
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరపమని గతంలో ఇదే డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ తీర్పు ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల కమీషన్ (ఎస్‌ఈసీ) ఎన్నికలు నిర్వహించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కాగా, ప్రజాక్షేత్రంలో గెలవలేమని తెలుసుకున్న టీడీపీ దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తుందని, అందులో భాగంగా కోర్టుల్లో కేసులు వేస్తూ పాలనకు అడ్డు తగులుతుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు చిల్లర రాజకీయాలు చేస్తూ సంబరపడుతున్నారని, వారు ఎన్ని కుట్రలు పన్నినా అంతమ విజయం తమదేనని సజ్జల పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధమని, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు.
చంద్రబాబు డైరెక్షన్‌లో డ్రామాకు తెరలేపారు..
రఘురామకృష్ణరాజుపై నమోదైన సీఐడీ కేసులో ఎలాంటి అభ్యంతరాలు లేవని సజ్జల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ప్రజలందరు గమనించారని, ఈ డ్రామా మొత్తం చంద్రబాబు డైరెక్షన్‌లోనే సాగిందని ఆయన ఆరోపించారు. రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికి పంపలేదని ఎలా అడుగుతారని, అసలు రమేష్ ఆస్పత్రిలోనే పరీక్షలు ఎందుకు చేయాలి ప్రశ్నించారు.
గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లేటప్పుడు ఆయన సొంత వాహనంలో వెళ్లారని, ఆ సమయంలో ఏదైనా జరిగి ఉండొచ్చన్న అనుమానానన్ని వ్యక్తం చేశారు. అతని కాలు నిజంగా ఫ్రాక్చర్ అయితే కారులో కాళ్లు, చేతులు చూపిస్తూ విన్యాసాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. బెయిల్ రిజక్ట్ అయ్యి రాజద్రోహం కేసు నిలబడుతుందనే భయంతోనే ఆయన ఈ డ్రామాలన్నింటికీ తెరలేపుతున్నాడని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment