సాక్షి, విశాఖపట్నం: విశాఖ రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్‌లకు అందించే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌ని ఆదివారం ఈ బీచ్ దక్కించుకుంది. బ్లూఫ్లాగ్ ఇంటర్నేషనల్ జ్యూరీ బృందం ఆయా బీచ్‌ల్లో నిర్వహించిన పనుల్ని వర్చువల్ ద్వారా పరిశీలించింది. అనంతరం దేశంలో 13 బీచ్‌ల నుంచి ఎనిమిది బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయని వెల్లడించింది. అదేవిధంగా తీర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు భారత్ తీసుకుంటున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని బ్లూఫ్లాగ్ బీచెస్ ఆఫ్ ఇండియా మిషన్ లీడర్ సంజయ్ జల్లా ప్రకటించారు.
బ్లూఫ్లాగ్ గుర్తింపు వల్ల లాభమేమిటంటే..
ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్ బీచ్‌లకు విశేష ఆదరణ ఉంటుంది. విదేశీ పర్యాటకులు ముందుగా బ్లూఫ్లాగ్ బీచ్‌నే ఎంపిక చేసుకుంటారు. ఈ సర్టిఫికెట్‌ని పొందాలంటే బీచ్ పర్యావరణహితంగా ఉండటంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి రసాయనాలు బీచ్ పరిసరాల్లో కలవకుండా చూడాలి. ఈ సర్టిఫికెట్‌ని డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఈఈ) సంస్థ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌ని పొందాయి.
మరిన్ని బీచ్‌ల గుర్తింపునకు కృషి చేస్తాం
బీచ్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, అధికారులు కష్టపడటం వల్లే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభించింది. దేశంలో కేవలం 8 బీచ్‌లు ఈ గుర్తింపు పొందగా అందులో రుషికొండ ఉండటం గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా ఏడాది కాలంగా బీచ్‌లో చేపట్టిన పనులు జ్యూరీ ప్రశంసలు పొందాయి. ఏపీ నుంచి మరిన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వచ్చేందుకు కృషి చేస్తాం.
- పర్యాటక మంత్రి ముత్తంశెట్టి
Comments
Please login to add a commentAdd a comment