్థ, జాతీయ స్థాయి బ్యాంకింగ్‌ కంపెనీ అయిన కోటక్‌ మహీంద్రా, ఢిల్లీకి చెందిన ప్రుడెంట్‌ ఏఆర్‌సీ, రుద్రవీర్య డెవలపర్స్, యూవీ ఏఆర్‌సీ వంటివి కూడా పాల్గొన్నా... వాటి పేర్లు రాయలేదు. అనిల్‌ అంబానీకి చెందిన టెలికం సంస్థలు ఇలాగే దివాలా బారినపడితే యూవీ సంస్థ రూ.16,000 కోట్లకు బిడ్‌ వేసింది కూడా.

ఇవన్నీ ఒకవేళ ‘ఈనాడు’ ప్రస్తావించి ఉంటే... ఇతర కంపెనీల్లానే ఈ కంపెనీకి కూడా దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బిడ్లు వచ్చాయనే వాస్తవం పాఠకులకు అర్థమయ్యేది. ఐబీసీ (దివాలా చట్టం) అనేది కేంద్రం తెచ్చిన చట్టమని... దాని కింద దివాలా తీసిన కంపెనీల విషయంలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకునేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) తగు అధికారం ఉందని వారికి తెలిసేది. అదే రామోజీరావు భయం కూడా. అందుకే అపోహలు పెరిగేలా రెండు కంపెనీల పేర్లు మాత్రమే రాశారు. 

10 వేల కోట్ల ఆస్తులు... 500 కోట్లకా? 
ఇక  విలువ విషయానికొద్దాం. నిజంగానే 10వేల కోట్ల విలువైన ఆస్తులు రూ.500 కోట్లకు కట్టబెట్టేశారా? చాలా అమాయకంగా.. సిగ్గూఎగ్గూ వదిలేసి మరీ ‘ఈనాడు’ రాసిన అంశమిది. ‘ఇంత చౌకగా విక్రయించేయడానికి బ్యాంకులు కూడా ఎందుకు అంగీకరించాయన్నది అంతు పట్టని అంశం. వీటిని విడివిడిగా వేలం వేసినా ఇంతకు మించిన ధర వచ్చేది కదా?’’ అంటూ అమాయకత్వం ముసుగులో తన మనసులోని దౌర్భాగ్యపు కుట్రలన్నిటినీ బయటపెడుతూ రామోజీ వేసిన ప్రశ్నలివి.  

నిజమే? ఒక్కొక్క ఆస్తినీ విడిగా విక్రయిస్తే బోలెడంత విలువ వచ్చేది. బ్యాంకులకు తమ అప్పుల కన్నా అధికంగా వేల కోట్లు వచ్చేవి. ఏం? మరి బ్యాంకులకు ఈ సంగతి తెలియదా? అన్ని వేల కోట్లు వదిలేసుకుని ముష్టి రూ.541 కోట్లకు ఎందుకు ఆశపడ్డాయి? ఎందుకంటే అందులో పేర్కొన్న ఏ ఒక్క ఆస్తి కూడా బహిరంగ వేలంలో విక్రయించేందుకు అవకాశాలు లేవు కాబట్టి. ప్రతి ఆస్తీ రకరకాల కక్షిదారులతో బోలెడన్ని కేసులతో ముడిపడి ఉంది కాబట్టి. ఒకవేళ అంతా సజావుగా జరిగి... ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వుల ప్రకారం రూ.541 కోట్లకు ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ వీటిని దక్కించుకున్నా... అది ఇంకా రకరకాల కేసుల్లో గెలవాల్సి ఉంది.

వీటిలో పేర్కొన్న  ఆస్తుల్లో చాలా వాటి లీజుల్ని, భూ కేటాయింపుల్ని ఇప్పటికే స్థానిక ప్రభుత్వాలు రద్దు చేశాయి.  ఇవన్నీ చూశాక... తమకు నికరంగా దక్కేది, అది కూడా కేసులన్నీ తేలి ఎప్పటికి దక్కుతుందో తెలియని ఆస్తుల కోసం అన్ని కోట్లు ఎవరైనా ఎందుకు పెడతారు? అందుకే పాల్గొన్న వారిలో... ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ రూ.541 కోట్లతో అధిక మొత్తాన్ని కోట్‌ చేసిన సంస్థగా నిలవగా... మిగిలినవి అంతకన్నా చాలా తక్కువ మొత్తాన్ని కోట్‌ చేశాయి. రామోజీకి నిజాలతో పనిలేదు కాబట్టి... ఇవేవీ చెప్పకుండానే చాలా విలువైన ఆస్తుల్ని కారుచౌకగా కట్టబెట్టేశారంటూ కారుకూతలకు దిగారు. 

మిగతా కంపెనీల గురించి మీకు తెలియదా? 
కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ నివేదిక ప్రకారం... 2016లో వచ్చిన దివాలా చట్టం ప్రకారం పరిష్కారమైన కేసుల్లో 47 శాతం లిక్విడేషన్‌ ప్రక్రియ ద్వారానే సాధ్యమయ్యాయి. లిక్విడేషన్‌ అంటే ఆస్తుల్ని వేలం వెయ్యటం ద్వారా. 14 శాతం కేసులు మాత్రం పరిష్కార ప్రక్రియ ద్వారా పూర్తయ్యాయి. అంటే... బిడ్లు పిలిచి విజయవంతమైన బిడ్డరుకు ఏకమొత్తంగా కంపెనీని అప్పగించటం. ఇలా అప్పగించిన సందర్భాల్లో బ్యాంకులు తమకు రావాల్సిన బకాయిల్లో అత్యధికంగా 90 శాతం మొత్తాన్ని కోల్పోయినట్లు కోటక్‌ సంస్థ తెలియజేసింది. అంటే.. 10వేల కోట్ల బకాయిలుంటే వాటికి దక్కింది వెయ్యికోట్లే అన్నమాట.

తాజా ఇందూ ప్రాజెక్ట్స్‌ విషయం చూసినా అంతే. రూ.4,138 కోట్ల రుణాలకు గాను ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ వేసిన బిడ్‌ 541 కోట్లు. అంటే దాదాపు 13 శాతం. ఈ లెక్కన చూస్తే బ్యాంకులు తమ రుణాల్లో 87 శాతాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీన్నిబట్టి తేలేదేమిటి? వీలు కుదిరిన ప్రతి కేసులో బ్యాంకులు గానీ, పరిష్కార నిపుణుడు గానీ తమకు ఎక్కువ మొత్తం రావటానికి ఆస్తుల వేలానికే మొగ్గు చూపుతాయి. కానీ ఆయా ఆస్తులు రకరకాల కేసులతో ముడిపడి, వేలానికి సాధ్యం కానప్పుడే తమ అప్పును రాబట్టుకోవటానికి రిసల్యూషన్‌ ప్రక్రియకు అవి అంగీకరిస్తాయి. ఇంత చిన్న విషయం రామోజీకి తెలియదా? తెలియక కాదు. తామేం రాసినా తమ పాఠకులు అమాయకంగా నమ్మేస్తారన్నదే ఆయన ధైర్యం!. 

ముఖ్యమంత్రి మేనమామ కొడుకు చేరితే..? 
నిజానికి ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ వేసిన బిడ్‌కు పరిష్కార నిపుణుడు ఓకే అన్నాక... ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ దీన్ని ఆమోదిస్తూ గతేడాది అక్టోబరు 1నే ఉత్తర్వులిచ్చింది. తరవాత ఆ కంపెనీ మెల్లగా చెల్లింపులు చేస్తూ... దానికోసం ఇన్వెస్ట్‌మెంట్లు కూడా సమీకరిస్తోంది. దీన్లో భాగంగానే ఈ ఏడాది మేలో తాము ఇన్వెస్ట్‌మెంట్‌ చేశామని, తమ కుమారుడు డైరెక్టరుగా చేరాడని వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి మామ రవీంద్రనాథ్‌ రెడ్డి మంగళవారం చెప్పారు కూడా.

అయినా టెండర్లో ఆస్తులు దక్కించుకున్న సంస్థలో ఏడు నెలల తరవాత ఓ వ్యక్తి డైరెక్టరుగా చేరితే... అదంతా ముఖ్యమంత్రి చక్రం తిప్పితేనే సాధ్యమైందన్న దౌర్భాగ్యపు రాతలు రాసిన వారిని ఏమనాలి? మేనమామ కొడుకు డైరెక్టరుగా చేరాడని దాన్ని ముఖ్యమంత్రికి అంటగడితే ఎలా? మీ ఆస్తులు మీ మేనమామ కొడుకులకు ఇచ్చేస్తారా రామోజీరావు గారూ? అందరూ మీలా బినామీలను నమ్ముకుని రాజ్యం చేస్తుంటారనుకున్నారా? ఉద్యోగులను సైతం బినామీగా వాడుకుని మీరు సృష్టించుకున్న ఫిలిం సిటీ గురించి తెలియనిదెవరికి? చట్టాల ఉల్లంఘనకు పక్కదార్లు వెతకటంలో మీ తరవాతే కదా ఎవరైనా? లీజుల పేరిట బయటివారితో పాటు సొంత తోడల్లుడి ఆస్తుల్ని సైతం కబ్జా చేసిన చరిత్ర మీది. బంధువుల గురించి మీకు తెలిసినంతగా వేరెవరికీ తెలియదన్నదే నిజం కూడా!!. 

అసలు లేపాక్షి కథ ఇదీ... 
లేపాక్షి నాలెడ్జ్‌ సిటీ గురించి రాసిన రాతల్లోనూ వాస్తవాలు దేవతా వస్త్రాలే. ఈ భూములన్నీ బెంగళూరు విమానాశ్రయానికి అతి సమీపంలో ఉంటాయని, చాలా విలువైనవని, సరిహద్దు వీటితోనే ఆరంభమవుతుందని ఊహలను అచ్చేశారు. వాస్తవానికి అనంతపురం– బెంగళూరు మధ్య దూరం 240 కిలోమీటర్లు. వీటికి మధ్యలో ఉంటుంది చిలమత్తూరు. దాన్ని ఆనుకునే గోరంట్ల మండలం. ఎటు చూసినా 120 కిలోమీటర్ల దూరం. రెండూ చిత్రావతి పరివాహక ప్రాంతాలే అయినా... 1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు పరగోడు వద్ద కర్ణాటక ఓ బ్యారేజీ నిర్మించింది. దీంతో ఈ ప్రాంతం ఎండిపోయి బోర్లలోనూ నీరు పడని స్థితికి చేరింది.

పంటలు లేక, భూగర్భ జలాలు లేక అల్లాడుతున్న ఆ గ్రామాల్లో పరిశ్రమలొస్తే తప్ప పరిస్థితి మారదని భావించి వైఎస్సార్‌ ప్రభుత్వం 2006లో సైన్స్‌ సిటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీఐఐసీ భూసేకరణకు ప్రకటనలివ్వగా... నీటి వసతి లేని భూములు తమకెందుకంటూ సైన్స్‌ సిటీ వెనక్కి వెళ్లిపోయింది. ఇతర పరిశ్రమల్ని ఆహ్వానించగా ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో... భూసేకరణ నిలిపేశారు కూడా. తరవాత లేపాక్షి సంస్థ ముందుకు రావటంతో... వారిచ్చిన డబ్బుతోనే భూసేకరణ చేసింది ఏపీఐఐసీ. ఈ వాస్తవాల్ని ఎక్కడా చెప్పని ‘ఈనాడు’... అడుగడుగునా అసత్యాలతో అదో పెద్ద కుంభకోణమని, చాలా విలువైన భూముల్ని ఆనాడే వైఎస్‌ ప్రభుత్వం లేపాక్షికి కట్టబెట్టేసిందని రాసుకొచ్చింది. మరీ ఇంత దుర్మార్గమా రామోజీ? మీ రాతల్లో నిజమెంతని మిమ్మల్ని మీరు ఎన్నడైనా ప్రశ్నించుకున్నారా? 

100 కిలోమీటర్లంటే అంత దగ్గరా? 
విశాఖ– శ్రీకాకుళం మధ్య దూరం 100 కిలోమీటర్లు. మరి విశాఖకు అత్యంత సమీపంలో ఉన్నట్టేనా? విశాఖలో ఉన్న రేట్లే శ్రీకాకుళంలోనూ ఉంటాయా? ఎందుకీ దగుల్బాజీ రాతలు? నిజానికి అప్పట్లో ఎకరా 20వేలు చెప్పినా ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే భూగర్భ జలాలు లేవు. వర్షం ఊసే ఉండదు. అలాంటి జిల్లాలో పరిశ్రమలొస్తాయంటే... వాటికోసం నీటి వసతి కల్పించటమూ నేరమేనట రామోజీ దృష్టిలో!!. నీళ్లు లేకుంటే పరిశ్రమలు ఎందుకొస్తాయి రామోజీరావుగారూ? ఇలాంటిదేదో మీ చంద్రబాబు చేస్తే భూమీ ఆకాశం బద్దలైపోయేటట్లు ఆయన విజన్‌ని పొగిడేసేవారు కాదూ? ఎక్కడో అనంతపురంలో ఎకరా 70– 80 వేలు కూడా చేయని భూములు ఎకరా రూ.1.75 లక్షల చొప్పున విక్రయించటమే నేరంగా కనిపించిందా? హైదరాబాద్‌ నడిబొడ్డున హైటెక్‌ సిటీ కట్టానని చెప్పే మీ మిత్రుడు.. దాని పక్కనే గచ్చిబౌలిలో 500 ఎకరాలను ఊరూపేరూ లేని బిల్లీరావు, పేట్‌రావులకు ఎకరా రూ.50వేల చొప్పున క్రీడల కోసం కట్టబెట్టేస్తే మీకు అదో మహాద్భుతంలా కనిపించడం నిజం కాదా? రాష్ట్రంలో క్రీడలకు మహర్దశ పట్టిందని, ఇక ఒలింపియన్లు కూడా తయారవుతారంటూ రంగురంగుల గ్రాఫిక్స్‌ చూపిస్తూ మీరు చెలరేగిపోలేదా? ఆంధ్రప్రదేశ్‌ ఇక క్రీడా రాజధాని కాబోతోందని చెప్పి ఎంతమంది క్రీడాకారుల్లో ఆశలు పుట్టించి చిదిమేయలేదు? ఊరూపేరూ లేని సూట్‌కేసు కంపెనీకి అంతర్జాతీయ కంపెనీతో ఎంఓయూ ఉందంటూ రాష్ట్రంలోని స్టేడియాలను కూడా దోచిపెట్టేందుకు తెరతీసిన మీ నీతి... నిజాయితీ గురించి తెలియనిదెవరికి రామోజీరావు గారూ!!. 

ఆ ఆస్తుల వెనక కేసులివీ... 
లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
స్థలం: మర్రిమాకులపల్లి, చిలమత్తూరు మండలం,
అనంతపురం జిల్లా 
విస్తీర్ణం: 8,648 ఎకరాలు 

అనంతపురంలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ను అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసీ 8,648 ఎకరాలు కేటాయించింది. ఈ భూములకు సంబంధించి రైతులతో కొన్ని సమస్యలున్నాయి. పైపెచ్చు వీటి విక్రయాలు/ రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. సీబీఐ 2013లో ఛార్జిషీటు నమోదు చేసింది. తరవాత 8,648 ఎకరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది కూడా.  వీటన్నిటికీ తోడు ఈ భూములను అభివృద్ధి చేయలేదనే కారణంతో లేపాక్షి కేటాయింపులను నాటి ప్రభుత్వం రద్దు చేసింది కూడా. దీనిపై లేపాక్షి సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తాము తనఖా పెట్టిన 4,396 ఎకరాలకు సంబంధించి... ప్రభుత్వ రద్దుపై స్టే తెచ్చుకుంది. విచారణ కొనసాగుతోంది.

    
అస్తిత్వ రియల్టర్స్‌ అండ్‌ సింధూర ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
స్థలం: బాచుపల్లి, కుత్బుల్లాపూర్‌ మండలం,
మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణ 
విస్తీర్ణం: 11.5 ఎకరాలు  

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో... సింధూర ప్రాపర్టీస్‌తో కలిసి ఏకమొత్తంగా హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్, రహదారి విస్తరణ తదితర సమస్యలున్నాయి. ఆ భూమిలో కొంత భాగం రహదారి విస్తరణలో పోయింది కూడా.  
సుందరీ థీమ్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
స్థలం: కొల్తూరు, మల్కాజ్‌గిరి జిల్లా,  తెలంగాణ 
విస్తీర్ణం: 35 ఎకరాలు 

షామీర్‌ పేటలో గృహనిర్మాణ ప్రాజెక్టు కోసం 35 ఎకరాలు కొన్నారు. అందులో కొంత భూమి కన్జర్వేషన్‌ జోన్‌ పరిధిలోకి వస్తోంది. దాంతో చాలా తక్కువ భూమి మాత్రమే హౌసింగ్‌కు అందుబాటులో ఉంది.  
వీకే ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
స్థలం: మాదాపూర్, శేరిలింగంపల్లి మండలం, తెలంగాణ. 
విస్తీర్ణం: 5.27 ఎకరాలు 

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీకి సమీపంలోని దుర్గం చెరువును ఆనుకుని ఉన్న 5.27 ఎకరాల స్థలం ఇది. కానీ ఆ భూములు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం నోటీసులివ్వటంతో ఈ ప్రాజెక్టుకు సమస్యలు తలెత్తాయి. 

రెడ్‌ఫోర్ట్‌ అక్బర్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
స్థలం: బాచుపల్లి, హైదరాబాద్‌. తెలంగాణ 
విస్తీర్ణం: 90 ఎకరాలు  

ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లతో కలసి జాయింట్‌ వెంచర్‌ కింద బాచుపల్లిలో టౌన్‌షిప్‌ నిర్మించాలి. హౌసింగ్‌ బోర్డ్‌కుచెందిన డెక్కన్‌ ఇన్‌ఫ్రా అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (దిల్‌) నుంచి ఈ భూములను కంపెనీ పొందింది. 90 ఎకరాల కోసం ‘దిల్‌’కు రూ.280కోట్లు చెల్లించారు. అందులో అత్యధిక భాగాన్ని ‘ఆర్‌ఏపీపీఎల్‌’లోని జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి చెల్లించారు. దాంతో ఈ భూముల కేటాయింపుపై న్యాయ వివాదాలు తలెత్తాయి. జాయింట్‌ వెంచర్‌ కంపెనీ  ‘ఆర్‌ఏపీపీఎల్‌’కు అనుకూలంగా ఆర్బిట్రేషన్‌ తీర్పు వచ్చింది. కానీ ఈ తీర్పును కోర్టులో ‘దిల్‌’ సవాల్‌ చేసింది. ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు పెండింగులో ఉంది.  
ఇందూ టెక్‌జోన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
స్థలం: మామిడిపల్లి, çరంగారెడ్డి జిల్లా, తెలంగాణ. 
విస్తీర్ణం: 150 ఎకరాలు 

టీఎస్‌ఐఐసీ శంషాబాద్‌ వద్ద  కేటాయించిన 150 ఎకరాల్లో ఇందూ టెక్‌జోన్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌ ఐటీ సెజ్‌ను నిర్మించాలి. ఈ కేటాయింపుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ 150 ఎకరాలను ఈడీ జప్తు చేసింది. అనంతరం ఈ కేటాయింపును టీఎస్‌ఐఐసీ రద్దు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని 2015, సెప్టెంబరు 24న ప్రకటించింది. దీనిపై కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే పొందింది. ఈ కేసుతో పాటు... భాగస్వాములు దాఖలు చేసిన ఇతరత్రా కేసులూ ఉన్నాయి. 

ఎస్‌పీఆర్‌ ప్రోపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
(ఇందూ టెక్‌జోన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) 
స్థలం: మామిడిపల్లి,, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. 
విస్తీర్ణం: 100 ఎకరాలు 

టీఎస్‌ఐఐసీ శంషాబాద్‌ వద్ద  అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ (సేల్‌ డీడ్‌ కాలేదు) కింద కేటాయించిన 100 ఎకరాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంది. ఈ కేటాయింపుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ భూములను ఈడీ జప్తు చేయడంతో ప్రాజెక్టు సాధ్యపడలేదు. దీంతో టీఎస్‌ఐఐసీ ఈ కేటాయింపును రద్దు చేసి వాటిని స్వాధీనం చేసకుంటామని 2015, సెప్టెంబరు 24న ప్రకటించింది. 
ఈక్విటీ కేర్‌ ఇండియా లిమిటెడ్‌
స్థలం: నాగ్‌పూర్, మహారాష్ట్ర 
విస్తీర్ణం: 74 ఎకరాలు 

కేర్‌ హాస్పిటల్స్‌తో జాయింట్‌ వెంచర్‌ కింద నాగ్‌పూర్‌లో టౌన్‌షిప్‌ నిర్మించే ప్రాజెక్ట్‌ ఇది. 74 ఎకరాల కేటాయింపు కోసం మహారాష్ట్ర ఎయిర్‌ పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎంఏడీసీ)కు  నిధులు చెల్లించారు.  కానీ ఎంఏడీసీ ఆ భూములను అప్పగించ లేదు. దాంతో అయితే భూమి ఇవ్వాలని, లేదంటే తమ నిధులను తిరిగి చెల్లించాలని ఎంఏడీసీని ఈక్విటీ కేర్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ 2008 నుంచీ అడుగుతోంది. ఆ అంశం ఇప్పటికీ పెండింగులోనే ఉంది.  

‘ఇందు’కేనా ఆ చిందులు? 
అయినా ఎప్పుడో 11 నెలల కిందట 2021 అక్టోబరు 1న ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఉత్తర్వుల్ని పట్టుకుని... ఏదో  ఇవ్వాళే జరిగినట్లుగా పేజీలకు పేజీలు విషం చిమ్మారెందుకు? మీ కథనాన్ని పట్టుకుని టీడీపీ గోబెల్స్‌ రెచ్చిపోతున్నారెందుకు? శివాలెత్తిపోతున్నారెందుకు? ‘మార్గదర్శి’ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసినందుకా? హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి... ఇక సుప్రీంకోర్టులో ఎవరూ సవాల్‌ చేయకపోతేæ ఏ కేసూ ఉండదనుకున్నారేమో!!. ఆ హైకోర్టు తీర్పు సరికాదని, మీరు ఎలా తీరుస్తారో కూడా తెలియకుండా 2,600 కోట్ల ప్రజాధనాన్ని చట్టవిరుద్ధంగా సేకరించారని, ఇదేమీ చూడకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి సమీక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసేసరికి మీ అంచనాలన్నీ తలకిందులయినట్లున్నాయి. ఆగ్రహంతో ఊగిపోతూ రాత్రికిరాత్రి ఎప్పుడో పాత ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు తీసి... ప్రభుత్వం ఏదో చేసేస్తోందంటూ పతాక శీర్షికల్లో పేజీలకు పేజీలు బురద నింపేశారు. బంధువుల్ని సైతం న్యాయస్థానాలకీడ్చి కోర్టు పోరాటాల్లో పీహెచ్‌డీ చేసిన మీరు... ఈ మాత్రం ఎందుకు ఊహించలేకపోయారు?  

భూముల విలువ గురించి మీరే చెప్పాలా? 
భూముల విలువ గురించి మీలాంటి వాళ్లు ఎంత తక్కువ చెబితే అంత మంచిది రామోజీరావు గారూ!!. అక్కడ భూముల విలువ ఎకరా రూ.15 లక్షలు పలుకుతుండగా 1.75 వేలు మాత్రమే చెల్లించి ఏపీఐఐసీ సమీకరించిందంటూ నంగనాచి కబుర్లెందుకు? అక్కడ 2008 సమయంలో ఎకరా కనిష్ఠంగా 20వేలు– గరిష్ఠంగా 70 వేలు మాత్రమే పలికిందంటూ స్థానిక అధికారులు ఇచ్చిన పత్రాలు మీరెప్పుడూ చూడలేదా? అయినా ప్రభుత్వ అండతో రెవెన్యూ అధికారుల్ని ఫిలింసిటీ భూముల్లో కూర్చోబెట్టి మరీ బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్న మీకు... పేదల గురించి, వారి భూముల గురించి మాట్లాడే హక్కు ఉందనుకుంటున్నారా? అయినా సీబీఐ ఛార్జిషీటులో పేర్కొన్నంత మాత్రాన అది నిజమైపోతుందా? ఛార్జిషీటులో సీబీఐ ఏం చెప్పినా అవన్నీ ఆరోపణలే కదా? అవే నిజమైనట్లు పేజీలకు పేజీలు విషం చిమ్మటం దేనికి నిదర్శనం? పన్ను కట్టకుండా ఎగ్గొట్టినందుకు మీకు ఐటీ శాఖ నోటీసివ్వటమే కాదు. ఐటీ ట్రిబ్యునల్‌ కూడా దాన్ని నిర్ధారించింది. అయినా సరే... పై కోర్టుకు... ఆ పైకోర్టుకు అంటూ న్యాయపోరాటాలు సాగించటమే కదా మీకు తెలిసిందల్లా!!.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement