గుడివాడ టౌన్: హోమియో ప్రాంతీయ పరిశోధనా సంస్థ (ఆర్‌ఆర్‌ఐ) అక్రమాలకు వేదికగా మారింది. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందన లేకుండా పోతోంది. కనీసం ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఇవి వెళ్లడం లేదని సమాచారం. ఇక్కడ పనిచేసే అధికారులే ఎక్కువ శాతం ఈ వ్యవహారంలో భాగస్వాములు కావడంతో ఎవరూ కిమ్మనడం లేదని తెలుస్తోంది. అందుకే దీనిపై ఫిర్యాదులు వెళ్లినా మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్పందన నిల్..
ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ దినపత్రిక గత నెల 25న ‘పరిశోధనం స్వాహా’ అనే శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇది వచ్చి పదిహేను రోజులు దాటినా ఇంతవరకు దీనిపై కనీస చర్యలకు పూనుకోలేదు. వాస్తవానికి దీనిపై విచారణకు ఆదేశించేందుకు ఏ అధికారి ముందుకు రావడం లేదని సమాచారం. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి అధికారులు అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల నుంచి ఫలానా మెడికల్ షాపుల్లో మందులు కొనాలని ప్రిప్రస్కిప్షన్ రాయటం వరకు ఏదో ఒక మార్గంలో కమీషన్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదని చెబుతున్నారు.
మంచి సక్సెస్ రేటు..
గుడివాడ ప్రాంతీయ హోమియో పరిశోధనా స్థానం నుంచి గతంలో అనేక పరిశోధనలు విజయవంతం అయ్యాయి. హోమియో వైద్యం ద్వారా అనేక వంశపారంపర్య దీర్ఘ రోగాలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చిస్తుంటే, ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులు మాత్రం సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాక ముందు..
ఇక్కడ పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి మరో హోమియో స్టోర్స్ యజమానుల భాగస్వామ్యంతో పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసిన మందుల కంపెనీకి చెందిన మందులనే ఇక్కడకు వచ్చిన తమకు అంటగట్టేవారని రోగులు చెబుతున్నారు. ఈ తంతు రెండేళ్లుగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వచ్చే రోగులకు కనీసం రెండు మూడు రకాల ‘మందులు ఇక్కడ లేవు. ఫలానా మందుల షాపులో కొనుక్కోండి’ అని చెప్పి పంపేవారని రోగులు వివరిస్తున్నారు. అయితే సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమయ్యాక ఫలానా షాపులో కొనండి అని రాసే స్లిప్పులను తొలగించారు. రోగి తనకిష్టం వచ్చిన చోట మందులు కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నట్లు సమాచారం.
ఇక్కడా అక్కడా తీసుకుంటున్నారు..
ఆర్‌ఆర్‌ఐలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వైద్యులు ఇళ్ల వద్ద ప్రైవేట్ వైద్య సేవలు నిర్వహించరాదు. అందుకు ప్రతిగా వారికి బేసిక్ పేలో 20 శాతం అదనంగా జీతం అందజేస్తారు. అంటే రూ.2 లక్షలు బేసిక్ ఉంటే రూ.40 వేలు నెలకు అదనపు జీతం అందుతుంది. అయినప్పటికీ ఆర్‌ఆర్‌ఐలో పనిచేస్తున్న వారు ఇంటి వద్ద వైద్య వ్యాపారం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆరుగురు వైద్యులు ఇక్కడ పరి్మనెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అందరూ ఇక్కడా అక్కడా లాభం పొందుతూనే ఉన్నారు.
ఇప్పటికైనా స్పందిస్తే..
ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్‌ఐలో అవినీతి ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలోనూ..
ఇక్కడ ఉద్యోగ విరమణ చేసిన ఉన్నత స్థాయి వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగాల నియామకంలో తన చేతివాటం చూపించి రూ.30 లక్షలకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2019 జూలై నెలలో ఐదుగురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (177/2019) నమోదు చేశారు. సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇందుకోసం ఇక్కడ పనిచేసిన విశ్రాంత ఉద్యోగి(యూడీసీ) కాంట్రాక్ట్ ఉద్యోగుల సహాయం తీసుకుని, నిరుద్యోగులను ప్రలోభపెట్టి ఈ వసూలు దందాకు పాల్పడ్డాడని చెబుతున్నారు.
చదవండి:
పత్రికల్లో వార్తలు సేకరించి.. ఇంటెలిజెన్స్ డీఎస్పీనంటూ..
మండుటెండలో సైతం.. భక్తిభావం ఉప్పొంగగా..
Comments
Please login to add a commentAdd a comment