కాకినాడ జిల్లా: కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గౌతమీ నది ఉధృతితో యానాంలో పది కాలనీలు నీట మునిగాయి. నడుం లోతులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యానాంలోని ఓల్డేజ్ హోం వద్ద ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. ముంపు బాధితులకు ఆహారం, త్రాగునీరు, కొవ్వొత్తులను స్థానికంగా ఉన్న నేతలు సరఫరా చేస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత మండలాలలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జోగి రమేష్, హోం మంత్రి తానేటి వనిత, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌లు విస్తృతంగా పర్యటించారు. పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో పర్యటించిన మంత్రులు.. అన్నంపల్లి ఆక్విడెక్ట్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. దీనిలో భాగంగా అమలాపురంలో వరద సహాయక చర్యలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఇందులో కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సాక్షిటీవీ బృందం సాహస యాత్ర
ఏలూరు జిల్లా: గోదావరి వరదలో మునిగిన గ్రామాలను సాక్షిటీవి బృందం సందర్శించింది. నాటుపడవ, లాంచీలలో ప్రయాణం చేసి.. గోదావరి ప్రధాన ప్రవాహం మీదుగా కొండల్లోకి వెళ్లారు. గత వారం రోజులుగా కొండల మీద తలదాచుకున్న వారిని సాక్షి బృందం కలిసింది. చిగురుమామిడి, నాళ్లవరం, బోళ్లపల్లి, కన్నాయిగుట్ట గ్రామాల్లో సాక్షిటీవి బృందం పర్యటించి వారి కష్టాలు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఇప్పటివరకు హెలికాఫ్టర్ల ద్వారా ఆహారపదార్ధాలను ప్రభుత్వం వారికి అందించింది. ప్రత్యేక లాంచీలో నిత్యావసర వస్తువులను అధికారులు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment