నిజాలను దాచి, అబద్ధాల కథనాలు.. ఇంటిపైనా ‘ఎల్లో’ విషం  | Eenadu Yellow Media Fake News On Tidco Houses Works | Sakshi
Sakshi News home page

నిజాలను దాచి, అబద్ధాల కథనాలు.. ఇంటిపైనా ‘ఎల్లో’ విషం 

Published Wed, Feb 8 2023 3:06 AM | Last Updated on Wed, Feb 8 2023 6:58 AM

Eenadu Yellow Media Fake News On Tidco Houses Works - Sakshi

సాక్షి, అమరావతి: నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న తీరులో ఉంది ఎల్లో మీడియా. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు రాసి ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లో ఉంది. ఇదే భ్రమలతో టిడ్కో ఇళ్లపై ఈనాడు ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేసింది. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, వేగం, లబ్ధిదారులకు కలిగిస్తున్న ప్రయోజనాలను వదిలేసి తప్పుడు ప్రచారానికి తెరతీసింది.

నంద్యాల ఎన్‌ఎం నగర్, ఎస్సార్‌బీసీ కాలనీ, అయ్యలూరిమెట్ట ప్రాంతాల్లో మొత్తం 10 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అన్ని వసతులతో సిద్ధంగా ఉన్న 2 వేల యూనిట్లను గత నెలలో లబ్ధిదారులకు అందించారు. మిగిలిన 8 వేల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. వీటికి రూ.88.84 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. వీటిని జూన్‌ నెలలో లబ్ధిదారుకులకు అందించే లక్ష్యంతో అధికారులు పనులు చేయిస్తున్నారు. వీటినే ఫొటోలు తీసి ‘పైన హుషారు.. లోపల ఉసూరు’ అంటూ ఈనాడు తప్పుడు ప్రచారానికి తెగబడింది.  

పునాదుల స్థాయిలోనే వదిలేసిన గత ప్రభుత్వం 
పట్టణ పేదల కోసం ఉద్దేశించిన 2,62,216 టిడ్కో ఇళ్లను మూడు కేటగిరీల్లో ప్రారంభించారు. 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ. విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం 2019 మే 1 నాటికి 1,22,888 టిడ్కో ఇళ్లను పునాదుల స్థాయిలోనే వదిలేసింది. వీటిలో 63,744 ఇళ్లకు రూ.3,232 కోట్లు ఖర్చవుతుందని ప్రకటించింది.

అయితే, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో వీటి నిర్మాణంలో రూ.392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. టీడీపీ ప్రభుత్వం సగంలో వదిలేసిన ఇళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 50 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. వీటిని లబ్ధిదారులకు అందజేసింది కూడా. దీంతో పాటు ఫిబ్రవరి 7వ తేదీ నాటికి 1,29,480 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వీటిలో మౌలిక వసతుల కల్పన చకచకా జరుగుతోంది. 

గతంలో రూ.306 కోట్లు.. ఇప్పుడు రూ.3,237 కోట్లు  
టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన 163 ప్రాంతాల్లో గత టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.306 కోట్లతో మౌలిక వసతులు తూతూమంత్రంగా కల్పించి చేతులు దులుపుకొంది. అయితే, ఆ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.3,237 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటి దాకా రూ.800 కోట్లు విలువైన పనులు పూర్తయ్యాయి.  

టీడీపీ మోపిన భారాన్ని తీసేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 
300 చ.అ. ఇళ్లను పొందిన నిరుపేదలపై గత ప్రభుత్వం లబ్ధిదారుల వాటాగా రూ.3,805 భారం మోపింది. ఒక్కో ఇంటికి రూ.2.65 లక్షలు ధర నిర్ణయించి లబ్ధిదారే 20 ఏళ్లపాటు రుణాన్ని నెలనెలా ఈఎంఐల రూపంలో చెల్లించాలని షరుతు పెట్టింది. దీనిప్రకారం ఒక్కో ఇంటికి వడ్డీతో కలిపి 20 ఏళ్లకు రూ.7.20 లక్షలు లబ్ధిదారే చెల్లించాలి. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఇళ్లను ఒక్క రూపాయికే కేటాయించింది. దీనిద్వారా 1,43,600 మంది లబ్ధిదారులు రూ.10,339 కోట్ల మేరకు ప్రయోజనం పొందారు.

365 చ.అ., 430 చ.అ. ఇళ్లలో లబ్ధిదారుల కొంత వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెట్టింది. అయితే, వారు ఇప్పటివరకు చెల్లించాల్సిన రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. అంతేకాకుండా ఆ ఇళ్లకు 50 శాతం సబ్సిడీ ప్రకటించింది. దీంతో ఆ ఇళ్లకు గత ధరల ప్రకారం మొత్తం రూ.10,797 కోట్లు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడా మొత్తం రూ.4,590 కోట్లకు తగ్గిపోయింది.  బ్యాంకు రుణాలనూ ఇప్పిస్తోంది. 

అందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్‌ 
అన్ని కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, యూజర్‌ ఛార్జీలను కూడా ప్రభుత్వం మినహాయించింది. దీనిద్వారా 365 చ.అ, 430 చ.అ లబ్ధిదారులు దాదాపు రూ.1200 కోట్ల మేర అదనంగా లబ్ధి పొందుతున్నారు. మొత్తం అన్ని ఫీజులు కలిపి లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం మొత్తం రూ.5,487.32 కోట్ల మేలు జరిగేలా చేసింది. 

► వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటిదాకా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.4,939.10 కోట్లు, మౌలిక వసతులకు రూ.570 కోట్లు, భూ సేకరణకు మరో రూ.11 కోట్లు వెచ్చించింది. 
► గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ. 3 వేల కోట్ల బకాయిలు తిరిగి చెల్లించింది.  
► పెండింగ్‌ పనులు పూర్తిచేసేందుకు మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేయనుంది. 

ఇంత మేలు జరిగినా విషప్రచారం! 
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగడుగునా మేలు చేస్తోంది. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తోంది. నిరుపేదలకు ఒక్క రూపాయికే ఇళ్లు ఇస్తోంది. మరికొందరికి భారీ సబ్సిడీ ఇస్తోంది. బ్యాంకు రుణాలూ ఇప్పిస్తోంది. రిజిస్ట్రేషన్‌ ఉచితంగా చేస్తోంది. నిర్మాణంలో, వసతుల్లో నాణ్యతలో రాజీ పడకుండా లబ్ధిదారుల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది. అయినా, పూర్తికాని ఇళ్ల చిత్రాలతో మసిపూసి మారేడుకాయ చేసి, విషప్రచారంతో ప్రజలను పక్కదోవ పట్టించడానికే ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. 

మొత్తం ఇళ్ల పంపిణీకి షెడ్యూల్‌ 
ఇప్పటిదాకా 35 ప్రాంతాల్లో రోడ్లు, తాగు నీరు, సెప్టిక్‌ డ్రైనేజీ, విద్యుత్‌ వంటి పూర్తి మౌలిక సదుపాయాలతో 50 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన ప్రభుత్వం మిగిలిన ఇళ్లను అందించేందుకు షెడ్యూల్‌ కూడా ప్రకటించింది.  

ఇప్పటిదాకా పంపిణీ చేసినవి 50 వేలు  
మార్చి లక్ష్యం 1 లక్ష  
జూన్‌లో 50 వేలు  
డిసెంబర్‌లో పంపిణీ 62,616 
మొత్తం 2,62,216  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement