
సాక్షి, అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మాటున సాగించిన భూ దోపిడీపై సీఐడీ నమోదు చేసిన కేసులో 14వ నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు మూసివేసింది. లోకేశ్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు జారీ చేసి, అవసరమైనప్పుడు విచారణకు రావాలని కోరతామని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు. ఈరోజు వరకు ఆయన అరెస్టు విషయంలో భయపడాల్సిన అవసరంలేదని చెప్పారు. దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా లోకేశ్ విచారణ విషయంలో హైకోర్టు ఏ షరతులైనా విధించవచ్చని తెలిపారు. ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, వాటిని రికార్డ్ చేసింది.
తప్పనిసరిగా సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏను అనుసరించే ముందుకు వెళతామని ఏజీ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో, లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. అందువల్ల పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులను నిందితులుగా చేర్చింది.
చంద్రబాబు కుమారుడు, అప్పటి మంత్రి లోకేశ్‌ను సైతం 14వ నిందితునిగా చేర్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. లోకేశ్‌పై కేసులో సెక్షన్లను సవరించామని తెలిపారు. అవినీతి నిరో«దక చట్టం కింద మరిన్ని సెక్షన్లు చేర్చామని వివరించారు. దర్యాప్తు అధికారి చట్ట ప్రకారం నడుచుకుంటారని తెలిపారు. లోకేశ్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వాలని దర్యాప్తు అధికారి నిర్ణయించారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. అరెస్టు గురించి ఆందోళన చెందుతున్నారా అని లోకేశ్ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ప్రశ్నించారు.
అరెస్ట్ చేస్తారని అనుకుంటే ఎప్పుడైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునన్నారు. దర్యాప్తు నకు సహకరించాలని స్పష్టం చేశారు. దీనికి దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఏజీ చెప్పిన వివరాలను రికార్డ్ చేయాలని కోరారు. అరెస్టు విషయంలో కనిపించని ఆందోళన ఉందన్నారు. వరుసగా సెలవులు వస్తున్నాయని తెలిపారు. సీఐడీ అనుసరించే విధానం (మోడస్ ఆపరెండీ) వేరుగా ఉంటుందని, సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చిన తరువాత కూడా అరెస్ట్ చేసేందుకు వెనుకాడబోదని తెలిపారు.
పాలనాపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు
మోడస్ ఆపరెండీ అన్న పదం ఉపయోగించడంపై ఏజీ శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. ఈ పదం నిందితులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. లోకేశ్‌పై నమోదు చేసిన సెక్షన్లన్నింటినీ ఏజీ చదివి వినిపించారు. ఈ సెక్షన్లన్నీ వర్తిస్తాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పాలనాపరంగా లోకేశ్‌తో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలు పలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, అందువల్ల ఆ సెక్షన్లన్నీ ఆయనకు వర్తిస్తాయని తెలిపారు.
దర్యాప్తునకు సహకరించాలని లోకేశ్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు. దమ్మాలపాటి స్పందిస్తూ.. దర్యాప్తు అధికారి పిటిషనర్‌ను విచారణకు పిలవాలనుకుంటే ముందే ఆ విషయాన్ని తెలిపి సహేతుక సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ముందు రోజు నోటీసు ఇచ్చి, మరుసటి రోజు హాజరు కావాలంటే కష్టమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment