సాక్షి, అమరావతి: గోదావరి నదీ జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్ర పరిధిలో గోదావరిలో నీటి లభ్యతను తేల్చి.. జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి అంతరాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్‌ఆర్ డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నవంబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ కోరింది. న్యాయశాఖ అభిప్రాయం ఆధారంగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర జల్‌శక్తి నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి.
గోదావరి ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలకు కేటాయించలేదు. నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదరలేదు. కానీ.. జీడబ్ల్యూడీటీ అవార్డు, విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ 714.13 టీఎంసీలు వినియోగించుకోవడానికి అక్రమంగా ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తోందని.. దీని వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని అనేకసార్లు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది.
కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ 2020, అక్టోబర్ 6న నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ఎత్తిచూపారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త ట్రిబ్యునల్ కోసం ప్రతిపాదన పంపితే న్యాయసలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అప్పట్లో హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment