సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.
మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత మీ ప్రభుత్వం మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తోందన్నారు. దీనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రితో అన్నారు. కొందరికే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకీ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాలు ఇవ్వడం జర్నలిస్టులందరికీ సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా మేనిఫెస్టోలో ఉన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం జర్నలిస్టులతో అన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు.
జర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయమని సీఎం అధికారులను అక్కడే ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తనకు నివేదించాలన్నారు. జాప్యానికి తావులేకుండా, భూముల గుర్తింపు సహా తదితర అంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటుచేసుకుని ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
సీఎంని కలిసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు( జాతీయ మీడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్ యూనియన్ నేతలు జి.ఆంజనేయలు, ఎస్.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీవీఆర్ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు.
చదవండి: మనసున్న మారాజు సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment