శ్రీకాకుళంలోని ద్వారకానగర్ కాలనీలో నివాసం ఉంటున్న దేవేంద్రనాథ్‌బాబు అడ్వొకేట్ కాగా ఆయన భార్య శ్రీదేవి గృహిణి. వారి కుమార్తె దుర్గాశివాని గతేడాది వరకు ప్రైవేట్ స్కూల్‌లో చదవగా 10వ తరగతి శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చేరింది. విద్యాకానుక ద్వారా ఇస్తున్న వస్తువులను చూసి ఆశ్యర్యపోయింది. ప్రైవేట్ స్కూల్‌లో ఫీజులు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, షూ, సాక్సులు కోసం తన తల్లిదండ్రులు ఇన్నేళ్లూ రూ.వేలల్లో ఖర్చు చేసేవారని, రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తోంది.
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక ద్వారా స్టూడెంట్స్ కిట్ల పంపిణీ చురుగ్గా సాగుతోంది. విద్యార్థులంతా ఉత్సాహంగా నాడు–నేడు ద్వారా తీర్చిదిద్దిన పాఠశాలలకు తరలివస్తూ కిట్లను అందుకుని మురిసిపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 16వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జడ్పీ పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 47,32,064 మంది విద్యార్థులకు ఈ కిట్లను అందించనున్నారు.
ఇప్పటికే అన్ని మండల కేంద్రాలకు అక్కడినుంచి జిల్లా కేంద్రాలకు కిట్లలోని వస్తువులను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని బ్యాగుల్లో సర్ది ప్రతి బ్యాగుపై విద్యార్థి పేరు, కిట్లో ఉన్న వస్తువులను సూచిస్తూ స్టిక్కర్‌పై వివరాలు పొందుపరిచి విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులంతా ఒకేసారి గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దశలవారీగా కిట్ల పంపిణీకి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 31వ తేదీవరకు కిట్లను పంపిణీ చేయాలని సూచించారు.
కాకినాడలో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తున్న సీఎంవో శివరామకృష్ణయ్య
జిల్లాలవారీగా పంపిణీ ఇలా..
విశాఖ జిల్లాలో 3,63,114 కిట్లు అవసరం కాగా ఇప్పటివరకూ 70,084 పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులందరికీ జగనన్న విద్యాకానుక కిట్లు అందజేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. జిల్లాలో 4,68,455 మంది విద్యార్థులుండగా వీరందరికీ కిట్లలోని వస్తువులన్నీ అందాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,31,887 మందికి కిట్లు ఇవ్వాల్సి ఉండగా గురువారం వరకు 1,13,112 కిట్లను పంపిణీ చేశారు.
కర్నూలు జిల్లాలో 4,71,024 మంది విద్యార్థులకు గానూ ఇప్పటి వరకు 37,933 మందికి కిట్లు అందాయి. శ్రీకాకుళం జిల్లాలో 2,86,450 లక్షల మంది విద్యార్థులు ఉండగా 1,56,810 మందికి ఇప్పటికే అందచేశారు. విజయనగరం జిల్లాలో 2,26,157 మంది విద్యార్థులు చదువుతుండగా 1,19,100 మందికి ఇప్పటిదాకా కిట్లు అందించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 3,71,315 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేయాల్సి ఉండగా ఇప్పటివరకు 66 వేల కిట్లను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో 2,71,498 మంది విద్యార్థులు ఉండగా గురువారం మధ్యాహ్నం సమయానికి 12,917 మందికి కిట్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో 4,208 మంది విద్యార్థులకు రిజిస్టర్లలో పేర్లు నమోదు చేసుకుని కిట్లు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ అధెంటిఫికేషన్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడంతో పంపిణీ ఆగింది. మండలాల వారీగా డివైజ్‌లను సరి చేసి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాలో 3.51 లక్షల మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా బయోమెట్రిక్ యంత్రాల సమస్య, విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటం వల్ల జాప్యం జరుగుతోంది. ఈనెల 18వ తేదీ నాటికి మొత్తం 5 వేల కిట్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో ఇప్పటిదాకా 1,22,913 మందికి జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. మొత్తం 4,06, 678 మందికి కిట్లు ఇవ్వాలి.
కృష్ణా జిల్లాలో 3,17,443 మంది విద్యార్థులకుగానూ ఇప్పటిదాకా 1.30 లక్షల మందికి పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లాలో 3,373 స్కూళ్లలో 2,68,143 మంది విదార్థులు చదువుతుండగా ఇప్పటివరకు మాన్యువల్‌గా 97,312 మందికి, బయోమెట్రిక్ విధానంలో 2,688 మందికి విద్యాకానుకలను అందచేశారు.
భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే శివరామకృష్ణది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి. ఇద్దరు పిల్లల్ని చదివించేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. పుస్తకాలు, దుస్తులు, బూట్లు కొనడం తలకుమించిన భారంగానే ఉండేది. ఇప్పుడు అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యాకానుక ద్వారా ప్రభుత్వం ఆసరాగా నిలవడంతో ఊపిరి పీల్చుకుంటున్నాడు. విద్యాకానుక ద్వారా కొత్త దుస్తులతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, స్కూల్ బ్యాగులు, ఆఖరికి టై, బెల్టు లాంటివన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుండటంతో పిల్లలను దొరబాబుల్లా బడికి పంపుతున్నట్లు ఆయన భార్య శాయన ఉష సంతోషంగా చెప్పింది.
– తల్లి శాయన ఉషతో 7వ తరగతి విద్యార్థి హర్షవర్థన్, మాదేపల్లి జెడ్పీ హైస్కూల్
కర్నూలు జిల్లా వెల్దుర్తి ఇందిరాగాంధీనగర్‌కు చెందిన రాజుకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులకు వెళ్తుంటాడు. ఏటా పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయంటే ఆందోళన మొదలయ్యేది. బ్యాగులు, నోట్ పుస్తకాలు తదితరాల రూ.8 వేల దాకా ఖర్చు అయ్యేది. జగనన్న విద్యా కానుక వల్ల గతేడాది నుంచి ఆ ఖర్చులు మిగులుతున్నాయి.
– రాజు, వెల్దుర్తి పెయింటర్, ఇందిరాగాంధీనగర్
ఇక ఏ దిగులూ లేదు..
గతంలో పిల్లల పుస్తకాలు, యూనిఫారాలు కొనేందుకు అప్పులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ తెరిచిన రోజే అన్నీ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగనన్న మాకు ఏ దిగులూ లేకుండా చేశారు. బ్యాగ్ చాలా బాగుంది. మంచి నాణ్యమైన పుస్తకాలు, యూనిఫాంలు అందించారు.
– సిద్ధాంతపు లక్ష్మి, తగరపువలస, భీమిలి (తనయుడు భరత్‌కుమార్‌తో)
ప్రభుత్వ మేలు మరువలేం
నా పేరు షాహీనా. చిత్తూరులోని మార్కెట్‌వీధిలో ఉంటున్నాం. ఇద్దరు పిల్లలున్నారు. నా భర్త ముజీబ్ చికెన్ వ్యాపారం చేస్తుంటారు. రెండో కుమారుడు మహమ్మద్‌సేటును మున్సిపల్ స్కూల్‌లో 5వ తరగతి చదివిస్తున్నాం. రెండేళ్లుగా నోటు పుస్తకాలు, బ్యాగులు అన్నీ ప్రభుత్వమే సమకూర్చింది. బ్యాగు, యూనిఫాం, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు చాలా నాణ్యంగా ఉన్నాయి. మా పిల్లల చదువుకు ప్రభుత్వం చేస్తున్న మేలును ఎప్పటికీ మరువలేం.
– షాహీనా, విద్యార్థి తల్లి
కొత్త ఉత్సాహం..
కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. మా పాప అమృత నెల్లిమర్ల కేజీబీవీలో పదోతరగతి, బాబు ఉదయ్‌కిరణ్ రామతీర్థం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. సకల సదుపాయాలతో అందంగా సిద్ధమైన పాఠశాలలను చూసి పిల్లల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అమ్మ ఒడి కింద ఆర్థిక సాయం అందుతోంది. మరోవైపు జగనన్న విద్యాకానుక అందజేశారు. కిట్‌లో ఉన్న బూట్లు, బ్యాగు, యూనిఫారాలు అన్నీ నాణ్యమైనవి ఇచ్చారు.
– పతివాడ శ్రీను, విద్యార్థి తండ్రి, కొత్తపేట గ్రామం, నెల్లిమర్ల మండలం, విజయనగరం
రెట్టించిన ఉత్సాహంతో..
నోట్ పుస్తకాలు, వర్క్‌పుస్తకాలు కొనుక్కునేందుకు చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఆర్థిక స్థోమత లేక నెలకు కొన్ని మాత్రమే కొనుగోలు చేసేవాళ్లం. జగనన్న విద్యాకానుకతో ఆ కష్టాలు తీరాయి. రెట్టించిన ఉత్సాహంతో పాఠశాలకు హాజరవుతున్నా.
– శ్రావణి లావణ్య, బాలికోన్నత పాఠశాల, సాలిపేట, కాకినాడ
ప్రతి వస్తువు నాణ్యంగా ఉంది
పొదలకూరు రోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నా. ఈ ఏడాది ఇచ్చిన యూనిఫాం చాలా బాగా, గట్టిగా ఉంది. షూ కూడా బాగుంది. బ్యాగు చాలా గట్టిగా ఉంది. విద్యాకానుకలో ఇచ్చిన అన్ని వస్తువులు నాణ్యతతో ఉన్నాయి.
– వి. మౌనిక, 10వ తరగతి, జిల్లా పరిషత్తు హైస్కూల్, నెల్లూరు
పైసా ఖర్చు లేకుండా..
మా పాప సాజియా ఫిర్దోస్ గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. వరుసగా రెండో ఏడాది విద్యాకానుక కిట్ పంపిణీ చేశారు. కూలిపనులు చేసుకునే మేం పైసా ఖర్చు చేయాల్సిన పని లేకుండా ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం ఇచ్చి చదువు చెప్పిస్తున్న జగనన్నకు రుణపడి ఉంటాం.
– సయ్యద్ జమీల, గుంటూరు
పర్‌ఫెక్ట్‌గా సరిపోయాయి..
నాపేరు హర్షిత.మున్సిపల్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతుతున్నాను. నాన్న రాధాకృష్ణ కిరాణా షాపులో పని చేస్తాడు. అమ్మ సౌమ్య చిన్న హోటల్ నడుపుతోంది. జగనన్న విద్యా కానుక ద్యారా రూపాయి ఖర్చు లేకుండా నా చదువుకు అన్ని రకాల వస్తువులు సమకూరాయి. విద్యా కానుకలో ఇచ్చిన వస్తువులన్నీ చాలా బాగున్నాయి. బూట్లు, యూనిఫామ్ కూడా సరిపోయాయి. అన్నీ ఫిట్‌గా, పర్‌ఫెక్ట్‌గా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది.
– ఎం. హర్షిత, 9వ తరగతి, మునిసిపల్ హైస్కూల్, వైఎస్సార్ జిల్లా.
నాణ్యతతో ఉన్నాయి..
నేను 8వ తరగతి చదువుతున్నా. జగనన్న విద్యాకానుక కిట్లు చాలా బాగున్నాయి. టెక్ట్స్‌బుక్కులు అందంగా ఉన్నాయి. గ్రాఫిక్స్, బొమ్మలు అర్థవంతంగా ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నాను. మాకు సులువుగా అర్థమయ్యేలా ఒక వైపు తెలుగులో, మరో వైపు ఇంగ్లిష్‌లోనూ టెక్ట్స్‌బుక్కులు ముద్రించారు. స్కైకలర్ బ్యాగు చాలా బాగుంది.
– సాహితీ. జెడ్పీ హైస్కూల్, హవళిగ, అనంతపురం జిల్లా.
Comments
Please login to add a commentAdd a comment