అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కీలకమైన కేసులకు సంబంధించి శాస్త్రీయమైన పద్ధతుల్లో దర్యాప్తును సమగ్రంగా చేపట్టాలని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు. శనివారం గుంతకల్లు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష నిర్వహించారు. నమోదైన కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తు దశ, చార్జిషీటు దాఖలు వరకు పురోగతిపై ఆరా తీశారు.
పోలీస్‌స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించి నిర్ణిత గడువులోపు పెండింగ్ కేసులకు పరిష్కారం చూపాలన్నారు. నిందితుల అరెస్టు, చార్జ్ షీట్లు దాఖలు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల ఛేదింపు, నేర నియంత్రణకు దోహదం చేసే నైపుణ్యాలను వివరించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలతో ప్రవేశపెట్టి శిక్ష పడే విధంగా చేయాలన్నారు. హత్య కేసులు, మహిళలపై నేరాలు, చిన్నారుల అదృశ్యం తదితర కేసుల్లో అలసత్వం చూపకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
చోరీ కేసుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని, సొత్తు రికవరీపై దృష్టి సారించాలని సూచించారు. అనధికార ఆన్‌లైన్ లోన్ యాప్‌ల మోసాలు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించి వారు కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు అమర్చుకునేలా చూడాలన్నారు. రహదారులపై ప్రమాదాలు, నేరాల నియంత్రణకు హైవే మొబైల్ టీంతో నిరంతర గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. గుట్కా, మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు. సమావేశంలో గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
(చదవండి: జగనన్న కాలనీలో మహిళలకు ఉపాధి)
Comments
Please login to add a commentAdd a comment