
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదించడం ఈనాడు పత్రికకు అలవాటుగా మారింది. రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆక్రమణదారులకు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెబితే ‘సీఎం వస్తున్నారు.. దుకాణాలు తొలగించాల్సిందే’ అంటూ ఈనాడులో వార్త ప్రచురించారు. చిత్తూరు – వేలూరు రోడ్డులో విజయా డెయిరీని ఆనుకుని పది దుకాణాలు వెలిసాయి.
నగర సుందరీకరణకు అడ్డుగా ఉన్నాయని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ నిర్ణయించారు. ఇదే విషయాన్ని వ్యాపారులకు చెప్పారు. ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. వ్యాపారులు కూడా ఆ దుకాణాలను స్వచ్ఛందంగా తొలగించారు.
దీనిని వక్రీకరిస్తూ ఈనాడులో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. సీఎం జిల్లా పర్యటనకు వస్తుండడంతో అధికారులు బలవంతంగా దుకాణాలను తీసేయిస్తు న్నారని రాసుకొచ్చారు. రోడ్డుపై ఆక్రమణలు తొలగిస్తే సీఎం పర్యటనకు ఆపాదిస్తూ రాయడం మంచిదికాదని కమిషనర్ అరుణ అన్నారు.