జిల్లాకు 200 ఎస్‌జీటీ పోస్టులు కూడా లేకుండా ఎలా మెగా డీఎస్సీ?
అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ అభ్యర్థుల ధర్నా
ఎస్‌జీటీ పోస్టుల భర్తీలో నాలుగు జిల్లాలకు తీవ్ర అన్యాయం
నెల్లూరులో 104, ప్రకాశంలో 124, శ్రీకాకుళంలో 144, అనంతపురంలో 183 పోస్టులు మాత్రమే..
అనంతపురం అర్బన్/ సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ అంటూ అనంతపురం జిల్లాకు సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టుల కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పలువురు ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌జీటీ పోస్టుల సంఖ్య అతి తక్కువగా చూపుతూ మెగా డీఎస్సీ అని చెప్పడం సరికాదని మండిపడ్డారు. పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం అనంతపురం పట్టణంలో వందలాది మంది అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ అభ్యర్థులు విష్ణు, గంగాధర్, జ్యోతి, హర్షబాను తదితరులు మాట్లాడుతూ ఎస్‌జీటీ పోస్టుల కేటాయింపులో ప్రభుత్వం అనంతపురం జిల్లాను చిన్నచూపు చూస్తోందన్నారు. జిల్లాలో డీఎడ్ చేసి ఎస్‌జీటీ పోస్టులకు సిద్ధమవుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. కానీ, జిల్లాకు కేవలం 183 ఎస్‌జీటీ పోస్టులు కేటాయించడం సరికాదన్నారు.
డీఎస్సీ కోసం ఎదురు చూస్తూ తల్లిదండ్రులు పంపిన డబ్బులతో హాస్టళ్లు, రూముల్లో ఉంటూ శిక్షణ తీసుకుంటూ చదువుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తగినన్ని పోస్టులు లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. అనంతపురం జిల్లాలో కనీసం అంటే వెయ్యి ఎస్‌జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ భర్తీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో జి.రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఎస్‌జీటీ పోస్టుల సంఖ్య పెంచాలి: డీవైఎఫ్‌ఐ
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టుల భర్తీలో నాలుగు జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ పేర్కొంది. మెగా డీఎస్సీకి సంబంధించిన తొమ్మిది అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు రాసిన లేఖను డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాము, జి.రామన్న శనివారం మీడియాకు విడుదల చేశారు.
‘మెగా డీఎస్సీలో ప్రకటించిన ఎస్‌జీటీ పోస్టుల విషయంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 104, ప్రకాశం జిల్లాలో 124, శ్రీకాకుళం జిల్లాలో 144, అనంతపురం జిల్లాలో 183పోస్టులు మాత్రమే చూపించారు. ఆ నాలుగు జిల్లాలకు పోస్టుల సంఖ్య పెంచి అభ్యర్థులకు న్యాయం చేయాలి. అప్రెంటీస్ విధానాన్ని, జీవో 117ను రద్దు చేయాలి. వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. ప్రస్తుతం ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగా, ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది వెల్లడించాలి.
గతంలో రద్దు చేసిన పాఠశాలలను, పీఈటీ పోస్టులను పునరుద్ధరించాలి. ఈ సంవత్సరం చివరి నాటికి రిటైర్డ్ అవుతున్న ఉపాధ్యాయుల లెక్కలు, రాష్ట్రంలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను దృష్టిలో పెట్టుకుని పోస్టులు భర్తీ చేయాలి. ఉపాధ్యాయుల పదవీవిరమణ వయసును 62ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment