
ఐఎంబీఎల్‌లో గస్తీ కాస్తున్న భారత నౌక ఐఎన్‌ఎస్ కోరా
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం, బంగ్లాదేశ్ నేవీ సంయుక్తంగా నిర్వహించే కోర్డినేటెడ్ పెట్రోల్ (కార్పాట్) ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ప్రారంభమైంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (ఐఎంబీఎల్) వెంబడి 2018 నుంచి ప్రతి ఏటా ఇరుదేశాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటాయి. అక్టోబర్ 2020లో నిర్వహించిన అనంతరం కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు కార్పాట్ జరగలేదు.
నాలుగో ఎడిషన్‌ని భారత్, బంగ్లాదేశ్ నౌకాదళాలు రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభించాయి. భారత్ తరఫున గైడెడ్ మిసైల్ షిప్ ఐఎన్‌ఎస్ కోరా, ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ ఐఎన్‌ఎస్ సుమేధతో పాటు మారీటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ గస్తీలో పాల్గొనగా.. బంగ్లాదేశ్ తరఫున బీఎన్‌ఎస్ అలీ హైదర్, బీఎన్‌ఎస్ అబూ ఉబైదాలు కార్పాట్‌లో పాలుపంచుకున్నాయి. సోమవారంతో ఈ గస్తీ కార్యక్రమం ముగియనుంది.