ప్రత్యేకంగా ఫారాల్లో పెంచుతున్న నాటుకోళ్లు
రోగనిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు చికెన్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాయిలర్ కంటే నాటు కోడి మాంసంలో పోషకాలు, ప్రొటీన్లు అధికంగా ఉండడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పల్లెలో పెరిగే కోళ్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో నాటు కోళ్ల ధరను మాంసం విక్రయదార్లు విపరీతంగా పెంచేస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా కొందరు నాటు కోళ్లకు ప్రత్యేకంగా ఫారాలను ఏర్పాటు చేసి పెంచుతున్నారు. ప్రజల నమ్మకాన్ని తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కలికిరి, నిమ్మనపల్లె, మదనపల్లె, చంద్రగిరి, బంగారుపాళ్యం తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాటుకోళ్ల ఫారాలను నిర్వహిస్తున్నారు. – మదనపల్లె
కరోనా మహమ్మారి కాలుమోపిన తొలినాళ్లలో కోళ్ల ద్వారా వైరస్ వ్యాపిస్తోందనే వదంతులు వెల్లువెత్తాయి. దీంతో జనం చికెన్ కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో ఒక్కసారిగా కోళ్ల పరిశ్రమ దెబ్బతింది. అప్పట్లో చికెన్ వ్యాపారులు రూ.100కి 3కిలోల చొప్పున విక్రయాలు సాగించారు. తర్వాత కరోనాను ఎదుర్కోవాలంటే మనిíÙలో రోగనిరోధకశక్తి అవసరమని, కోడి మాంసం, గుడ్లను తప్పనిసరిగా తినాలని వైద్యనిపుణులు సూచించారు. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు జనం ఒక్కసారిగా చికెన్ దుకాణాల వద్ద క్యూ కట్టారు. పట్టణాల్లో దొరికే బ్రాయిలర్ చికెన్ కంటే పల్లెటూళ్లలో లభించే నాటుకోడి మంచిదని పలువురి నమ్మకం. అందుకే ప్రస్తుతం ప్రజలు నాటుకోడి మాంసం తినేందుకు ఎగబడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే నాటుకోడి.. రాగి సంగటి అద్భుతమైన కాంబినేషన్‌గా గుర్తింపు పొందింది.
వహ్వా.. నాటుకోడి పులుసు
బ్రాయిలర్ చికెన్ కంటే నాటుకోడి ఆరోగ్యానికి మంచిదనే ప్రచారంతో ఇటీవల కాలంలో వీటికి గిరాకీ బాగా పెరిగింది. బ్రాయిలర్ చికెన్‌లో రుచి తక్కువ, మటన్ తింటే కొవ్వు పెరుగుతుంది, మంచి చేపలు దొరకడం కష్టంగా ఉంది, దీంతో నాటుకోడి మాంసం వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా రాగి సంగటిలో నాటుకోడి పులుసు వేసుకుతింటే ఆ రుచి వర్ణనాతీతం.
పెరిగిన డిమాండ్
బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో విపరీతంగా మందులు వాడుతుండటంతో, అవి తింటే అనారోగ్యం పాలవుతామనే భావన ప్రజల్లో అధికమైంది. దీనికితోడు నాటుకోడి కూర తినండి అంటూ పలువురు ఆహారనిపుణులు సూచించడంతో అందరిచూపు వీటివైపు మళ్లింది. నాటు కోడి ఎలాంటి మందులు అవసరం లేకుండా పెరుగుతుంది. మాంసం గట్టిగా రుచిగా ఉంటుంది. కొవ్వు సమస్య ఉండదు. తొందరగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి మేలు తప్ప ఎలాంటి కీడు ఉండదు.
ప్రస్తుతం వీటిని పెంచుతున్న ఫారాలలో నాటుకోళ్లకు రాగులు, సజ్జలు, జొన్నలు, నూకలు, వడ్లు, అన్నిరకాల కూరగాయలు, పాలకూర, మెంతి, అరటి, మామిడి, వేపాకులను దాణాగా వేస్తున్నారు. ఎలాంటి రోగాలు రాకుండా పసుపు, అల్లం కలిపిన నీటిని తాగిస్తున్నారు. అందుకే బ్రాయిలర్ చికెన్ కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ఉంటే నాటుకోడి రూ.350 నుంచి రూ.550 వరకు ఉంది. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొందరు పల్లెల్లో తిరిగి నాటు కోళ్లను కొనుగోలుచేసి పట్టణాల్లో విక్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment