'బాబుకోసం... దళిత రాగం' | Eenadu Ramoji Rao Yellow Media Fake News On CM Jagan Govt | Sakshi
Sakshi News home page

దారుణాలు జరిగిన... ‘నాడు’ నోరెత్తని రామోజీ.. 'బాబుకోసం... దళిత రాగం'

Published Thu, Mar 30 2023 2:57 AM | Last Updated on Thu, Mar 30 2023 5:08 AM

Eenadu Ramoji Rao Yellow Media Fake News On CM Jagan Govt - Sakshi

చంద్రబాబు అండతో కీచకపర్వం
పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టిన టీడీపీ నేతలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో దళితులు భయం భయంగా బతకాల్సిన దుర్భర పరిస్థితులు ఉండేవి. దళిత మహిళలకు ఏమాత్రం రక్షణ ఉండేది కాదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం  పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో జరిగిన అమానుష దుర్ఘటన. అక్కడి సర్వే నంబర్‌ 77లో దాదాపు 80 సెంట్ల స్థలంలో రంజా దుర్గమ్మ, దువ్వాడ అక్కమ్మ సహా 14 దళిత కుటుంబాలు సాగు చేస్తున్నాయి. కొన్ని కుటుంబాలు ఇదే స్థలంలో నివాసం కూడా ఉంటున్నాయి.

ఈ విలువైన స్థలంపై టీడీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ నాయకుల కన్ను పడింది. 2017 డిసెంబర్‌ 19వ తేదీన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అప్పటి మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనుచరులు, టీడీపీ నాయకులు తెగబడ్డారు. వారి దుశ్చర్యను అడ్డుకునే ప్రయత్నం చేసిన దళిత మహిళ రంజా దుర్గమ్మ వస్త్రాలు చింపేసి బయటకు ఈడ్చేశారు. ఇతర దళితులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. మహిళ అనే కనికరం లేకుండా అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి అండ చూసుకుని టీడీపీ నేతలు కీచకుల్లా వ్యవహరించారు. 

‘ఈనాడు’ ఓ వార్త రాస్తుంది. దానికి మరిన్ని అబద్ధాలు జోడించి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పిస్తుంది. నిజాలనుకునేలా జనాల్లోకి బలంగా తీసుకెళ్లటానికి ఆ ఆరోపణలనే పుస్తకాలుగా కూడా వేస్తుంది. మళ్లీ ఆ పుస్తకాల్లోని అంశాలను ‘ఈనాడు’ యథాతథంగా బ్యానర్‌ కథనాలుగా వండి వారుస్తుంది. దానిపై మళ్లీ టీడీపీ ప్రెస్‌మీట్లు షరా మామూలే. నిజానికిదంతా ఓ సైకిల్‌. మాఫియాలా మారిన ఎల్లో మీడియా నడిపించే చక్రం. ప్రత్యామ్నాయ మీడియా లేనన్నాళ్లూ ఈ చక్రమే రాష్ట్రాన్నేలింది.

ఆర్థిక అరాచకాలతో రామోజీరావు వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించినా.. సింగిల్‌గా గెలిచే సత్తా లేకున్నా చంద్రబాబు నాయుడు ఏకంగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నా... పనికిమాలిన అనుయాయుల్ని అందలాలెక్కించి వ్యవస్థలను భ్రష్టు పట్టించినా... అదంతా ఈ మాఫియావల్లే సాధ్యమైంది. కాకపోతే ఇపుడు ప్రత్యామ్నాయ మీడియా ఉంది. సంఘటనల వెనక వాస్తవాలను క్షణాల్లో వివరించే సోషల్‌ మీడియా ఉంది. అయినా రామోజీ మాత్రం మారలేదు. క్షుద్ర ప్రచారం మానలేదు. ‘దళితులపై దమనకాండ’ అంటూ మంగళవారం వేసిన కథనం అలాంటిదే. దాన్లో నిజానిజాల్ని చెప్పే ప్రయత్నమిది... 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకుని వైఎస్సార్‌ సీపీకి ద్రోహం చేశారు ఓ ఎమ్మెల్యే. పైపెచ్చు ఆమె మీడియా ముందుకొచ్చి.. తన నియోజకవర్గానికి వెళ్లాలంటే భయంగా ఉందని, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపణలు చేసింది. ‘ఈనాడు’ దృష్టిలో అది...‘దళితులపై దమనకాండ’. ఔరా!! మరీ ఇంత దిగజారుడా రామోజీ? 

కడప వెటర్నరీ ఆసుపత్రిలో డిప్యూటీ డైరెక్టరుగా పనిచేస్తున్న అచ్చెన్నకు... అక్కడి అసిస్టెంట్‌ సర్జన్‌ సుభాష్‌ చంద్రబోస్‌ తో విభేదాలున్నాయి. బోస్‌ను సరెండర్‌ చేశారు అచ్చెన్న. దీంతో కక్ష పెంచుకున్న బోస్‌.. మరో ఇద్దరితో కలిసి అచ్చెన్నను అపహరించి, హతమార్చినట్లు పోలీసులు కనుగొన్నారు. నిందితుల్ని అరెస్టు చేశారు కూడా. అచ్చెన్న దళితుడు కాబట్టి దీన్ని దళితులపై జరిగిన దమనకాండగా రాసేశారు రామోజీ!!. అసలు ఈ సంఘటనతో ప్రభుత్వానికి గానీ, అధికార పార్టీకి గానీ ఏం సంబంధం? ఎందుకీ నీచపు రాతలు? 

ఈ రెండు సంఘటనలూ చాలవూ... ‘ఈనాడు’ ఏ స్థాయిలో తెలుగుదేశం ఎజెండాను మోస్తోందో చెప్పటానికి!. ఇవి చాలవూ అబద్ధాలే ఆయుధాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో రామోజీ ఏ రకమైన యుద్ధం చేస్తున్నారో తెలియటానికి? ఒక్కటైతే నిజం! తమకు న్యాయం చేస్తున్నందుకు బీసీలు, దళితులు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు అంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అండగా నిలుస్తున్నారు.

ఇది నారా వారికి నిద్రను దూరం చేస్తోంది. సేమ్‌ టు సేమ్‌ ఆయన ఎజెండాను మోస్తున్న రామోజీకి కూడా. అందుకే ఈ రాతలు. విచిత్రమేంటంటే 2021లో దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 3.95 శాతం ఏపీలోనే జరిగాయంటారు రామోజీ. పైపెచ్చు దానికి ముందటేడాదితో పోలిస్తే 3.28 శాతం పెరిగాయంటారు కూడా. కానీ దేశంలో ఏపీ ఏ స్థానంలో ఉంది? చంద్రబాబు హయాంతో పోలిస్తే తగ్గాయా... పెరిగాయా... అనే విషయాలు రాయరు. ఎందుకంటే అసత్యాలు, అర్ధసత్యాలే తమకు అనుకూలంగా ఉంటాయి కనక!!. 

ఇది కాదూ... దమనకాండకు అర్థం! 
‘దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా?’ అనేది ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్న. ఈ ఒక్కటి చాలు... చంద్రబాబు మనసులో దళితులకున్న స్థానమేంటో చెప్పడానికి. చేతల్లోనూ బాబు హయాంలో దళితులపై ఏ స్థాయిలో దమనకాండ జరిగిందో సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ వెల్లడించే నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికే చెబుతోంది. కాకపోతే... దీన్లోని వాస్తవాలను ‘ఈనాడు’ చెప్పదంతే!. అవేంటంటే... 

టీడీపీ హయాంలో కంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో దళితులపై దాడులు తగ్గాయని, రాష్ట్రంలో ప్రస్తుతం దళితుల భద్రతకు పూర్తి భరోసా లభిస్తోందని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలతో నివేదించింది. దీనిప్రకారం చూస్తే...  

నాడు... టీడీపీ హయాంలో... 
2014– 2018 మధ్య రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై 17,091 నేరాలు జరిగాయి. అంటే... సగటున ఏడాదికి 3,418 ఘటనలు. అంతేకాదు! మొత్తం ఘటనల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగినవి ఏకంగా 31 శాతం!!. రాష్ట్రంలో దళితులపై 2014లో  4,114 దాడులు, 2015లో 4,415 దాడులు, 2016లో 2,335 దాడులు జరగడం నాటి దారుణ పరిస్థితికి నిలువుటద్దం. 

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో... 
రాష్ట్రంలో 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి 2021 వరకు తీసుకుంటే... ఈ మూడేళ్లలో దళితుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు.. రాష్ట్రంలో హోంశాఖ బాధ్యతలనూ దళిత మహిళకే అప్పగించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఫలితం.. 2019– 21 మధ్య మూడేళ్లలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల సంఖ్య 7,046. అంటే... సగటున ఏడాదికి 2,348 ఘటనలు. టీడీపీ హయాంతో పోలిస్తే దాదాపు 32 శాతం తగ్గుదల. రాష్ట్రంలో మొత్తం నేర ఘటనల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన ఘటనల శాతం కూడా 31 నుంచి 21 శాతానికి తగ్గింది. ఈ పచ్చి నిజాన్ని రామోజీ చస్తే చెప్పరు. 

క్రైమ్‌ రేట్‌లో నాడు... నేడు 
► టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన నేరాల శాతం రాష్ట్రంలో అత్యధికం. 2014లో దేశంలో మొత్తం నేరాల్లో దళితులపై జరిగినవి 23.4 శాతం కాగా... ఏపీలో ఇది ఏకంగా 48.7 శాతం. ఇక 2015లో దేశంలో ఇది 22.3 శాతం కాగా... ఏపీలో ఏకంగా 52.3 శాతం. బాబు హయాంలో దళితుల దుస్థితిని చెప్పటానికి ఇంతకన్నా లెక్కలు అక్కర్లేదేమో!!. 

► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై క్రైమ్‌రేట్‌ గణనీయంగా తగ్గింది. 2020లో దేశంలో దళితులపై క్రైమ్‌రేట్‌ 25 శాతం కాగా ఏపీలో ఇది 23 శాతం. ఇక 2021లో దేశంలో ఇది 25.3 శాతం కాగా... ఏపీలో 23.8 శాతం.  

ఏపీలో నేరాలు తగ్గినా కనిపించవా..? 
► దేశం మొత్తమ్మీద ఎస్సీ, ఎస్టీలపై జరిగిన నేరాల్లో ఏపీ వాటా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అత్యధికం. 2014లో దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 8.1 శాతం ఏపీలోనే జరిగాయి. ఇక 2015లో ఇది 9.2 శాతం. 

► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 2019లో ఇది 4.4శాతం, 2020లో 3.9 శాతం, 2021లో 3.95 శాతంగా ఉన్నాయి. కాకపోతే ‘ఈనాడు’ ఇవేమీ రాయదు. 2021లో దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో ఏపీలోనే 3.95 శాతం జరిగాయని, ఇది అత్యంత దారుణమని రాసేస్తారు. బాబు హయాంలో ఇది ఏకంగా 9.2 శాతం ఉందని మాత్రం చెప్పరు. మరీ ఇంత దారుణమా రామోజీ? 

నాడు రెండో స్థానం... నేడు పదో స్థానం 
టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌... దళితులపై దాడుల్లో ఏకంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉండేది. 2014లో ఏపీది మూడో స్థానం కాగా... 2015లో రెండోస్థానం. కానీ వైఎస్‌ జగన్‌ హయాంలో 2019లో ఏపీ 9 స్థానంలోను... 2020, 2021లలో పదో స్థానంలోనూ ఉంది. దీనర్థం దళితులపై దాడులు పూర్తిగా తగ్గాయని. మరి దీన్నెందుకు ‘ఈనాడు’ రాయదు? 

నాడు నిర్లక్ష్యం... నేడు సత్వర దర్యాప్తు 
ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్ని బాబు ప్రభుత్వం పట్టించుకుంటే ఒట్టు. దాడులకు తెగబడే వారి కొమ్ముకాస్తూ దర్యాప్తును ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసేది. 2014లో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల దర్యాప్తునకు సగటున 611 రోజులు పడితే... 2015లో 518రోజులు, 2016లో 453 రోజులు పట్టాయి. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇది గణనీయంగా తగ్గింది. ఈ కేసుల దర్యాప్తునకు సగటున 2019లో 259 రోజులు, 2020లో 163రోజులు, 2021లో 97 రోజులు పట్టాయంటే... ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. 2021లో ఎస్సీ, ఎస్టీలపై దాడుల ఘటన విచారణకు సగటున 83 రోజులే పట్టాయి కూడా!!. 

ఛార్జిషీట్లు దాఖలు చేయటంలోనూ అంతే!. కేంద్రం నిర్దేశించిన 60 రోజుల గడువులోగా... 2014, 2015లో 15శాతం కేసుల్లో, 2016లో 16శాతం, 2017లో 20 శాతం కేసుల్లో మాత్రమే చార్జ్‌షీట్లు వేయగలిగారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2020లో 60 శాతం కేసుల్లో , 2021లో 61 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్‌షీట్లు వేశారంటే పరిస్థితి అర్థంకాక మానదు.  

బాధితులకు పరిహారంలోనూ... 
దాడుల బాధితులైన ఎస్సీ, ఎస్టీలకు నష్టపరిహారం ఇవ్వటంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించలేకపోయింది. టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు బాధిత ఎస్సీ, ఎస్టీలకు రూ.52.32 కోట్ల నష్టపరిహారం అందించగా...  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలోనే 2019–21 మధ్య పరిహారాన్ని గణనీయంగా పెంచి బాధితులకు రూ.87.70కోట్ల పరిహారం పంపిణీ చేసింది. ఇలా ఏ రకంగా చూసినా... దమనకాండ ఎవరి హయాంలో జరిగిందో, దగ్గరకు తీసుకుంటున్నదెవరో తేలిగ్గానే తెలుస్తుంది. తెలియనట్టు నటించేదల్లా ఒక్క రామోజీరావు మాత్రమే!!. 

దుష్ప్రచారమే ‘ఈనాడు’ అజెండా 
అసత్యాలు, అర్ధసత్యాలే ‘ఈనాడు’ ఎజెండా అన్నది తెలియనిదేమీ కాదు. దీన్ని కొనసాగిస్తూ ‘దళితులపై దమనకాండ’ కథనంలోనూ పలు సంఘటనలను ప్రస్తావించారు రామోజీరావు. కాకపోతే ఆ సంఘటనలన్నిట్లోనూ వాస్తవాలను తనకు నచ్చినట్లుగా వక్రీకరించారు. ప్రభుత్వానికి సంబంధం లేకున్నా... అంతా ప్రభుత్వ తప్పిదమేనన్నట్లుగా రాసి విషంగక్కారు. ఆయా సంఘటనల్లోని వాస్తవాలు ఇవీ... 

► శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కాలపర్తికి చెందిన దళితుడు మురపాక మహేశ్‌ భార్య శ్రీదేవి కుటుంబ కలహాలతో 2022 సెప్టెంబరు 4న ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మహేశ్‌ను విచారించారు. భార్య ఆత్మహత్యతో మనస్తాపానికి గురైన మహేశ్‌ 2022 సెప్టెంబరు 6న తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రభుత్వంతో ముడి పెట్టడం ఎంత వరకు కరెక్టు? 

► చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండలో దళిత దంపతులు ఆవుల నరసమ్మ, కృష్ణమూర్తి టీడీపీ కార్యకర్తలు. బీసీ వర్గానికి చెందిన పాళెం శ్రీనివాసులు, రమణమ్మ దంపతులు కూడా టీడీపీ వారే. ఆ రెండు కుటుంబాల మధ్య భూవివాదం ఉంది. ఒకరోజు పాళెం శ్రీనివాసులు దంపతులు... నరసమ్మ, కృష్ణమూర్తిలపై రోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. ఇక్కడ దాడికి గురైంది, దాడి చేసిందీ టీడీపీ వారే. కానీ వైఎస్సార్‌సీపీ వర్గీయులు దళితులపై దాడి చేశారనే తన మార్కు అబద్ధంతో ‘ఈనాడు’ కథనాన్ని వండేసింది. 

► సామర్లకోట బలుసులపేటకు చెందిన మహిళ  దువ్వా మల్లిక వార్డు వలంటీర్‌గా చేస్తున్నారు. 2022, జనవరి 1న ఆమె పింఛన్ల పంపిణీకి వెళుతుండగా ఆలపు గిరిశ్‌ బాబు అనే దళితుడు దారిలో అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. పించన్‌ సొమ్మును లాక్కోబోవటంతో మల్లిక ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సురేశ్‌బాబు జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన చేయడంతో సీఐ, ఎస్సైలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇందులో వైఎస్సార్‌సీపీ నేతల ప్రమేయం ఏమీలేదు.  ఆరోపణలొచ్చిన పోలీసులు సస్పెండ్‌ అయ్యారు. కానీ వైఎస్సార్‌సీపీ నేతల ఒత్తిడితోనే గిరీశ్‌ను పోలీసులు వేధించారని ఈనాడు అభూతకల్పనలను ప్రచురించింది. 

► ప్రకాశం జిల్లా ములగంపాడులో యువకుల మధ్య ఘర్షణను దళితులపై దాడిగా ఈనాడు వక్రీకరించింది. ఎందుకంటే దాడి చేసిన వారిలోనూ దళితులున్నారు. వెంకటేశ్వర కాలనీలో 2022, జూలైలో యువకుల మధ్య బైక్‌ మీద ఫీట్స్‌తో చెలరేగిన వివాదం తీవ్రమైంది. ఇరు వర్గాల యువకులూ పరస్పరం దాడులు చేసుకున్నారు. 14 మంది యువకులు తమ ప్రత్యర్థి యువకులపై తెల్లవారు జామున కర్రలతో దాడి చేసి 10మందిని గాయపరిచారు.  దాడి చేసిన వారిలో ఐదుగురు దళితులు, ఇద్దరు ముస్లింలు, ఐదుగురు బీసీలు, ఒక బలిజ, ఒక రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది రెండు బ్యాచ్‌లకు చెందిన యువకుల మధ్య ఘర్షణే తప్ప...దళితులపై దాడి కాదు.  

► ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం ఏకునాంపురం గ్రామానికి చెందిన దాసరి వెంకట రమణ హత్యకు పూర్తిగా వ్యక్తిగత విభేదాలే కారణం. అదే గ్రామానికి చెందిన ఆది లక్ష్మమ్మతో పొలం వివాదం ఉంది. చింతకాయలు కోసారని తరచూ గొడవ పడుతుండేవారు. ఓ సారి ఘర్షణ తీవ్రమై ఆది లక్ష్మమ్మ ముగ్గురు కొడుకులు గురువర్ధన్‌(18), ఏడుకొండలు(17), భాను చంద్ర(12) రమణయ్యపై దాడి చేసి కొట్టారు. తీవ్రంగా గాయపడిన రమణయ్య మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత వివాదం. అయినా సరే ఈ ఉదంతాన్ని వక్రీకరించి ఈనాడు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించింది.  

► అనకాపల్లి జిల్లాలో వివాహేతర సంబంధంతో జరిగిన హత్యను కూడా ప్రభుత్వానికి ఆపాదించడం ‘ఈనాడు’ దిగజారుడుతనానికి పరాకాష్ట. పాయకరావుపేట మండలం పిఎల్‌ పురంలో 2022 మార్చి 28న వడ్లమూరి నాగేంద్ర అనే దళిత యువకుడు హత్యకు గురయ్యాడు. నాగేంద్ర ఒక మహిళను వేధిస్తుండటంతో ఆమెతో సన్నిహిత సంబంధం కలిగిన మరో వ్యక్తి అతన్ని హత్య చేశాడు. నిందితులను అరెస్ట్‌ చేశారు కూడా.  

► విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని సుజాత నగర్‌లో నివసించే బిగ్‌బాస్‌ ఫేమ్‌ నూతన్‌నాయుడు... తన సెల్‌ఫోన్‌ దొంగతనం చేశాడనే కారణంతో డ్రైవర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడు కర్రి శ్రీకాంత్‌కు శిరోముండనం చేశారు. ఫిర్యాదు రావడంతో పోలీసులు తక్ష­ణం స్పందించి నూతన్‌ నాయుడిని, ఆయన భార్యను 12 గంటల్లోనే అరెస్టు చేశారు. మరి దీన్లో ప్రభుత్వ తప్పిదం ఎక్కడుంది? 

► పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన దళిత ఆక్వా రైతు బూరగ నాగేశ్వరరావు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. తాహతుకు మించి అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. నాగేశ్వరరావు దగ్గర పనిచేసే దళిత యువకుడు సురేష్‌కు.. పిట్టలు కాల్చే తుపాకి చేతిలో పేలి గాయమైంది. అతని వైద్యం కోసం నాగేశ్వరరావు రూ.70వేలు ఖర్చు పెట్టారు. తనకు 10 లక్షలు పరిహారం ఇవ్వాలని నాగేశ్వరరావుపై సురేశ్‌ కేసు పెట్టారు. గ్రామ పెద్దల ద్వారా సమస్య పరిష్కారం కాకపోవటంతో అంత డబ్బు చెల్లించలేక నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిక్కూడా వక్ర భాష్యాలా? 

► దళితులను టీడీపీ నేతలు హత్య చేసినా సరే వైఎస్సార్‌సీపీకి ఆపాదించేందుకు బరితెగించడం ఈనాడు దుర్నీతికి నిదర్శనం. గుంటూరు జిల్లా పొన్నూరులో బర్న బసు అనే దళితుడిని టీడీపీ నేతలు హత్య చేయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుర్రా వాసు, రెండో నిందితుడు తాళ్లపాలెం శ్రీను  టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు. వారిద్దరిని కోర్టులో హాజరుపరిచినప్పుడు 250మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు  అక్కడకు వచ్చారు. వాస్తవం అలా ఉంటే... వైఎస్సార్‌సీపీ నేతలు ఈ హత్య చేశారని రాయడం ఈనాడు పన్నాగం. 

► నెల్లూరు జిల్లా కావలికి చెందిన దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్‌ ఆత్మహత్యపైనా ఈనాడు అవాస్తవాలే వండివార్చింది. కరుణాకర్‌కు అప్పులిచ్చిందీ... తరవాత అప్పు తీర్చలేదని ఆయన ఇంటిని రాయించుకుని వేధించిందీ టీడీపీ నేతలే. కావలిలోని మందాటి చెరువులో చేపలు పట్టుకునేందుకు వీలుగా నీటిని కిందకు వదలటానికి రైతులు సమ్మతించలేదు. వాస్తవానికి ఆ చేపల చెరువులో చేపల పెంపకానికి లక్ష్మీపురం గ్రామానికి చెందిన మత్స్యకారుల సొసైటీ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. సొసైటీలో కరుణాకర్‌ సభ్యుడు కాదు. కానీ ఆ చెరువులో చేపలు పట్టేందుకు వీలుగా నీటిని కిందకు విడిచిపెట్టాలని ఆయన రైతులను కోరారు. వారు కాదన్నారు. ఇక టీడీపీ నేతలకు అప్పు చెల్లించలేననే ఆందోళనతో కరుణాకర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి దీన్లో వైఎస్సార్‌సీపీ నేతల ప్రమేయమెక్కడుంది? 

► నెల్లూరు జిల్లా కావలికి చెందిన పైడి హర్ష అనే దళితుడి రేషన్‌ దుకాణాన్ని తొలగించడంతో అతను ఆత్మహత్యకు యత్నించినట్టు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తిగా అబద్ధం. ఎందుకంటే అతనికి రేషన్‌ దుకాణమే లేదు.  టీడీపీ నేతలు తమ కార్యకర్త పైడి హర్షతో ఈ డ్రామా ఆడించారు. టీడీపీ నేతల డ్రామా మేరకు... అతను వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డిని కలిశారు. కానీ స్థానిక నేతలు సమ్మతించలేదు. దాన్నే ఎమ్మెల్యే అతనికి చెప్పారు. అప్పటికే అతనిపై బిట్రగుంట పోలీస్‌ స్టేషన్లో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసు నమోదైంది. దీంతో చంద్రబాబు కావలికి రానున్నారని తెలిసి... టీడీపీ నేతల ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు డ్రామా ఆడారు. టీడీపీ నేతలు వారించినట్లు నటించారు. ఇదంతా స్క్రిప్టు ప్రకారం నడిచిన కథ. దీన్ని కూడా రాసేస్తే ఎలా రామోజీ? 

► నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన దళితుడు ఉదయగిరి నారాయణ ఆత్మహత్యనూ ఈనాడు వక్రీకరించింది. ఓ దొంగతనం కేసులో నిందితుడైన నారాయణను పోలీసులు విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి పంపేశారు. మరోసారి  పిలుస్తారన్న భయంతో నారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. దళిత సంఘాల ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ డైరెక్టర్‌ జి. సునీల్‌కుమార్‌ గత ఏడాది ఆగస్టులో విచారణ జరిపారు. నారాయణను పోలీసులు కొట్టలేదని విచారణలో తేలింది. దాంతో పోలీసులపై ఎలాంటి చర్యలనూ కమిషన్‌ సిఫార్సు చేయలేదు.  

► వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలంలో హత్యకు గురైన ఓ దళిత మహిళలపై అత్యాచారం జరిగినట్టుగా టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారు. అత్యాచారం జరగలేదని పోస్టుమార్గం నివేదికలో వెల్లడైంది. టీడీపీ నేతలు మాత్రం అత్యాచారం జరిగిందని ప్రచారం చేస్తూ ధర్నా చేయడంతో తాము తీవ్ర మనస్తాపానికి గురైనట్లు హతురాలి కుటుంబీకులు టీడీపీ నేతలపై కేసు  పెట్టారు. దాంతో పోలీసులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డితోపాటు ధర్నా చేసిన 14మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ 14మందిలో ఉన్న ఇద్దరు దళితులకు ఆ సెక్షన్లు వర్తించవని కూడా పేర్కొన్నారు. ఇదేమీ చెప్పకుండా... టీడీపీకి చెందిన ఇద్దరు దళిత నేతలపైనే అట్రాసిటీ కేసు పెట్టారంటూ ‘ఈనాడు’ శివాలెత్తింది. 

► దళితులు, మహిళలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై కేసు పెట్టడం కూడా తప్పన్నట్టుగా ఈనాడు వాదించడం విడ్డూరమే. 2020 అక్టోబరు 11న మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెంలో ఆ గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. మూడు రాజధానులకు మద్ధతుగా ర్యాలీ చేస్తున్న దళితులు, మహిళలపై  కృష్ణాయపాలెం వద్ద మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. కులంపేరుతో దూషిస్తూ, మహిళలపై దాడి చేశారు. దళితులు, మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 18మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అందులో తప్పేముందో మరి ఈనాడుకే తెలియాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement