హెచ్‌ఐవీ.. దశాబ్దం క్రితం వరకు దీనిపై నలుగురిలో మాట్లాడాలంటేనే వణుకు. ఆత్మహత్య ఒక్కటే శరణ్యమనుకునే వారు. కానీ.. మందులకు లొంగని ఈ వ్యాధి సోకినంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదని కోటగిరి రేణుక రుజువు చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన రేణుక భర్త కోటగిరి శ్రీనివాసరావుకు 1999లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. రేణుకకు కూడా ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. 2003లో శ్రీనివాసరావు మృతి చెందారు.
భర్త మరణానంతరం రేణుక విజయవాడకు మారారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల ఉన్న చిన్నచూపు వల్ల తనలా ఇంకెంత మంది మహిళలు వేదనకు గురవుతున్నారోననే భావన రేణుకను కలచివేసింది. హైదరాబాద్‌కు వెళ్లి హెచ్‌ఐవీ బాధితుల ‘కేర్ అండ్ సపోర్టింగ్’లో శిక్షణ పొందారు. అనంతరం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా 2003లోనే ‘తెలుగు నెట్‌వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్‌ఐవీ అండ్ ఎయిడ్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను నెలకొల్పడంలో భాగస్వామి అయ్యారు.
మరోవైపు అప్పట్లోనే చేయూత అనే సంస్థను సైతం నెలకొల్పి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని హెచ్‌ఐవీ బాధితులకు వివిధ రకాలుగా అండగా నిలిచారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులకు సాయం, పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇప్పటివరకు 200 మంది పిల్లల చదువులకు చేయూత ఎన్‌జీవో ద్వారా సాయం అందించారు. ప్రస్తుతం 400 మంది పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆమె సహకారంతో బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ చదివిన వారు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు.
చెప్పుకోవడానికి భయపడను
నేను హెచ్‌ఐవీ పాజిటివ్ అని చెప్పుకోవడానికి భయపడను. అలా చెప్పుకోవడానికి ఇబ్బంది పడి.. నాలుగు గోడల మధ్య కుంగిపోకుండా బాధితులకు సాయం చేయడమే నా లక్ష్యం. తమ ప్రమేయం లేకున్నా.. ఏ తప్పు చేయకున్నా చాలామంది ఈ వ్యాధి బారినపడుతుంటారు. వ్యాధి సోకినంత మాత్రాన కుంగిపోవద్దు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ప్రభుత్వ రంగంలో మంచి వైద్యం అందుతోంది. ఎవరో.. ఏదో అనుకుంటారని బాధితులు ఆస్పత్రులకు వెళ్లడం మానేయొద్దు.
– కోటగిరి రేణుక, చైర్మన్, చేయూత స్వచ్ఛంద సంస్థ
Comments
Please login to add a commentAdd a comment