పద్మనాభం: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 7న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పద్మనాభం మండలంలోని పాండ్రంగి పంచాయతీ బర్లపేటలో దివ్యాంగ బాలబాలికల ఉచిత విద్య శిక్షణ కేంద్రం, వృద్ధాశ్రమం, యోగా కేంద్రం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని రాజీవ్‌గాంధీ మానవ సేవ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ గురువారం తెలిపారు.
7న ఉదయం 11.30 గంటలకు గవర్నర్ బర్లపేటకు వచ్చి అక్కడ స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల విశాలాక్షి, రూపాకుల సుబ్రహ్మణ్యం విగ్రహాలకు పూలమాల వేస్తారు. అనంతరం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రసంగిస్తారు. గాయత్రి, వెల్ఫేర్ అండ్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాజరుకానున్నట్లు రవికుమార్ తెలిపారు. సభా ప్రాంగణాన్ని, శిలాఫలకం ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని డీసీపీ సునీల్ సుమిత్ గరుడ్, ఆర్డీవో భాస్కరరెడ్డి, సీఐ సన్యాసినాయుడు గురువారం పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment