సాక్షి, హైదరాబాద్: ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తూ పదేపదే న్యూసెన్స్‌కు పాల్పడుతున్న వ్యక్తులపై నమోదయ్యే పెట్టీ కేసులను న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇలాంటి ఓ వ్యక్తికి 13వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఏకంగా 112 రోజుల జైలు శిక్ష విధించింది. పెట్టీ కేసులో ఈ స్థాయిలో జైలు పడటం ఇదే తొలిసారి. కార్ఖానా బస్తీలో నివసించే మహ్మద్ సలీం పేరు చెప్తే ఆ ప్రాంత వాసులకు హడల్. అనునిత్యం మద్యం తాగి రోడ్డుపై హంగామా సృష్టిస్తుంటాడు. తన కుటుంబీకుల పైనే దాడులు చేస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని దుర్భాషలాడతాడు. అప్పుడప్పుడు నగ్నంగా రోడ్లపైకి వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తుంటాడు.
దీనికి సంబంధించి ఫిర్యాదు అందిన ప్రతిసారీ కార్ఖానా పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించే వారు. పోలీసుస్టేషన్‌లోనూ ఇతడితో అధికారులకు తలనొప్పే. గోడకు తల కొట్టుకోవడం, చేతులు కోసుకోవడం వంటివి చేస్తూ ఇబ్బందులు కలిగించే ప్రవర్తిస్తుంటాడు. సలీంపై ఇప్పటికే పలుమార్లు పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆదివారం మరోసారి బస్తీలో రాద్ధాంతం చేశాడు. మద్యం మత్తులో తల్లిదండ్రులపై దాడికి దిగాడు. అడ్డుకున్న స్థానికులనూ దుర్భాషలాడాడు.
పోలీసులపైనా విరుచుకుపడి..
డయల్–100కు ఫిర్యాదు రావడంతో కార్ఖానా పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఘటనాస్థలికి చేరుకున్నారు. వీరిపైనా విరుచుకుపడిన సలీం అభ్యంతరకరంగా ప్రవర్తించి, వారి విధి నిర్వహణకు అడ్డు తగిలాడు. బస్తీ వాసులకు పదేపదే ఇబ్బందులు సృష్టిస్తున్న సలీం విషయాన్ని కార్ఖానా ఇన్‌స్పెక్టర్ బి.రవీందర్ తీవ్రంగా పరిగణించారు. ఇతడికి వైద్య పరీక్షలు చేయించడంతో పాటు నగర పోలీసు యాక్ట్, ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అవసరమైన ఆధారాలతో సోమవారం కోర్టులో సలీంను హాజరుపరిచి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అభియోగపత్రాల్లో పొందుపరిచిన ఇతడి వ్యవహారశైలి, గత చరిత్ర తదితరాలను గమనించిన న్యాయమూర్తి 112 రోజులు జైలు శిక్ష విధించారు. చట్టాన్ని అతిక్రమించినా, పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడినా ఇలాంటి చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ బి.రవీందర్ స్పష్టం చేశారు.
(చదవండి: యువ గాయని అపహరణ.. ఆపై దారుణ హత్య!)
Comments
Please login to add a commentAdd a comment