అస్వస్థతకు గురైన చిన్నారులను రేఖపల్లి పీహెచ్‌సీకి తరలిస్తున్న 108 సిబ్బంది
వీఆర్‌పురం: తినుబండారాలు వికటించి 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన పులుసు మామిడి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నారుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుల్లేటివాడ గ్రామానికి చెందిన వంజం బుచ్చయ్య బూరుగువాడలోని తన సోదరి కనుముల భద్రమ్మ కుటుంబాన్ని కలిసే నిమిత్తం మండల కేంద్రం రేఖపల్లికి చేరుకున్నాడు. తన సోదరి ఇంట్లో ఉన్న చిన్నారుల కోసమని అక్కడ దుకాణంలో రసగుల్లా, కాజా,గవ్వలు వంటి తినుబండాలు కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి బూరుగువాడ చేరుకొని భద్రమ్మ ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారులకు ఇచ్చాడు. వాళ్లతో పాటు అక్కడ ఉన్న ఇతర పిల్లలకు కూడా ఇచ్చారు.
అవి తిన్న 12 మంది చిన్నారులు వాంతులు చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై అధికారులకు సమాచారం అందజేశారు. తహసీల్దార్ ఎన్.శ్రీధర్, వైద్యాధికారి చైతన్య, ఎస్సై బి.వెంకట్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వారందరినీ 108లో రేఖపల్లి పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందజేశారు. పిల్లలందరి ఆరోగ్యం సక్రమంగానే ఉందని అందులో మూడేళ్ల కనుముల సమంత అనే బాలికకు మాత్రం వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పట్టలేదని వైద్యాధికారి చైతన్య చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని తహసీల్దార్, ఎస్సైలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment