నిందితుడు తోట నరేంద్ర(సర్కిల్లో), టీడీపీ విశాఖ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శితో నిందితుడు(ఇన్‌సెట్‌లో)
సాక్షి, తాడేపల్లి రూరల్/పీఎంపాలెం (భీమిలి): మహిళలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాష్టీకాలు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత హత్య వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యూత్ సభ్యుడు సతీష్‌చౌదరి, అతడి స్నేహితుడు సాయిరామ్‌లు నిందితులన్న విషయం తెలిసిందే. ఈ దారుణాన్ని మరువక ముందే తాజాగా దుగ్గిరాల మండలం శృంగారపురంలో మరో టీడీపీ కార్యకర్త బరితెగించి మహిళపై లైంగికదాడికి యత్నించాడు.
నిద్రిస్తున్న వివాహితపై అఘాయిత్యానికి యత్నం
అనకాపల్లి జిల్లా నుంచి పనుల కోసం వలస వచ్చిన ఓ మహిళా కూలీ గురువారం అర్ధరాత్రి శృంగారపురంలోని తిరుపతమ్మ తల్లి గుడిలో నిద్రిస్తోంది. ఆ సమయంలో పూటుగా మద్యం తాగి వచ్చిన టీడీపీ కార్యకర్త మల్లెల కిరణ్ ఆమెను నిద్రలేపి.. నోరు మూసి.. పక్కకు లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. ఆ పెనుగులాటలో ఆ మహిళ భర్తతోపాటు బంధువులు నిద్రలేవడంతో ఆమెను అక్కడే వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
వారంతా అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇంతలో మల్లెల కిరణ్ అనుచరులు, స్థానిక టీడీపీ నేతలు వచ్చి మహిళ భర్తకు నచ్చజెప్పి కిరణ్‌ను ఇంటికి తీసుకువెళ్లారు. జరిగిన ఘటనపై మహిళ శుక్రవారం తెల్లవారుజామున 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో విషయం బయటకొచ్చింది. ఆమె ఫిర్యాదుతో దుగ్గిరాల ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
మైనర్‌పై లైంగికదాడి..
ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 5వ వార్డు పరిధి కొమ్మాది రాజీవ్ గృహకల్ప 130వ బ్లాకులో నివసిస్తున్న టీడీపీ నేత తోట నరేంద్ర (33) అదే కాలనీలో నివసిస్తున్న మైనర్(17)కు మాయమాటలు చెప్పి ఈనెల 12వ తేదీన లైంగికదాడికి పాల్పడ్డాడు. ఘటన వల్ల ఆరోగ్యపరంగా కొన్ని రోజులుగా బాలిక ఇబ్బంది పడుతుండడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో లైంగికదాడి విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి శుక్రవారం ఉదయం పోలీసులకు నరేంద్రపై ఫిర్యాదు చేసింది. కాగా, నిందితుడ్ని అరెస్టు చేశామని సీఐ రవికుమార్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు
Comments
Please login to add a commentAdd a comment