
టీడీపీ నేత వర్ల రామయ్య, ఆ పార్టీ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు డీజీపీతోపాటు ఇతర పోలీసు అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ పరుష పదజాలంతో దూషించడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
సాక్షి, అమరావతి: టీడీపీ నేత వర్ల రామయ్య, ఆ పార్టీ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు డీజీపీతోపాటు ఇతర పోలీసు అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ పరుష పదజాలంతో దూషించడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీ రాజీవ్‌కుమార్ మీనా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు
వర్ల రామయ్య తరచు ఉద్దేశపూర్వకంగా సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి తప్ప అధికారులను తరచుగా వివాదాల్లోకి లాగి వ్యక్తిగతంగా దూషించడం సబబు కాదన్నారు. ప్రతి స్థానిక సమస్యను డీజీపీకి ఆపాదించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మానుకోవాలని హితవు పలికారు. మాట్లాడేటప్పుడు పదప్రయోగం అత్యంత ముఖ్యమన్నారు. ఇదే రకమైన వ్యవహారశైలి కొనసాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.