'బాబు'ది నో ఆన్సర్‌.. ఓన్లీ డైవర‍్షన్‌! | KSR Comments On Chandrababu, Opposition Alleges Economic Mismanagement And Diversion Politics By NDA Government | Sakshi
Sakshi News home page

'బాబు'ది నో ఆన్సర్‌.. ఓన్లీ డైవర‍్షన్‌!

Jun 3 2026 9:49 AM | Updated on Jun 3 2026 11:26 AM

KSR Comments On Chandrababu Diversion Politics

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. తన రాజకీయ ప్రత్యర్ధులపై తోచిన ఆరోపణ చేయడం, వీలైనంత బురద చల్లడం, తనపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేయడం ఒక విధానంగా మార్చుకున్నారు. అబద్ధాలకు ఆకాశమే హద్దుగా పెట్టుకున్నారు. అదే బాటలో ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్ నడుస్తున్నారు. వీరి బాటే బాగుందనుకుని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు దానినే అనుసరిస్తున్నారు. అందువల్లే ఏపీలో ప్రభుత్వం అంతా అస్తవ్యస్తంగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది.

కొద్ది రోజుల క్రితం కాగ్ నివేదిక ఆధారంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దిష్ట విమర్శలు చేశారు. పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతోందని, దానికి చంద్రబాబు ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అవినీతి కారణమని ఆయన ఆరోపించారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది ఆర్ధిక విధ్వంసమని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పులు పెరిగిపోయి, ఆదాయం తగ్గిపోయిన నేపథ్యాన్ని జగన్ ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు లేదా, ఆర్దిక మంత్రి కేశవ్ లేదా కీలక మంత్రి లోకేష్ వంటివారు ఏ మాత్రం స్పందించలేకపోయారు.

రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పు చేసి దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఒక రికార్డు సృష్టించిందన్న అంశంపై వీరెవ్వరూ ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు. నిత్యం జగన్ గత ప్రభుత్వంపై ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. అసలు విషయాలు మాట్లాడకుండా అసత్యాలు వల్లెవేస్తుంటారు. దానికి బదులు ఇస్తే మొత్తం సమస్యను అటువైపు మళ్లించడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. చిత్రమేమిటంటే ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా తొమ్మిదివేల కోట్ల రూపాయల అప్పు చేసి, దానిని రికార్డులలో ఆదాయంగా చూపించారట. ఇది వినడానికే గమ్మత్తుగా ఉంది కదా! మనం ఎవరమైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే అది ఆదాయంగా భావించి ఖర్చు చేస్తామా? అవసరాలకు వాడుకుని, తద్వారా ఏదైనా సంపాదిస్తే, ఆ తర్వాత ఆ రుణ వాయిదా చెల్లించాక మిగిలితే దానిని ఆదాయంగా చూపిస్తాం. కాని ఇంత పెద్ద ప్రభుత్వం అప్పులనే ఆదాయం చూపడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? అవ్వదా ? అన్న ప్రశ్న వస్తుంది.

మరో వైపు సొంత పన్నుల రాబడిలో 3.22 శాతం క్షీణించిందని లెక్కలు చెబుతున్నాయి. అయినా 10.75 శాతం వృద్ధిరేటు చూపడాన్ని జగన్ తప్పుపట్టారు. లిక్కర్ షాపులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. వేలాది బెల్ట్ షాపులకు కొరత లేదు. అయినా మద్యం ద్వారా వచ్చే ఆదాయం 8.2శాతం తగ్గిందట. అంటే మద్యంలో భారీ స్కామ్ జరుగుతున్నట్లే కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో మూల ధన వ్యయం కేవలం 7.31 శాతంగానే ఉండడం ఆందోళన కలిగించే అంశమే. ద్రవ్యలోటు రెండేళ్లలో 32 శాతంపైకి చేరుకుందని కాగ్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సాధారణంగా అయితే ఆర్ధిక మంత్రి, లేదా ఆ శాఖ అధికారులు దీనిపై వివరణ ఇస్తారు. కాని వారు కూడా ఎవరూ మాట్లాడడం లేదు.

ఈ పరిస్థితి ఇలా ఉంటే జగన్ ప్రభుత్వంలో విధ్వంసం అంటూ పడికట్టు పదాలతో డైలాగులు ప్రచారం చేస్తుంటారు. జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకువస్తే వాటిని ప్రైవేటువారికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ నాలుగు ఓడరేవులను నిర్మించే పని చేపడితే వాటిని కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేయవలసిందేనని ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బహుశా చంద్రబాబు సూచన మేరకే కొనకళ్ల ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. తద్వారా జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తే ఆయన ఖాతాలో వేయాలన్నది ప్రభుత్వ వ్యూహం కావచ్చు.

పైగా మహిళలకు ఉచిత బస్ స్కీమ్ వల్ల ఆర్టీసీ నష్టపోతోందని, అందువల్ల ప్రైవేటీకరణ చేయాల్సి వస్తోందని అంటున్నారంటే ఏమనుకోవాలి. ఆ వాగ్దానం చేయాలని ఎవరైనా కోరారా? అట్టహాసంగా ఆ స్కీమ్ ను ఆరంభించినప్పుడు వారికి దీనివల్ల ఆర్టీసీకి నష్టం వస్తుందని తెలియదా? దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కదా! అలాకాకుండా ఆర్టీసీని గాలికి వదలివేస్తారా? ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు కొనాలంటే అన్నివేల కోట్ల డబ్బు ఎక్కడ ఉందని ఆర్టీసీ చైర్మన్ అమాయకంగా జనాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఈ మధ్యనే సంస్కరణ యోధుడు అన్న అవార్డును అందుకున్న చంద్రబాబునాయుడు వీటికి జవాబు ఇవ్వవలసిన పని లేదా?2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఆర్టీసీ 6300 కోట్ల అప్పుల్లో ఉంటే, ఉద్యోగులకు 3200 కోట్ల బకాయి ఉంటే, దానిని జగన్ టైమ్ లో రెండువేల కోట్లకు తగ్గించామని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. తమకు సంపద సృష్టించడం తెలుసునని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు కాకుండా  ప్రైవేటువారికి సంపద సమకూర్చే పనిలో ఉన్నారని వైసీపీ మండిపడుతోంది. కొత్తగా తీసుకునే ఈ బస్ లన్నిటిని ప్రైవేటువారికే అప్పగిస్తే, అప్పుడు ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదన్నది ప్రభుత్వ భావన కావచ్చు. కాని దానివల్ల మొత్తం ఆర్టీసీ మనుగడే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక ఉచిత బస్ స్కీమ్ కు కూడా మంగళం పాడతారా? అన్న సందేహాన్ని తీర్చవలసి ఉంటుంది.

ఒకవైపు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడానికి ఎవరికి పడితే వారికి రూపాయికి, అర‍్ధ రూపాయికి భారీగా భూములు కట్టబెడుతున్నారు. వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. అదే టైమ్ లో ప్రభుత్వం ఆ కంపెనీలకు ఎదురు వేల కోట్ల రాయితీలు ఇస్తున్న తీరు గమనిస్తే, వచ్చే ఒకటి, రెండు దశాబ్ధాలలో ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ ఉండకపోవచ్చని ఒక ఆర్థిక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.

పెట్రోల్, డీజిల్ పై ఉన్న పన్నులను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కేంద్రం చమురు ధరలు పెంచినా, గతంలో తామే అమరావతి పేరుతో నాలుగు రూపాయల సెస్ వేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రబుత్వం ఒక రూపాయి సెస్ వేస్తే, మొత్తం అంతటిని జగన్ ప్రభుత్వానికి రుద్ది ప్రచారం చేసేవారు. ఇప్పుడేమో పొదుపు అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం ప్రత్యేక విమానాలలో తిరగడం మానుకోరట. నిత్యం ఏదో చోటకు విమానాలలో, హెలికాఫ్టర్ లలో వెళ్లి సభలుపెట్టడం ఆపుతారా? లేదా? అన్నది తెలియదు. అమరావతి పేరుతో జరుగుతున్న దుబారాను అరికట్టడం లేదు. మరి వీటన్నిటిని ఏపీ అభివృద్ధిగా చూడాలా? లేక విధ్వంసంగా చూడాలా?


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement