ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తాం
అమరావతిలో 100 ఎకరాల్లో ‘లా’ స్కూల్ ఏర్పాటు చేస్తాం
న్యాయ శాఖ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి ప్రతిపాదనలను కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సీఎం సూచించారు.
జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం రూ.10 వేలు చెల్లించే ప్రక్రియను ప్రారంభించాలని చెప్పారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటుపైనా కసరత్తు చేయాలని సూచించారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని, దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే పద్ధతులను అవలంబించాలని సీఎం సూచించారు.
తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో లిటిగేషన్లు పెట్టాలే కానీ, అనవసర వివాదాలు తెచ్చేలా లిటిగేషన్లు ప్రభుత్వం నుంచి ఉండకూడదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. న్యాయశాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందని పేర్కొన్న ఆయన... మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు.
పింఛన్ల జాబితా నుంచి అనర్హులను తొలగించండి
గ్రామ సభలు నిర్వహించి అర్హులకు పింఛన్లు ఇవ్వడంతోపాటు అనర్హులను జాబితా నుంచి తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమంపై రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల పేరిట పొందే పింఛన్లపై అధికారులు దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైద్యుల నుంచి కొందరు తప్పుడు సరి్టఫికెట్లు పొంది దివ్యాంగుల పేరిట పింఛన్లు తీసుకోవడాన్ని అరికట్టాలన్నారు. దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు విశాఖలో 30 ఎకరాలు కేటాయించాలని ఆదేశించారు. కేంద్రం రూ.200 కోట్లతో ఈ సెంటర్ మంజూరు చేసిందన్నారు. ఒంటరిగా ఉండే ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు.
చేనేత జౌళి శాఖపై సమీక్ష
జౌళి శాఖపై సమీక్ష సందర్భంగా చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 35 చేనేత, 36 హస్తకళల క్లస్టర్ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ తీసుకొస్తామన్నారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు చేసి చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. నేత కారి్మకులకు ఆరోగ్య బీమా పథకం త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు.
మైనార్టీల పథకాలను పునర్ వ్యవస్థీకరించండి
మైనార్టీ సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తూ.. మైనార్టీలకు అందే పథకాలను పునర్ వ్యవస్థీకరించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి జన్‌వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. ప్రారంభంకాని పనులను రద్దు చేసి పునఃసమీక్ష చేయాలన్నారు.
నూర్‌బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేల చొప్పున ఇచ్చేలాచర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment