సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ప్రభావం ఆయా కోర్సుల సీట్ల భర్తీలో పెను మార్పులను తెస్తోంది. ఈ పథకాల ద్వారా ప్రభుత్వం ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ చేయడంతో పాటు.. విద్యార్థుల వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకూ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యే సీట్ల శాతం.. గతంలో కన్నా భారీగా పెరిగింది. ఈ సీట్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ పోటీపడుతుండటంతో సీట్ల భర్తీలో గడచిన రెండేళ్లలో ఏకంగా 10 శాతానికి పైగా పెరుగుదల కనిపిస్తోంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ముందు టీడీపీ హయాంలో చూస్తే.. ఇంజనీరింగ్ కోర్సుల్లో 2018లో 61.54 శాతం, 2019లో 51 శాతం మాత్రమే కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత 2020లో, 2021లో 73 శాతం మేర భర్తీ అవుతుండటం విశేషం. ఈడబ్ల్యూఎస్ కోటాలోని వారికి అదనంగా 10 శాతం సీట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రాష్ట్రంలో సీట్ల కేటాయింపు ఇంతకు ముందు నుంచీ ఉంది. అదనపు సీట్లు రాకుండా ఉంటే.. వీరికి కేటాయించిన సీట్లను కూడా కలుపుకొంటే కన్వీనర్ కోటా సీట్ల భర్తీ 2021లో 80.79 శాతం, 2020లో 80.60 శాతం అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
స్పాట్ అడ్మిషన్లకు ‘సీట్ల’ తగ్గుదల
గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ లేనందున విద్యార్థుల చేరికల్లేక కన్వీనర్ కోటా సీట్లు భారీగా మిగిలిపోయేవి. ఆ తర్వాత వాటిని స్పాట్ అడ్మిషన్ల కింద ఆయా కాలేజీలు భర్తీచేసుకునేవి. ఇప్పుడు కన్వీనర్ కోటా సీట్లు అధిక శాతం భర్తీ అవుతుండటంతో స్పాట్ అడ్మిషన్లకు మిగులు సీట్లు తగ్గాయి. టీడీపీ హయాంలో 2015లో 40,436 సీట్లు, 2016లో 47,735 సీట్లు, 2019లో 45,888 సీట్లు మిగిలిపోయాయి. అదే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుతో వాటి సంఖ్య 2020లో 28,575, అలాగే 2021లో 30,369 మాత్రమే మిగిలాయి. వీటిలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను మినహాయిస్తే కనుక ఈ సంఖ్య మరింత తక్కువే. 2021లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో కేవలం రెండు విడతల్లోనే ముగించారు. గతంలో కౌన్సెలింగ్‌ను నాలుగు విడతల వరకూ కూడా నిర్వహించేవారు. ఈ సారి కూడా అలాగే ఉంటుందని భావించిన పలువురు.. రెండు విడతల్లోనే కౌన్సెలింగ్ ముగియడంతో కన్వీనర్ కోటా సీట్లను దక్కించుకోలేకపోయారు.
చేరికలు లేక గతంలో తగ్గిపోతూ వచ్చిన సీట్లు
గతంలో రాష్ట్రంలో ప్రమాణాలు లేకున్నా పలు కాలేజీలను కొనసాగించిన దరిమిలా రాష్ట్రం మొత్తంమీద ఇంజనీరింగ్ కాలేజీలు 467 వరకూ ఉండేవి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక చేరికలు తగ్గి ఆయా కాలేజీలు కోర్సులను రద్దు చేసుకోవడంతో సీట్ల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. 2015 నాటికి రాష్ట్రంలో 467 కాలేజీల్లో 1,13,745 సీట్లుండగా.. 2018 నాటికి 96,857, 2019 నాటికి 95,582 ఉన్నాయి. 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు అదనంగా చేరి మొత్తం సీట్లు 1,06,203కు పెరిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రమాణాలు లేని కాలేజీలను ప్రక్షాళన చేయడంతో వాటి సంఖ్య 437కు తగ్గింది. ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకొని కన్వీనర్ కోటా సీట్లు 2020లో 1,04,090, 2021లో 1,11,304కు చేరాయి.
పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో కన్వీనర్ కోటా సీట్లలో అత్యధిక శాతం భర్తీ అవుతున్నాయి. ప్రవేశ పరీక్షల్లో అత్యధిక మార్కులతో మెరిట్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ నిరుపేద విద్యార్థులు గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక అత్యధిక ఫీజులుండే ప్రముఖ కాలేజీల్లో చేరలేకపోయేవారు. కానీ ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడంతో వారంతా తమ మెరిట్‌కు తగ్గ ప్రముఖ కాలేజీల్లో చేరగలుగుతున్నారు. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో పది శాతం మేర పెరిగిన భర్తీ అయిన సీట్లన్నీ ఇటువంటి పేద విద్యార్థుల చేరికలతోనే అన్నది స్పష్టమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వం.. కాలేజీల్లో ఫీజు ఎంత ఉన్నా సరే.. రూ.35 వేలే ఇచ్చేది. దీనివల్ల మిగతా ఫీజును విద్యార్థులు చెల్లించాల్సి రావడంతో కోర్సు పూర్తయ్యే నాటికి తల్లిదండ్రులకు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకూ అప్పులయ్యేవి.
Comments
Please login to add a commentAdd a comment