
విజయవాడ లీగల్: ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కమ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎస్.రజని మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో బాధిత బాలిక కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
నిందితుడు షేక్ బాజీ (44) అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. 2016 మార్చి 19వ తేదీ సాయంత్రం స్నేహితులతో ఆడుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశచూపిన నిందితుడు టెర్రస్‌పైకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను కోర్టు విచారించింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.