సాక్షి, గుంటూరు: జనసేన, టీడీపీ ముఖ్యుల నోట తాజా మాట ‘ఇప్పటం’. వారి అంతర్గత చర్చల్లోనూ అదే నిత్యం నానుతోంది. సినిమా డైలాగుల్లా పవన్ పరుష పదాల స్క్రిప్టునే వల్లెవేస్తున్నారు. నేతల తాజా వేదనకు మంగళగిరి వేదికగా మారిందనేది రాజకీయ వర్గాల్లో చర్చ. దీని లోగుట్టంతా లోకేష్, బాబులకే ఎరుక అనే వాఖ్యలూ విస్తృతమయ్యాయి. నియోజకవర్గంలోని పేదవర్గాలను వైఎస్సార్‌సీపీ అక్కున చేర్చుకుంటున్న వైనం, పదవుల పంపిణీలో అనుసరిస్తున్న సామాజిక న్యాయం, కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. స్వపుత్రుడు లోకేష్ మంగళగిరి నుంచే పోటీకి సాహసిస్తే రాజకీయ భవిష్యత్తు కొడిగడుతుందేమోననే ఆందోళనలతో దత్తపుత్రుడి ద్వారా రాజకీయ చదరంగాన్ని బాబు ఆడిస్తున్నారనేది పరిశీలకుల అభిప్రాయం.
అందుకే ఇప్పటంను కేంద్రబిందువుగా చేసుకుని పావులు కదుపుతున్నారని విశ్లేషిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్లతో గెలిచిన ఆళ్ల పార్టీ మార్గదర్శనంలో రాజకీయంగా పాతుకుపోతున్నారని ప్రతిపక్షం గుర్తించింది. పై రెండు ఎన్నికలే కాకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి తొమ్మిది పర్యాయాలు ఎన్నికలు జరగ్గా 1983, 85లో మాత్రమే ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. మిత్రపక్షాలుగా ఇతర పార్టీలకు టీడీపీ మద్దతిచ్చినా 1994లో సీపీఎం విజయం సాధించింది. తక్కిన నాలుగు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
పదవుల పంపిణీలోనూ..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాజకీయ పదవుల నియామకాలలో ఎవరూ ఊహించని, అంచనాలకు అందని వెనుకబడిన వర్గాల వారికి ప్రాధాన్యం దక్కడం మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకతగా నిలిచింది. దుగ్గిరాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అత్యంత ప్రాధాన్యమైనదనేది ఈ ప్రాంతవాసులకు తెలియనిదేమీకాదు. కొండూరు ముత్తయ్య, షేక్ బాజిలు చైర్మన్‌లు అయ్యారు. డైరెక్టర్ల నియామకంలోనూ వెనుకబడిన సామాజికవర్గాలకు ప్రాధాన్యం దక్కింది.
మంగళగిరి ఏఎంసీ చైర్మన్ల నియామకాలూ గతానికి భిన్నంగా జరిగాయి. యార్డు డైరెక్టర్లు అందరూ మహిళలు కావడం మరీ ప్రత్యేకం. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు, శాప్ డైరెక్టర్.. ఇలా ప్రతి నియామకంలో సోషల్ ఇంజినీరింగ్ ప్రత్యేకత ప్రతిబింబించింది.
లోకేష్‌ది చుట్టపుచూపు
ఎమ్మెల్యే పనితీరుతో పోల్చినప్పుడు నారా లోకేష్‌ది నియోజకవర్గానికి చుట్టపుచూపే. అది కూడా మంగళగిరి పట్టణానికి పరిమితం అవుతున్నారు. ఆయన ఎర్రబాలెం, నీరుకొండ, కురగల్లు, ఈమని, దుగ్గిరాల, చిలువూరు, తుమ్మపూడి గ్రామాలలో పర్యటించగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గమంతా నిత్యం కలియతిరుగుతున్నారు. ప్రజలతో ఉంటున్నారు. గడప గడపకూ కార్యక్రమం వీటన్నింటికీ అదనం.
పవన్‌ను ఇప్పటం పంపడం ద్వారా..
మంగళగిరిలో లోకేష్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయిస్తున్న చంద్రబాబు తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్‌ను నియోజకవర్గంలోని ఇప్పటంలో దింపారని విశ్లేషకులు భావిస్తున్నారు. నానా హడావుడి చేయడానికి కూడా అదే కారణమంటున్నారు. వాస్తవంగా ఇప్పటంలో ఏం జరిగిందనేది హైకోర్టు తీర్పు తెలియజెప్పింది. ప్రజలూ నిశితంగా గమనిస్తూ అభివృద్ధి పనులకు, ప్రగతి కాముకులకు మద్దతుగా నిలుస్తుండటంతో ప్రత్యర్థి పార్టీ నేతలకు పాలుపోవడం లేదు. ఆందోళనలకు తెరతీస్తూ పచ్చని పల్లెల్లో చిచ్చు రేపడానికి కంకణం కట్టుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
అభివృద్ధి పనుల్లో పారదర్శకత
మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు, అభివృద్ధి పనులతో పాటు నియోజకవర్గంలో జరిగే ప్రతి పనీ పారదర్శకతతో కూడుకున్నదే. రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, డొంకల బాగుచేత, విద్యుత్ లైన్ల మార్పు, కమ్యూనిటీ హాళ్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, టిడ్కో ఇళ్లు.. అన్ని నిర్మాణాలూ వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పనినీ ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. సమీక్షిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం పనులను ఉదయం నుంచే పరిశీలిస్తున్నారు.
ప్రతిపక్షం పట్టున్న ప్రాంతాల్లోనూ పాగా
టీడీపీకి మద్దతుగా నిలిచే మంగళగిరి పట్టణ ఓటర్లు మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రివర్స్ అయ్యారు. దుగ్గిరాల ప్రాంతంలో టీడీపీకి పట్టు కలిగినవనే గుర్తింపు ఉన్న రేవేంద్రపాడు, మంచికలపూడి, ఈమని తదితర గ్రామాలలో వేగంగా రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. దుగ్గిరాల పంచాయతీలో దశాబ్దాలుగా కాంగ్రెస్ కానీ, వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గానీ గెలవలేదు. కానీ గత ఎన్నికల్లో 1,200 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్ సీపీ మద్దతుదారు విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికారపారీ్టకి మద్దతు లభించింది. ఇతర గ్రామాలలోని ప్రత్యర్థి పార్టీల సానుకూల వర్గాలు, నాయకులు వైఎస్సార్ సీపీకి మద్దతుగా మారుతుండటం లోకేష్, ఆయన అనుచరులకు మింగుడుపడటంలేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఆర్కే తనదైన శైలిలో..
వైఎస్సార్ సీపీ మార్గదర్శనంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పనితీరును రాజకీయ ప్రత్యర్థి నారా లోకేష్ అందుకోవడంలో బాగా వెనుకపడిపోతున్నారు. చివరికి తన పార్టీ ముఖ్యనాయకులు, సీనియర్లలో విశ్వాసం కల్పించకలేకపోతుండటంతో వారు వరుసగా పార్టీని వీడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రధాన సామాజికవర్గం నాయకులుగా గుర్తింపు కలిగిన వారిలో గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి. అంతకుముందు మురుగుడు మాజీ మంత్రి. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు తొలి నుంచి జగన్‌కు అభిమానిగా కొనసాగుతున్నారు. మరో సామాజికవర్గ ప్రముఖుడు, ఏడేళ్లపాటు టీడీపీ మండల అధ్యక్షుడిగా వ్యవహరించిన చావలి ఉల్లయ్య ఆళ్లకు మద్దతుగా నిలిచారు. టీడీపీకే చెందిన మరో సామాజికవర్గ నాయకుడు వైఎస్సార్ సీపీలో చేరనున్నారనేది సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment