![Family Members Commited Suicide Attempt In Godavari River - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/19/ELR.jpg.webp?itok=zQMv7j3r)
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇంటిపెద్ద కరోనాతో చనిపోవడంతో కుటుంబసభ్యుల్ని కలిచి వేసింది. ఇక తమకు దిక్కెవరు అంటూ మనస్తాపంతో గోదావరిలో దూకేశారు. ఎవరైనా చనిపోతే బంధువులు, సన్నిహితులు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెబుతారు. మేమున్నామంటూ మాటలతోపైనా మానసిన స్థైర్యాన్ని ఇస్తారు. కానీ కరోనా వచ్చి ఆ మానవత్వాన్ని మటుమాయం చేసింది. సొంత వారు చనిపోయినా తిరిగి మళ్లి చూడకుండా చేసింది. ఆ మహమ్మారి వైరస్ తమకెక్కడ అంటుకుంటుందో అని బంధువులు కూడా దూరం జరుగుతున్నారు. కరోనాతో ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు కూడా వెనకాడుతున్నారు. పలకరించే దిక్కు లేక బాధిత కుటుంబాలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి బాధను తట్టుకోలేకపోయిన ఆ కుటుంబం ఏకంగా ప్రాణాలే తీసేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన విషాద సంఘటన అందరినీ కలిచివేస్తోంది. కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది. కొవ్వూరు మండలం పసివేదలకు చెందిన నరసయ్య ఈనెల 16న కరోనాతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు భార్య, పిల్లలు. ఇంత బాధలో ఉన్న వారిని పలకరించేందుకు... బంధువులు, సన్నిహితులు కూడా రాలేదు. కరోనా భయంతో వారి ఇంటి గడప కూడా తొక్కలేదు. దీంతో తమను అంటరాని వారిగా చూస్తున్నారన్న భావన వారిలో పెరిగింది. ఆ బాధతోనే నరసయ్య భార్య సునీత, అమె కుమారుడు ఫణికుమార్ (25), కుమార్తె అపర్ణ (23) గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నరసయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని స్థానికులు చెప్తున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం వల్లే వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు. రైల్వే బ్రిడ్జి పైనుంచి ఈ ముగ్గురూ గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. గోదావరిలో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment