ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ఎంబ్రాయిడరీ మెషీన్‌తో స్వయం ఉపాధి
మా ఆయన సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేస్తున్నారు. మేము గతంలో విశాఖ నగరంలోని పూర్ణా మార్కెట్ ప్రాంతంలో ఉండేవారం. పదేళ్ల క్రితం బతుకు తెరువు కోసం 92వ వార్డులోని పద్మనాభనగర్ వచ్చేశాం. ఆయనకొచ్చే అరకొర జీతంతో బతుకు దుర్భరంగా ఉండేది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇంట్లోనే టైలరింగ్ చేసేదాన్ని. పెద్దగా ఆదాయం ఉండేదికాదు. జగనన్న ప్రభుత్వం వచ్చాక నవరత్నాల పథకాల ద్వారా మా బతుకుల్లో చాలా మార్పు వచ్చింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వంతున వచ్చింది.
ఆ మొత్తంతోపాటు జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు వచ్చాయి. దానికి మరికొంత కలిపి ఎంబ్రాయిడరీ మెషీన్ కొనుక్కున్నాం. దీంతో నా వ్యాపారం అభివృద్ధి చెందింది. నా అవసరాలతో పాటు స్థానికంగా ఉన్న టైలర్లకు కావలసిన మెటీరియల్ తీసుకు వచ్చి అందిస్తున్నా. అంతేకాకుండా మాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. నాకు ఇద్దరు కొడుకులు. భువన తేజ పదో తరగతి, చిన్నబాబు ధావన్ 5వ తరగతి చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వస్తోంది. ప్రభుత్వ పథకాలు మా కుటుంబ ఆదాయానికి ఎంతో దోహదపడ్డాయి. ఇప్పుడు ఇల్లు బాగానే గడుస్తోంది. చాలా సంతోషంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం చేసిన మేలు ఎప్పటికీ మరువలేము.
– సిలుకోటి మాధురి, పద్మనాభనగర్, విశాఖపట్నం (చింతాడ వెంకటరమణ, విలేకరి, గోపాలపట్నం)
ఒక ఇంటివారమయ్యాం
వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్‌ను. బతుకు తెరువుకోసం విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఎం.బి.వలస నుంచి రాజాం వచ్చి అక్కడి వస్త్రపురికాలనీలో కాపురం ఉండేవాళ్లం. అద్దె ఇంట్లో ఉంటూ ప్రతి నెల రూ.2 వేలు చెల్లించేవాళ్లం. రాజాంలో కనీసం రూ.8 లక్షలు ఇంటి స్థలానికే వెచ్చించాలి. గత ప్రభుత్వ హయాంలో మాలాంటి వారికి ఎలాంటి సహకారం అందలేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి, సచివాలయ వ్యవస్థ వచ్చిన వెంటనే మాకు సకాలంలో రేషన్ కార్డు వచ్చింది.
పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా కంచరాం జగనన్నకాలనీ వద్ద స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఆరి్థక సహాయం అందింది. ఆ మొత్తంతో ఇల్లు కట్టుకున్నాం. ఇటీవలే గృహ ప్రవేశం చేసి, ఓ ఇంటివారమయ్యాం. మాకు ఇద్దరు పిల్లలున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వస్తోంది. ఇప్పుడు వారి చదువుల బెంగలేదు. మేము ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణమైన జగనన్న మేలు మరచిపోలేం. – చింతా సత్యన్నారాయణ, రాజాం (దుర్గారావు, విలేకరి, రాజాం)
పైసా ఖర్చు లేకుండా ఇద్దరికి శస్త్రచికిత్స
మాది నిరుపేద కుటుంబం. నా భర్త మూడెడ్ల రామకృష్ణ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నాలుగు చక్రాల తోపుడు బండి మీద ఫ్యాన్సీ వస్తువులు అమ్మేవారు. నేను ఇంటి వద్ద పాలు, పెరుగు, కూల్‌డ్రింక్స్ అమ్మి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాం. మా అబ్బాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, కుమార్తెకు వివాహం కావడంతో ఆమె తన భర్తతో వేరేగా ఉంటోంది. నా భర్తకు బొడ్డు పెరిగింది. పొట్టమీద కుడి, ఎడమ వైపు ఎత్తుగా రావడంతో కంగారు పడ్డాం. ఫ్యామిలీ ఫిజీషియన్ క్యాంపులో ప్రభుత్వ వైద్యులకు చూపిస్తే శస్త్రచికిత్స చేయాలన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని మాకు శస్త్ర చికిత్స అంటే భయపడ్డాం.
ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేస్తామంటే విజయవాడలోని రామవరప్పాడులో గల ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాం. అక్కడ గత ఫిబ్రవరిలో శస్త్ర చికిత్స చేశారు. బొడ్డు చుట్టూ మెస్ వేశారు. ఆ మెస్ రెండు సంవత్సరాలపాటు కడుపులోనే ఉంటుందన్నారు. ఆరోగ్యం బాగా కుదుట పడింది. ఇప్పుడిప్పుడే లేచి అటూ ఇటూ తిరగగలుగుతున్నారు. నాకు గర్భసంచిలో కణితి ఉండింది. తొమ్మిది నెలల క్రితం విజయవాడలోని అదే ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స చేయించుకున్నా. నా భర్తను, నన్ను ఆరోగ్యశ్రీ బతికించింది. నా భర్త రామకృష్ణకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. పేదలందరికీ ఇళ్లు పథకంలో మాకు ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు నిర్మించాల్సి ఉంది. మళ్లీ సీఎంగా జగనే రావాలని దేవుడిని కోరుకుంటున్నాం. – మూడెడ్ల కుమారి, పాలకొల్లు (కె శాంతారావు, విలేకరి. పాలకొల్లు అర్బన్)
Comments
Please login to add a commentAdd a comment