సాక్షి, అమరావతి : గ్రూప్–1 ఇంటర్వ్యూలు, నియామక ప్రక్రియలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం సైతం నిరాకరించింది. ఇంటర్వ్యూలు, వాటి ఫలితాల వెల్లడి, తదనంతర నియామక ప్రక్రియను యథాతథంగా కొనసాగించవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ)కు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే నియామకాలన్నీ కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని, ఈ విషయాన్ని అభ్యర్థులకు ఇచ్చే నియామక ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని చెప్పింది. ఎంపికైన అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేక హక్కులను (ఈక్విటీస్) కోరజాలరని, దీనిపై వారి నుంచి హామీ తీసుకోవాలని కమిషన్‌ను ఆదేశించింది సింగిల్ జడ్జి ముందున్న వ్యాజ్యాల్లో జూలై మొదటి వారానికల్లా కౌంటర్లు దాఖలు చేయాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది.
ఆ కౌంటర్లకు 13వ తేదీకల్లా సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు చెప్పింది. రిట్ పిటిషన్లను జూలై 14న లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇరుపక్షాలూ ఎలాంటి వాయిదా కోరకుండా ఆ రోజున వాదనలు వినిపిస్తారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. గ్రూప్–1 మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఇంటర్వ్యూలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఇంటర్వ్యూలు, నియామక ప్రక్రియ నిలుపుదలకు నిరాకరిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ ధర్మాసనం రెండు రోజుల క్రితం వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ ఆదేశాలతో అందరి ప్రయోజనాలు పరిరక్షించినట్లు అవుతుందని పేర్కొంది.
సమాధాన పత్రాలు జాగ్రత్త చేయండి
2018 డిసెంబర్ 31 నాటి నోటిఫికేషన్ ఆధారంగా గ్రూప్–1 మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థులందరి సమాధాన పత్రాలను జాగ్రత్త చేయాలని సర్వీస్ కమిషన్‌ను ధర్మాసనం తన తీర్పులో ఆదేశించింది. డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన అభ్యర్థుల సమాధాన పత్రాలు, వారు మాన్యువల్ మూల్యాంకనంలో సాధించిన మార్కుల వివరాలను సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచాలని ఆదేశించింది. మాన్యువల్ మూల్యాంకనంలో అర్హత సాధించిన అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలంది.
కోర్టు ఏ సమాధాన పత్రం చూడాలన్నా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. మాన్యువల్ మూల్యాంకనం చేసిన వారిలో 50 శాతంకి తగిన అర్హతలు లేవని పిటిషనర్లు చెబుతున్నారని, అయితే, 50 శాతం మందికి పీహెచ్‌డీ డిగ్రీలు ఉన్నాయని, వారు ఆయా సబ్జెక్టుల్లో మంచి పరిజ్ఞానం ఉన్న వారని ఏపీపీఎస్సీ చెబుతోందని తెలిపింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మూల్యాంకనకర్తల వివరాలను ముందే సోషల్ మీడియాలో పోస్టు చేసినా, వారికి అభ్యర్థుల పేర్లు తెలిసే అవకాశం లేదని, సమాధానపత్రాలన్నీ డీకోడ్ చేస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఏపీపీఎస్సీ వాదన తోసిపుచ్చలేం
మాన్యువల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్లను సింగిల్ జడ్జి అనుమతించిప్పటికీ, వారికి మాత్రం ఉద్యోగాలు రావని, కోర్టు ఆదేశాల ప్రకారం మొత్తం ప్రక్రియను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందన్న ఏపీపీఎస్‌సీ వాదనను తోసిపుచ్చలేమని తెలిపింది. తమ అభిప్రాయాలు ఈ అప్పీళ్లను తేల్చడానికి మాత్రమే పరిమితం అవుతాయే తప్ప అంతకు మించి కాదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల ఫలితాలను ప్రభుత్వానికి పంపడానికి ఏపీపీఎస్‌సీకి 7–9 రోజులు పడుతుందని, ఆ తరువాత కమిషన్ సిఫారసులను ఆమోదించి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వానికి 4–6 వారాల సమయం పడుతుందని తెలిపింది. అందువల్ల సింగిల్ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలను జూలై 14న లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment