
నంద్యాల జిల్లా: జిల్లా మిడుతూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. అయితే స్థానికులు తమకు చిరుత కనిపించిందని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పాద ముద్రలు సేకరించారు. పాదముద్రలు సరిగ్గా లేకపోవడంతో.. అది పులినా లేక మరేదైనా జంతువు అన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసతమైతే కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
కాగా, కొద్ది నెలల క్రితం నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నీసాపై తాజాగా చిరుతపులి దాడి చేసి తలను తినేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమైపె చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఇదిలా ఉండగా మహానందిలోనూ చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవి పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. నెలల వ్యవధిలోనే నలుగురు చిరుతపులి దాడిలో గాయపడ్డారు. ఇటీవల అటవీశాఖలోని మూడాకుల గడ్డ ప్రాంతంలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో విధులు నిర్వహించే అజీమ్‌బాషాపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి చిరుత సంచరిస్తుందనే ప్రచారంతో స్థానికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment