సాక్షి, విశాఖపట్నం: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది.
మరోవైపు.. ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. 360 మంది భారతీయులను ఎంబసీ అఫ్ ఇండియా కాపాడింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: + 855 10642777 సంప్రదించాలని అధికారులు కోరారు.
అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.
విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్‌ల మీదుగా కంబోడియాకు పంపించారు.
అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు.
అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.
ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment