
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఇరికించేందుకే గూగుల్ టేకౌట్ కథ అల్లుతున్నారని కడప మేయర్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు చెప్పారు. అందుకే తాము కోర్టును ఆశ్రయించామే తప్ప సీబీఐకి భయపడి కాదన్నారు. వైఎస్ కుటుంబం ఇలాంటి ఎన్నో కుట్రలను ఎదుర్కొని నిలబడిందన్నారు. వారిది పదిమందికి సాయం చేసే గుణమే తప్ప ద్రోహం చేసే ఆలోచన లేదన్నారు.
సురేష్‌బాబు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీబీఐపై ఉన్న నమ్మకం పోయేలా కేసు దర్యాప్తు సాగుతోందని అన్నారు. తాము లేవనెత్తుతున్న అనుమానాలపై దృష్టి పెట్టకుండా సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అవినాశ్‌రెడ్డి ఆయనకున్న అనుమానాలన్నీ లిఖితపూర్వకంగా ఇచ్చినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదన్నారు. న్యాయవాది సమక్షంలో విచారించాలని, వీడియో తీయాలని కోరినా పట్టించుకోలేదన్నారు.
వివేకా చనిపోయినప్పుడు మొదట ఫోన్‌చేసి చెప్పిన శివప్రకాశ్‌రెడ్డిని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో అతడిని స్వేచ్ఛగా వదిలేశారన్నారు. హత్యకు ముందు సునీల్‌యాదవ్ అవినాశ్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని చెప్పడం దారుణమన్నారు. సీబీఐ అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎల్లో మీడియాకు లీకులిస్తూ అభూత కల్పనలకు తావిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు వాస్తవాలను వెలికితీసి, నిజమైన దోషులను శిక్షించాలని కోరారు.
దస్తగిరి ఎవరి పేరు చెబితే వారిని విచారిస్తున్నారు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్ చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఎవరి పేరు చెబితే వారిని చార్జిషీట్‌లో పెట్టి విచారణకు పిలవడం సరికాదన్నారు.
ఎంపీ అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా విచారణ పేరిట వేధించి, ఆయన రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేయాలనే కుట్ర కనిపిస్తోందన్నారు. సీబీఐ విచారణను బీజేపీలోని టీడీపీ కోవర్టులు ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment