నిస్సిగ్గు రాజకీయాలకు రఘరాజు నిలువెత్తు నిదర్శనం
శాసనమండలి చైర్మన్ సమక్షంలో వివరణ ఇచ్చేందుకు డుమ్మా
రేపు విచారణకు రావాలని మరోసారి నోటీసులు
సింహాసనం ఎక్కించిన వైఎస్సార్‌సీపీకి దంపతుల ద్రోహం
పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీతో అంటకాగుతున్న వైనం
ఈ చిత్రం చూశారా? టికెట్ పంచాయితీ ముగిసిన తర్వాత లోకేశ్‌తో గొంప కృష్ణ సహా ఎస్.కోట టీడీపీ నాయకులంతా ఫోజు ఇచ్చిన ఫొటో ఇది. అప్పటివరకూ అంతా తానై నడిపించిన రఘురాజు మాత్రం ఆ ఫొటోలో కనిపించకుండా దాగుండిపోయారు. ధైర్యం ఉంటే వారితో ఫొటో దిగవచ్చు కదా? అలా చేస్తే ఆయన రఘురాజు ఎందుకవుతారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి, సి.రామచంద్రయ్య, జనసేన పార్టీలోకి జంప్ చేసిన వంశీకృష్ణ యాదవ్‌పై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు వేటు వేశారు. వాళ్లంతా బాహాటంగానే ఫిరాయించారు. వారికి భిన్నంగా తెరచాటు, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న రఘురాజు గుట్టు ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది.
లోకేశ్ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న వ్యవహారం, వారితో కుమ్మకై ఎస్.కోటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు తాఖీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇస్తున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నవారంతా శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మండల స్థాయి నాయకులు. వారి మధ్యలో కూర్చున్న వ్యక్తి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. వారు వెళ్లింది ఏదో ప్రజాప్రయోజన కార్యక్రమం కోసం కాదు సుమీ... టీడీపీ టికెట్ కోసం పోటీపడిన కోళ్ల లలితకుమారి, గొంప కృష్ణ మధ్య సంధి కోసం! గత మార్చి నెలలో లోకేశ్‌ను కలిసేందుకు ఆయన ఇంట్లో వేచివున్న సదరు నాయకుల చిత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పదవులిచ్చిన పారీ్టకే ద్రోహం...
శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న కోళ్ల లలితకుమారికి వ్యతిరేకంగా గళమెత్తిన గొంప కృష్ణ నోరుమూయించిన వ్యవహారం వెనుక పెద్ద తతంగమే నడిచింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... గత మార్చి నెలాఖరులో గొంప కృష్ణను, ఆయన అనుచరులను నారా లోకేశ్ హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడ జరిగిన టికెట్ పంచాయితీకి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వెళ్లడం అప్పట్లో సంచలనమైంది. కాకపోతే ఆ భేటీ ఫొటోలేవీ అప్పట్లో బయటకు రాకపోవడంతో తాను ఇంకా వైఎస్సార్‌సీపీలోనే ఉన్నానంటూ రఘురాజు నటించారు. తెరవెనుక మాత్రం టీడీపీ మేలు కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అప్పటికే ఎస్.కోట మండల వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేయకుండానే తన భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్ సుధారాజును టీడీపీలోకి పంపించారు. లోకేశ్‌తో పచ్చ కండువా వేయించారు.
బడ్డువరలోని స్వగృహంలో టీడీపీ సమావేశాలన్నీ పెడుతూనే అవేవీ తనకు సంబంధం లేదని బుకాయిస్తూ వచ్చారు. భార్య, భర్త వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేమిటని, మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండవచ్చా? అంటూ సుధారాజు ఘాటు వ్యాఖ్యలు చేసినా ఆయన ఖండించలేదు. రాజకీయంగా అండదండలు అందించిన బొత్సపైనే విమర్శలు చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంత స్థాయి లేకపోయినా ఇచ్చిన మాట కోసం సామాజిక సమీకరణలనూ పక్కనబెట్టి ఎమ్మెల్సీని చేసిన వైఎస్సార్‌సీపీకే ద్రోహం చేసిన వ్యక్తి నుంచి అంతకన్నా ఏమీ ఆశించలేమని పార్టీ శ్రేణులు నివ్వెరపోయారు.
ఎంత వారించినా తెగింపే...
వాస్తవానికి పార్టీకి నష్టం చేసే పనులు చేయొద్దని, వారి రాజకీయాలకు ఇబ్బందేమీ ఉండదని రఘురాజు దంపతులకు వైఎస్సార్‌సీపీ అధిష్టానం నచ్చజెప్పి చేసింది. ఎంత వారించినా ‘స్థానికత’ ముసుగులో పార్టీకి ద్రోహం చేయడానికి తెగించారు. ఈ కుతంత్రంలోకి ఎస్ కోట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కొందరినీ లాగేందుకు విఫలయత్నం చేశారు.
ఎమ్మెల్సీ మూణ్నాళ్ల ముచ్చటే...
ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఒక పార్టీ తరఫున చట్టసభల్లో అడుగుపెట్టిన వ్యక్తి తర్వాత సదరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం–1985 ప్రకారం అనర్హత వేటు పడుతుంది. ఈ ప్రకారం వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టిన రఘురాజు ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలని అతనిపై ఫిర్యాదు దాఖలైంది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు నోటీసులు పంపించారు. ఈ నెల 31న రఘురాజు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. పారీ్టకి ద్రోహం చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎన్నికల కమిషన్ అనుమతితో రఘురాజు సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది.
∙ కోళ్ల’కు కాటు తప్పదా?
వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేసి టీడీపీ కోసం పనిచేస్తున్న రఘురాజు దంపతులతో తనకు మేలు జరుగుతుందని టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి భావిస్తున్నారు. కానీ లోకేశ్ సమక్షంలో జరిగిన పంచాయితీ గురించి తెలిస్తే ఆమె గుండె పగిలిపోవడం ఖాయమని టీడీపీ నాయకులే గుసగుసలాడుతున్నారు. తన భార్యను ఏదిఏమైనా సరే ఎమ్మెల్యే చేయాలన్నదే రఘురాజు జీవిత ఆశయమట! కడుబండి శ్రీనివాసరావును తప్పిస్తే ఆమెకే వైఎస్సార్‌సీపీ టికెట్ ఇప్పించాలని చేసిన ప్రయత్నాలే ఫలించలేదు. దీంతో టీడీపీని ఆశ్రయించారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ చొరవతో లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన దామచర్ల సత్యకు చేరువయ్యారు.
గత ఎన్నికల్లో రఘురాజు పోటీచేసి 30 వేల పైచిలుకు ఓట్లు సాధించారని, ఆయనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని దామచర్ల సత్యనారా లోకేశ్‌కు చెప్పారట! దీంతో రఘురాజుతో కలిసి వైఎస్సార్‌సీపీపై కుట్రకు టీడీపీ నాయకులు సిద్ధమైపోయారు. ఇందుకోసం కోళ్ల లలితకుమారికి తెలియకుండానే వారిమధ్య చీకటి ఒప్పందం కుదిరింది. 2029 నాటికి నియోజకవర్గ పునరి్వభజన ద్వారా ఎస్.కోట రెండు నియోజకవర్గాలు అవుతుందని, వాటిలో ఒక టికెట్ గొంప కృష్ణకు, రెండో నియోజకవర్గంలో టికెట్ రఘురాజు భార్య సుబ్బలక్ష్మికి ఇస్తామని లోకేశ్ గట్టి హామీ ఇచ్చారట! ఇద్దరికీ రెండూ ఇచ్చేస్తే మరి కోళ్ల లలితకుమారి పరిస్థితి ఏమిటనేదీ ఆగమ్యగోచరమే. చేరదీసిన గురువుకే పంగనామాలు పెట్టడంలో సిద్ధహస్తులైనవారి వెన్నుపోటు ఆమెకు కూడా తప్పేలా లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment