అప్పులంటూ అబద్ధాలా? ఇది డ్రామోజీరావు కుట్రలో భాగం | Eenadu Yellow Media Fake News On Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

అప్పులంటూ అబద్ధాలా? ఇది డ్రామోజీరావు కుట్రలో భాగం

Published Fri, May 12 2023 4:44 AM | Last Updated on Fri, May 12 2023 9:54 AM

Eenadu Yellow Media Fake News On Andhra Pradesh Govt - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఈనాడు, దాని ఆర్థిక నిపుణుడు జీవీ రావు కథనం పచ్చి అబద్ధాలతో కూడుకున్నదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. ఎటువంటి గణాంకాలు లేకుండా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఆంధకారం అయిపోయిందంటూ జీవీ రావు చేసిన వ్యాఖ్యలను నిర్ధారించుకోకుండానే ఈనాడు ప్రచురించడం తీవ్ర అభ్యంతరకరమని, దారుణమని ధ్వజమెత్తారు.

ఎవరికీ పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక నిపుణుడంటూ అర్థం లేకుండా మాట్లాడించి.. తప్పుడు కథనాన్ని అచ్చేయడం డ్రామోజీరావు కుట్రలో భాగమని స్పష్టం చేశారు. గణాంకాలను చూపకుండానే రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్‌ అయిపోయిందనడం తగదని చెప్పా­రు. గురువారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనాడులో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ఆర్‌బీఐ, కాగ్‌ గణాంకాలను పేర్కొంటూ అప్పులపై వాస్తవాలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

ఎవరు ఏం చెబితే అది రాసేస్తారా? 
► రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మూడేళ్లుగా ప్రతిపక్షాలు, వాటి అనుబంధ మీడియా చేస్తున్న దుష్ప్రచారం కొనసాగింపులో భాగంగానే ఎవరికీ పరిచయం లేని వ్యక్తికి ఆర్థిక నిపుణుడనే ముద్ర వేసి నోటికి వచ్చినట్లు మాట్లాడించారు. మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చెప్పించి, దాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించారు. ఆర్థిక రంగంపై కనీస అవగాహన లేని ఒక చిన్న యాక్టర్‌ తప్పుడు విశ్లేషణను ఈనాడు బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రచురిస్తుంది? 

► అప్రకటిత రుణాలు తెచ్చారని జీవీ రావు చెబితే, కనీసం వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా ఈనాడు ఎలా రాస్తుంది? రూ.పది లక్షల కోట్ల అప్పులు ఎక్కడున్నాయి? ఎవరు ఏం చెప్పినా, నిర్ధారించుకోకుండానే రాసేస్తారా? అలా రాయడం ఈనాడు దుర్బుద్ధి కాదా? లేక ఈనాడు రామోజీ రావే అలా అబద్ధాలు చెప్పించి, రాయించారా? 

వృత్తిపరమైన తప్పిదాలతో రెండేళ్లు సస్పెన్షన్‌ 
వృత్తి పరంగా అవకతవకలకు (ఒక కంపెనీ తరఫున ఆడిట్లో అవకతవకలు) పాల్పడటంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఇండియా జీవీ రావును రెండేళ్ల పాటు సస్పెన్షన్‌ చేసింది. అలాంటి వ్యక్తి ఆర్థి­క నిపుణుడంటూ ఈనాడు తెరపైకి తెచ్చి తప్పుడు లెక్కలు చెప్పించడం కుట్రలో భాగమే.  

మూలధన వ్యయం ఎక్కువే  
► గత టీడీపీ సర్కారు కంటే కూడా జగన్‌ సర్కారులో అప్పులు తక్కువ.. మూల ధన వ్యయం ఎక్కువ.  కాగ్‌ (సీఏజీ) నివేదిక ప్రకారం మూలధన వ్యయం (క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌) గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.76,139 కోట్లు. అంటే ఏటా సగటున రూ.15,227.80 కోట్లు.  

► అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు. ఏటా సగటు వ్యయం రూ.18,852 కోట్లు. ఏ విధంగా చూసినా గత ప్రభుత్వం కంటే ఇప్పుడే తక్కువ రుణాలు చేస్తూ.. ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.  

ఇది దుష్ప్రచారం కాదా 
► లేని అప్పులు ఉన్నట్లు ఎలా చెబుతారు? ఆర్‌బీఐ, కాగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలను అపహాస్యం చేయడం కాదా? రెవెన్యూ మాయం అవడం ఏమిటి.. ఎక్కడైనా ఉంటుందా? ఇదేనా జీవీరావు అవగాహన, ఈనాడు జ్ఞానం? ఎక్కువ సంవత్సరాలకు అప్పు తీసుకుంటే భావితరాలపై భారమని ఏ రీతిన చెబుతున్నారు? కేంద్రం కూడా ఎక్కువ సంవత్సరాలకు అప్పులు తీసుకుంటోంది.. అయితే కేంద్రం కూడా భావి తరాలపై భారం వేసినట్లేనని ఎందుకు రాయరు?  

► ఆర్‌బీఐ, కాగ్‌ లెక్కల ప్రకారం బడ్జెట్, బడ్జెట్‌ బయట, ప్రభుత్వ పూచీ కత్తు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులన్నీ కలిపి రూ.6,51,789.07 కోట్లే. రూ.పది లక్షలు కోట్లు అప్పులని చెప్పడం దుష్ప్రచారం కాదా? మరి మిగతా అప్పులు ఎక్కడున్నాయో ఆ నిపుణుడు, ఈనాడు చెబితే బాగుంటుంది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే అవాస్తవ కథనాలు రాస్తుండటం నిజం కాదా?  

పబ్లిక్‌ డొమైన్‌లో వాస్తవాలు 
► ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నాయి. వాటిని విశ్లేషించి, అవగాహనతో మాట్లాడితే స్వాగతిస్తాం. కానీ ఏ విశ్లేషణ చేయకుండా, ఎక్కడా లెక్కలు చెప్పకుండా తప్పుడు మాటలు మాట్లాడించి, ప్రచురించడం దారుణం. 

► ఆర్బీఐ నివేదిక ప్రకారం విభజన నాటికి.. అంటే 2014 మార్చి 31 నాటికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.1,96,202 కోట్లు. అప్పుడు తొలి రెండు నెలల్లో ఉన్న ద్రవ్య లోటు రూ.7,333 కోట్లు. విభజన తర్వాత 58 శాతం వాటా ప్రకారం లెక్కిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మిగిలిన అప్పు రూ.1,18,050 కోట్లు. అది ఐదేళ్లలో.. 2019 మార్చి 31 నాటికి రూ.2.64 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత రెండు నెలల్లో ద్రవ్యలోటు రూ.7,346 కోట్లు. దాన్ని కూడా కలుపుకుంటే 2019 మే నెలలో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర రుణం మొత్తం రూ.2,71,797.56 కోట్లు. 

► మా ప్రభుత్వ హయాంలో, అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్ర రుణం మొత్తం రూ.4,42,442 కోట్లకు చేరింది. ఇది ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వ పూచీకత్తుతో, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.14,028.23 కోట్లు. ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి.. అంటే 2019 మే నాటికి రూ.59,257.31 కోట్లకు పెరిగాయి.  

► ఆ తర్వాత నాలుగేళ్లలో.. ఈ ఏడాది మార్చి నాటికి ఆ రుణాల మొత్తం రూ.1,44,875 కోట్లు. ఇందులో దాదాపు రూ.45 వేల కోట్లు విద్యుత్‌ రంగానికి చెందినవే. ఆ సంస్థలే ఆ రుణాలు తిరిగి చెల్లిస్తాయి. అందుకే ఆ రుణాలన్నీ ప్రభుత్వానివి అని చెప్పడానికి లేదు. 2014 నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రెండూ కలిపి రుణభారం రూ.1.32 లక్షల కోట్లు కాగా.. 2019లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అవి రూ.3.31 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో రాష్ట్ర రుణ భారం రూ.5.87 లక్షల కోట్లకు చేరింది. 

► ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు చూస్తే.. 2014 నాటికి విద్యుత్‌ రంగంలో జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులు రూ.18,374 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ అప్పుల మొత్తం రూ.59,692 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఇక ఈ ప్రభుత్వ హయాంలో, ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ఆ రుణభారం రూ.56,017 కోట్లు.  

గత ప్రభుత్వం కంటే మేం చేసిన అప్పులు తక్కువే 
► విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు, విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇవ్వాల్సిన బకాయిలు 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2893 కోట్లు. 2019 నాటికి అవి రూ.21,540 కోట్లకు చేరాయి. ప్రస్తుతం అవి కేవలం రూ.8,455 కోట్లు మాత్రమే. 

► మొత్తం మీద పబ్లిక్‌ డెట్‌ టు పబ్లిక్‌ ఎక్కౌంట్‌ (ప్రభుత్వ రుణాలు), ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు, ఆ పూచీకత్తు లేకుండా చేసిన అప్పులు.. అన్నీ కలిపి 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.1,53,346.80 కోట్లు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4,12,288 కోట్లకు పెరిగాయి. ఈ నాలుగేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రుణ మొత్తం రూ.6,51,789 కోట్లకు చేరింది.  

► టీడీపీ హయాంలో ఐదేళ్లలో దాదాపు రూ.2.58 లక్షల కోట్ల అప్పులు పెరగ్గా.. ఈ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో రూ.2.38 లక్షల కోట్లు పెరిగాయి. అంటే ఎలా చూసినా గత ప్రభుత్వంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువ రుణాలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో 21.87 శాతం సీఏజీఆర్‌ పెరగ్గా, ఈ ప్రభుత్వ హయాంలో 12.69 శాతం మాత్రమే పెరిగింది. 

► 2022–23లో కేంద్ర ప్రభుత్వ రుణాలు (డెట్‌ టు జీడీపీ) 55.89 శాతం కాగా, 2023–24 నాటికి 56.16 శాతం ఉంటుందని అంచనా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో రుణాల సేకరణ తగ్గింది. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ప్రభుత్వం వృథా ఖర్చు చేస్తోందని చెప్పడం తగదు. ప్రతి రెవెన్యూ వ్యయం వృథా ఖర్చు కానేకాదు. ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకుంటే అది క్యాపిటల్‌ వ్యయం. పిల్లలను స్కూల్‌కు పంపిస్తే అది రెవెన్యూ వ్యయం. దేని ప్రాధాన్యత అదే. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ఒకే రోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసి.. పసుపు–కుంకుమ పథకంలో భాగంగా పంపిణీ చేశారు. దాన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పలేదు. 

జీఈఆర్‌ భారీగా పెరుగుదల 
► విద్యా రంగంలో చేసిన వ్యయం వల్ల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) గణనీయంగా పెరిగింది. గతంలో దేశంలో జీఈఆర్‌ 99 శాతం ఉంటే, అప్పుడు రాష్ట్రంలో అది 84.48 శాతం మాత్రమే. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ. అదే ఈ రోజు మన రాష్ట్ర జీఈఆర్‌ 100.1 శాతం. అంటే దేశ సగటు కంటే ఎంతో ఎక్కువ. ఇదంతా విద్యా రంగంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్లనే సాధ్యమైంది.  

► గత ప్రభుత్వ హయాంలో కంటే దాదాపు రెట్టింపు విద్యా రంగంపై వ్యయం చేస్తున్నాం. గత టీడీపీ హయాంలో విద్యా రంగంపై జీఎన్‌డీపీలో సగ­టున 0.51 శాతం వ్యయం చేస్తే ప్రస్తుత ప్ర­భుత్వం సగటున 1.07 శాతం వ్యయం చేసింది.  

► అమ్మ ఒడి, గోరుముద్ద, మనబడి నాడు–నేడు, వి­ద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలా అనేక పథకాలు అమలవుతున్నాయి. మధ్యాహ్న భోజన పథకం కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో, ఏటా చేసిన సగటు వ్యయం రూ.553 కోట్లు. ప్రస్తుతం ఏ­టా సగటున రూ.1209 కోట్లు. కుక్‌ కమ్‌ హెల్పర్ల వే­త­నాలు కూడా పెంచింది. పెన్షన్ల కోసం గత ప్రభు­త్వం ఏటా సగటున రూ.5,600 కోట్లు వ్యయం చే­య­­గా, ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.17,694 కో­­ట్లు వ్యయం చేస్తోంది. ఇది వృథా వ్యయం అంటారా?  

► కోవిడ్‌ వల్ల ఒకవైపు ప్రభుత్వ ఆదాయం తగ్గడం, మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో వాటా తగ్గడం వల్ల ప్రభుత్వం దాదాపు రూ.66,116 కోట్ల ఆదాయం కోల్పోయింది. అయినా ఎక్కడా ఏ పథకాలు ఆపలేదు. వివిధ పథకాలకు సంబంధించి రూ.2.10 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రజల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.  

► వాహనమిత్ర పథకాన్ని ప్రస్తావిస్తూ విపక్షం తప్పుడు ప్రచారం చేస్తోంది. వాహనాల నుంచి ఫైన్లపై అసత్యాలు ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వాహనాల నుంచి ఫైన్ల రూపంలో ఏటా సగటున రూ.270.39 కోట్లు వసూలు చేయగా, ఈ ప్రభుత్వ హయాంలో అది రూ.183.94 కోట్లు మాత్రమే.   

► 500 యూనిట్లుపైగా విద్యుత్‌ వినియోగంపై యూనిట్‌కు 90 పైసలు పెంచితే రూ.1,300 కోట్ల భారమని చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్ధం. డిస్కమ్స్‌కు కేవలం 31.5 కోట్లే భారం. ఈ కేటగిరి కింద విద్యుత్‌ వినియోగదారులు కేవలం 1.05 లక్షల మందే ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement