సాక్షి, అమరావతి: బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్లు వేయాలన్న తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎస్‌ఐ అభ్యర్థులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్‌లో కేసు పూర్వాపరాలను ప్రస్తావించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. దిగొచ్చిన ఎస్‌ఐ అభ్యర్థుల తరఫు న్యాయవాది ప్రస్తుత అఫిడవిట్లను ఉపసంహరించుకుని, తిరిగి అఫిడవిట్లు దాఖలు చేస్తామని తెలిపారు.
ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఐ నియామక ప్రక్రియకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల్లో భాగమైన ఎత్తు, ఛాతి చుట్టు కొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలిచిన అధికారులు అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్ మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వాదనలు విన్న సింగిల్ జడ్జి ఎస్‌ఐ నియామకాల కోసం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను వెల్లడించవద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ నరేంద్ర ధర్మాసనం పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తమని తేలితే రూ.లక్ష జరిమానా విధిస్తామని, అందుకు సిద్ధమైన అభ్యర్థులే ఎత్తు పరీక్షకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మందిలో 19 మంది తాము పరీక్షకు హాజరవుతున్నామని, రూ.లక్ష జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ లిఖితపూర్వకంగా కోర్టుకు వివరించారు.
దీంతో హైకోర్టు స్వయంగా ఎత్తు పరీక్ష నిర్వహించింది. పోలీసుల కొలతలతో తాజా కొలతలు సరిపోవడంపై ఆ 19 మంది అభ్యర్థులపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.లక్ష జరిమానా చెల్లించాల్సిందేనంది. అంత స్థోమత తమకు లేదని, తాము పేదలే కాక నిరుద్యోగులం కూడానని వారు తెలిపారు. దీంతో ధర్మాసనం జరిమానా స్థానంలో సామాజిక సేవ శిక్ష విధిస్తామని తెలిపింది. చేసిన తప్పుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అíఫిడవిట్లు వేయాలని వారిని ఆదేశించింది. తాజాగా గురువారం ఈ అప్పీల్ విచారణకు రాగా, అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించిన ధర్మాసనం వాటిపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment