చల్‌ చల్‌ గుర్రం! | Interest of youth and children in horse riding | Sakshi
Sakshi News home page

చల్‌ చల్‌ గుర్రం!

Published Thu, May 25 2023 5:12 AM | Last Updated on Thu, May 25 2023 5:12 AM

Interest of youth and children in horse riding - Sakshi

పిఠాపురం: గుర్రపు స్వారీ అనేది ఆటవిడుపు, సాహస క్రీడ. ప్రస్తుతం ఇది ట్రెండ్‌గా మారింది. యువతతో పాటు చిన్న పిల్లలు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్‌ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై స్వారీ చేస్తుంటే.. చూసి ముచ్చటపడుతున్నారు. యువత, చిన్నారుల తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్‌ రైడింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయి.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 100 మంది 250 గుర్రాల వరకూ పెంచుతున్నారంటే.. గుర్రపు స్వారీపై యువత ఆసక్తి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాలు వెలిశాయి. గతంలో గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఓ మోస్తరు పట్టణాల్లోనూ శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. వేసవి కావడంతో యువతతో పాటు చిన్నారులు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.  

మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి మేలు
గుర్రపు స్వారీ అనేది పలు మానసిక, శారీరక సమస్యలకు సంజీవనిలా పనిచేస్తుంది. పోలియో, పక్షవాతం, మెదడు, వెన్నెముక సమస్యలు, వినికిడి లోపాలు, భావవ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడం వంటి వాటికి చక్కటి చికిత్సగా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన పిల్లలకు మంచి ఫలితాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, ఆశ్వాన్ని దూమికించడం, ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యల వల్ల మెదడుకి, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుందని.. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయని చెబుతున్నారు.  

గుర్రపు స్వారీకి అనువైన ప్రాంతంగా తీరం
గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకే ఎలాంటి ప్రమాదాలు జరిగినా రైడర్‌కు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుల నేలల్లోనే నేర్పాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ఇసుకను తెచ్చి వేస్తుంటారు.

అలాంటి పరిస్థితి లేకుండా తీర ప్రాంతాల్లో ఉన్న ఇసుక మేటలు గుర్రపు స్వారీలకు అనుకూలంగా ఉండటంతో కాకినాడ తీరం ప్రాంతంలో ఉన్న ఇసుక నేలల్లో గత నెల రోజులుగా గుర్రపు స్వారీ శిక్షణ ఇస్తున్నాము. రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున నేర్పుతున్నాము.  – కె.అనిల్‌రెడ్డి, గర్రపు స్వారీ శిక్షకుడు, కాకినాడ  

చాలా సరదాగా ఉంది..  
మా నాన్న ఆడుకునేందుకు నాకు గుర్రపు బొమ్మ కొనిచ్చాడు. ఇది వద్దు.. నిజంగా గుర్రం మీద స్వారీ చేయాలని అడిగేవాడిని. అది ఇప్పుడు నిజమైంది. గుర్రంపై సవారీ చేయడం చాలా సరదాగా ఉంది. ముందు భయమేసినా రానురాను అలవాటైపోయింది. ఇప్పుడు ఏ భయం లేకుండా గుర్రంపై స్వారీ చేస్తున్నా.   – ఆరుష్‌వర్మ, కాకినాడ 

చిన్ననాటి కల నేరవేరిందిలా..  
ఎప్పటి నుంచో గుర్రపు స్వారీ చేయాలన్న కోరిక ఉండేది. శిక్షణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటి వరకూ కుదరలేదు. కాకినాడ తీరంలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఆ కోరిక ఇలా తీరింది. గుర్రపు స్వారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. శిక్షణ పొందిన గుర్రాలు కావడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా నేర్చుకుంటున్నాను.  – అభిషేక్, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement