ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కురసాల కన్నబాబు
సాక్షి, అమరావతి: పండించినచోటే పంటను ప్రాసెస్ చేసి మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.186 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్థానికంగా లభించే పంట ఉత్పత్తుల ఆధారంగా వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం గుంటూరు ఏపీఐఐసీ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో అన్నదాతలకు అదనపు ఆదాయం లభించడమేగాక లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మార్కెట్‌కు అనుగుణంగా వ్యవసాయ సలహా మండళ్ల సూచనలతో త్వరలో క్రాప్ ప్లానింగ్ అమలు చేస్తామన్నారు. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటలపై దృష్టిపెట్టేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు.
రైతుల అవసరాల మేరకు పచ్చిరొట్ట విత్తనాలను రైతుభరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. వేరుశనగ రాయితీ విత్తన పంపిణీని జూన్ 17 నాటికి పూర్తిచేయాలన్నారు. ఈనెల 25 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించి జూన్ 1వ తేదీ నుంచి వరి విత్తనాల పంపిణీ ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో మరో లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొన్నిప్రాంతాల్లో ఉద్యాన పంటలు , పట్టు సాగు ఈ క్రాప్ పరిధిలోకి రాలేదని చెప్పారు. సాగయ్యే ప్రతిపంట ఈ క్రాప్ పరిధిలోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు. కోకో, కొబ్బరి, ఆయిల్‌పామ్ వంటి లాభసాటి పంటల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలన్నారు. సుబాబుల్, పొగాకు, మెట్ట వరి పంటల సాగు తగ్గించాలని, వాటిస్థానంలో ఉద్యాన, ఇతర లాభసాటి పంటల సాగువైపు రైతులను మళ్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టమాటా ధరల విషయంలో రైతులు నష్టపోకుండా చూడాలని ఆయన చెప్పారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ, ఉద్యానశాఖల కమిషనర్లు హెచ్.అరుణ్‌కుమార్, డాక్టర్ ఎస్.ఎస్.శ్రీధర్, ఏపీ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ డి.శేఖర్‌బాబు, ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment