సాక్షి, అమరావతి: ఈ నెల 17 నుంచి వచ్చే నెల 9 వరకు జరిగే గ్రూప్–1 పోస్టుల ఇంటర్వ్యూలను అత్యంత పారదర్శకంగా.. ఎలాంటి అనుమానాలు, సందేహాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పటిష్ట చర్యలు చేపట్టింది. గతంలో తలెత్తిన లోపాలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేకుండా కొన్ని కొత్త విధానాలను అమలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇంటర్వ్యూ బోర్డు ఎంపిక అభ్యర్థులదే..
కొత్త ప్రతిపాదనల ప్రకారం.. అభ్యర్థులు ఏ బోర్డు ముందు ఇంటర్వ్యూకు హాజరు కావాలో తమకు తామే నిర్ణయించుకోవచ్చు. గతంలో ఏ బోర్డు ముందు ఇంటర్వ్యూకు హాజరు కావాలో ఏపీపీఎస్సీ ముందుగా నిర్ణయించి.. ఆ మేరకు అభ్యర్థులకు తెలిపేది. దీనివల్ల అనేక లొసుగులకు ఆస్కారం ఉండేది. అనేక ఆరోపణలు, విమర్శలూ వెల్లువెత్తేవి. ఇప్పుడు అలాంటి వాటికి చెక్ పెడుతూ అభ్యర్థులే ఇంటర్వ్యూ బోర్డును ఎంచుకునే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు అభ్యర్థులు కమిషన్ కార్యాలయంలోని డబ్బాలో 1, 2, 3 ఇంటర్వ్యూ బోర్డుల నంబర్లతో కూడిన చిట్టీల్లో ఒకదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏ బోర్డు నంబర్ వస్తే.. ఆ బోర్డు వద్దకు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
బోర్డుల ఏర్పాటులో పలు జాగ్రత్తలు
గ్రూప్–1 ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు రెండు లేదా మూడు బోర్డులను ఏర్పాటు చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఈ బోర్డులకు చైర్మన్, సభ్యుల ఎంపికలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవరు ఏ బోర్డులో ఉంటారో అనే విషయం ఆ సభ్యుడికి ఇంటర్వ్యూ సమయానికి కొద్ది నిముషాల ముందు మాత్రమే తెలియనుంది. గతంలో అయితే బోర్డులో ఎవరెవరు సభ్యులో ముందుగానే అందరికీ తెలిసిపోయేది. ఈ విధానంలో అవకతవకలకు, ఆరోపణలకు ఆస్కారమేర్పడుతోందన్న ఉద్దేశంతో ఇప్పుడీ కొత్త పద్ధతిని కమిషన్ ప్రవేశపెడుతోంది.
ప్రతి బోర్డులో చైర్మన్‌తో సహా ఐదుగురు
ఏరోజుకారోజు ఇంటర్వ్యూ బోర్డుల కూర్పు ఉంటుంది. ప్రతి బోర్డులో చైర్మన్‌తో సహా మొత్తం ఐదుగురు ఉంటారు. వీరిలో ముగ్గురు ఏపీపీఎస్సీ సభ్యులు కాగా.. ఒకరు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి, మరొకరు ఐటీ, తదితర రంగాలకు చెందిన ప్రముఖుడు ఉండేలా కమిషన్ చర్యలు చేపడుతోంది. ఒక్కో బోర్డు ఉదయం ఐదుగురికి, సాయంత్రం ఐదుగురికి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముంది.
మార్కుల పద్ధతిలోనూ మార్పులు
గ్రూప్–1 ఇంటర్వ్యూలను 75 మార్కులకు నిర్వహిస్తారు. గతంలో.. మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, కావాల్సినవారికి అత్యధిక మార్కులు వేస్తున్నారని, మిగతా వారికి అతి తక్కువ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తేవి. మొత్తం 75 మార్కుల్లో తమ వారికి 70కి పైగా వేస్తూ.. మిగతావారికి 10, 20 మార్కులతోనే సరిపెడుతున్నారని, దీనివల్ల రాతపరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన మెరిట్ అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని విమర్శలు చెలరేగేవి. రాతపరీక్షల్లో 500 మార్కులతో అగ్రస్థానంలో ఉన్న అభ్యర్థికి ఇంటర్వ్యూలో 20 మార్కులతో సరిపెట్టి.. తమకు సంబంధించిన అభ్యర్థికి 450 మాత్రమే వచ్చినా ఇంటర్వ్యూలో 70కి పైగా మార్కులు వేయడంతో మెరిట్ అభ్యర్థులు నష్టపోయేవారు. ఇప్పుడు అలాంటి వాటికి ఆస్కారం లేకుండా కమిషన్ మార్కుల కేటాయింపులోనూ నిర్దిష్ట ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపడుతోంది.
గ్రేడుల ప్రకారం మార్కులు..
45 నుంచి 68 మార్కుల వరకు ప్రతి నాలుగు మార్కులను ఒక గ్రేడుగా పరిగణిస్తారు. ఆ గ్రేడ్‌ల ప్రకారం.. అభ్యర్థులకు మార్కుల కేటాయింపు ఉంటుంది. ఎవరికీ 45 మార్కుల కంటే తక్కువ.. 68 మార్కుల కంటే ఎక్కువ ఉండకుండా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అనంతరం బోర్డు సభ్యులు ఆయా అభ్యర్థికి వచ్చిన గ్రేడ్ల మార్కులను అనుసరించి.. చివరిగా ఏకాభిప్రాయంతో ఒక గ్రేడ్‌ను నిర్ణయించి.. బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో తుది మార్కులను ఖరారు చేస్తారు. తర్వాత వాటిని రికార్డులోకి ఎక్కించి బోర్డు చైర్మన్, సభ్యులంతా సంతకం చేస్తారు. ‘మాకు తక్కువ వేశారు.. వారికి ఎక్కువ వేశారు’ అనే వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్త వహిస్తారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు అభ్యర్థుల హాల్‌టిక్కెట్ నంబర్, వారు ఏం చదువుకున్నారన్న వివరాలను తప్ప మరే అంశాలను తెలియనివ్వరు.
Comments
Please login to add a commentAdd a comment