సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గోపాల్‌పూర్‌కు 580, కళింగపట్నానికి 660 కీలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం మరో 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తీరం వైపు 14 కీలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. వాయవ్యంగా కదులుతూ రేపు( ఆదివారం) సాయంత్రానికి వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్షం ఉన్నట్లు సూచించారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం రాగల 12 గంటల్లో బలపడి తుఫానుగా మారనుందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అన్నారు. పశ్చిమ దిశగా పయనించి రేపు సాయంత్రానికి ఉత్తరాంధ్ర (విశాఖ)- దక్షిణ ఒడిశా(గోపాల్ పూర్) మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు (శనివారం) కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశంఉందని తెలిపారు. రేపు(ఆదివారం) ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. రేపు( ఆదివారం) ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 70 -90 కీమీ వేగంతో బలమైన ఈదురుగాలులతో సముద్రం అలజడిగా మారుందనిమత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని తెలిపారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment