ఇంగ్లిష్‌ లేకుంటే మీ ముందు మాట్లాడగలిగేవాడినా? | English Medium In AP Supreme Court Issues Notice To Respondent | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ లేకుంటే మీ ముందు ఇలా మాట్లాడగలిగేవాడినా?

Published Fri, Sep 4 2020 8:07 AM | Last Updated on Fri, Sep 4 2020 10:36 AM

English Medium In AP Supreme Court Issues Notice To Respondent - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును సుప్రీంకోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. పిటిషనర్‌ అప్పీలుపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. స్పందన తెలియజేసేందుకు ప్రతివాదికి ఒక అవకాశం ఇచ్చాకే ఉపశమనం కల్పించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు సంబంధించి జారీ చేసిన జీవో నం: 81, 85ను హైకోర్టు రద్దు చేయడంపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ ఇందు మల్హోత్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 
(చదవండి: కోర్టుధిక్కార నేరాలు ఇంకా అవసరమా?)

ఇది ప్రగతిశీల చర్య: ప్రభుత్వ న్యాయవాది
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ వాదనలు వినిపిస్తూ ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ప్రస్తావించిన అంశాలన్నీ సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని నివేదించారు. 
ఏ మీడియంలో విద్యా బోధన ఉండాలనేది నిర్ణయించుకోవడం విద్యార్థులు, తల్లిదండ్రుల హక్కు అని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు స్పష్టంగా చెప్పింది.
ఆంగ్ల భాషను స్వీకరించడం ప్రగతిశీల చర్య. తెలుగు మీడియంలో చదవాలనుకుంటున్న వారికోసం ఆ పాఠశాలలను కొనసాగించడమే కాకుండా విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించింది. 95 శాతం మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియాన్ని కోరుకుంటున్నారు. 
ఇది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకోసం తీసుకున్న నిర్ణయమే కానీ ప్రజాకర్షక చర్య కాదు. అలాంటి దృఢమైన నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వం కూడా అంతే దృఢంగా ఉండాలి. 
మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నాం...
విద్యా బోధన ఆచరణ సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే ఉండాలని విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 29 చెబుతోంది కదా? దీనిపై ఏమంటారన్న ధర్మాసనం ప్రశ్నపై ప్రభుత్వ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ స్పందిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు లోబడి విద్యార్థులు, తల్లిదండ్రుల కోరికకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు నివేదించారు. వారు  తెలుగు మీడియంను ఆప్షన్‌గా ఎంచుకోలేదు కాబట్టి ఆచరణ సాధ్యం కావడం లేదన్నారు. మాతృభాషకు ప్రాముఖ్యం ఇవ్వాలన్న రాజ్యాంగంలోని సెక్షన్‌ 29(ఎఫ్‌)ను కచ్చితంగా పాటిస్తున్నామన్నారు. 
అలా ఎక్కడా చెప్పలేదు...
అన్ని సందర్భాలలోనూ కేవలం మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని విద్యా హక్కు చట్టంలో ఎక్కడా చెప్పలేదు. కాబట్టి చట్టం, శాసనాల ఉల్లంఘన జరగలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. 
హైకోర్టు తీర్పును అనుసరించి అన్ని ప్రైవేట్‌ పాఠశాలలు మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగించగలవా? ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినవి మాత్రమే. అవి ప్రైవేట్‌ స్కూళ్లకు వర్తించవు అని నివేదించారు.. 
ఇరుపక్షాల వాదనల అనంతరం కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రతివాదికి రెండు వారాల గడువు ఇస్తూ విచారణను సెప్టెంబర్‌ 25వతేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  

‘నేను కోయంబత్తూరుకు 40 కి.మీ దూరంలోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా. ఒకవేళ నేను ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోకుంటే ఇవాళ మీ ముందు ఇలా ఆంగ్లంలో మాట్లాడగలిగేవాడినా? ఆంగ్లంలో ప్రావీణ్యం లేకుంటే ఒక ప్రాంతానికే పరిమితమవుతాం. మనం ప్రాక్టికల్‌గా ఆలోచిద్దాం. ఇది రాజ్యాంగం, చట్టానికి లోబడే చేస్తున్న ఒక అభ్యుదయకరమైన చర్య. దీనికి దృఢ సంకల్పం కావాలి. ఒక గట్టి ప్రభుత్వం మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకోగలుగుతుంది. చట్టానికి అనుగుణంగా మాతృభాషను పరిరక్షిస్తూ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధనకు సిద్ధమయ్యాం. అక్షరాస్యతలో మార్పు అంటే మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగించడం అని కాదు’     
– సుప్రీం ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది విశ్వనాథన్‌ నివేదన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement