సాగర మథనం.. సాహస జీవనం | Lifestyle Of Fisherman Gradually Change For Past 3 Years | Sakshi
Sakshi News home page

సాగర మథనం.. సాహస జీవనం

Published Tue, May 31 2022 11:16 AM | Last Updated on Tue, May 31 2022 12:00 PM

Lifestyle Of Fisherman Gradually Change For Past 3 Years - Sakshi

సాక్షి, నెల్లూరు: మత్స్యకారులు.. జన జీవన సవ్రంతి బతుకుతున్నా వారి బతుకు లోతుల్లోకి తొంగిచూస్తే విలక్షణత కనిపిస్తోంది. కడలి ఒడిలో చేపల వేటనే జీవనంగా మార్చుకున్న గంగ పుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి.  ఏడాదిలో పది నెలల పాటు సాగరాన్ని మథించే సాహజ జీవనాన్ని సాగిస్తుంటారు. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి కడలిని సునాయాసంగా ఈదే వీరు.. బతుకు పోరాటంలో దశాబ్దాలుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. వేటే వీరి జీవనాధారం.. ఆ వేట ఆగితే.. ఆ పూట గడిచేది కడుభారం. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ విధించే వేట నిషేధం కాలంలో బతుకు జీవనం పెను సవాల్‌గా ఉంటుంది.  

జీవితం.. విభిన్నం  
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 12 మండలాల పరిధిలో 169 కి.మీ. మేర సముద్ర తీరం ఉంది. ఆ తీరం వెంబడి ఉన్న 98 గ్రామాల్లో సుమారు 1.50 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 41 వేల మంది చేపల వేటనే జీవనం మార్చుకుని జీవిస్తున్నారు. ఏటా దాదాపు 65 వేల టన్నుల మత్స్య సంపదను సముద్రం నుంచి సేకరిస్తున్నారు. కడలినే నమ్ముకున్న గంగపుత్రుల జీవన శైలి విభిన్నంగా ఉంటుంది.  వేకువ జామున 2 గంటలకే సిద్ధం చేసుకున్న వలలను భుజాలపై వేసుకుని సంప్రదాయ బోట్లు ద్వారా సముద్రంలోకి వెళ్తారు. 

దాదాపు 5 కి.మీ. సముద్రంలోకి వెళ్లి వలలు వేసి మత్స్య సంపదను సేకరించి ఉదయం 8 గంటలకు తీరానికి చేరుకుంటారు. మెకనైజ్డ్‌ బోట్లు ఉన్న మత్స్యకారులు మాత్రం సముద్రంలో వెళ్లి వారం.. పది రోజుల పాటు అక్కడే ఉండి మత్స్య సంçపదను సేకరించి తీరానికి చేరుస్తారు. ఇలా పది నెలల పాటు ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించుకుంటారు. పగలంతా తమ వలలను సరి చేసుకుని మళ్లీ మరుసటి రోజుకు సన్నద్ధమవుతారు. ఇదే వీరి నిత్య జీవితం. కుటుంబ సభ్యులతో గడిపేది చాలా తక్కువ సమయం. ఇలా ఏడాదిలో పది నెలలు సముద్రంలోనే వీరి జీవితం గడిచిపోతుంది.  

వేటకు ఇలా వెళ్తారు.. 
గ్రామంలో మత్స్యకారులు బోటు సామర్థ్యాన్ని బట్టి యూనిట్‌గా ఏర్పాటవుతారు. పెద్దబోటులో (మూడు ఇంజిన్లు) ఉన్న దానిలో 30 మంది వేటకు వెళ్తారు. సింగిల్‌ ఇంజిన్‌ ఉన్న బోటులో నలుగురు వెళ్తారు. డబుల్‌ ఇంజన్‌ ఉన్న బోటులో 20 మందికి పైగా వేటకు వెళ్తారు. వారు సేకరించే మత్స్య సంపదను అందరూ కలిసి పంచుకుంటారు. ఒకసారి వేటకు వెళ్తితే బోటు డీజిల్‌ ఇతరత్రా ఖర్చులకు రూ.15 వేలు వరకు ఖర్చవుతుంది. వేటకు వెళ్లినప్పడు ఒక వేళ ఆయా బోటులు, వలలు మరమ్మతులకు గురైతే ఆ యూనిట్‌లో ఉన్న వారందరూ కలిసి దళారుల వద్ద వడ్డీతో అప్పు తెచ్చుకుని మరమ్మతులు చేయించుకుంటారు. వేట సాగించి వచ్చిన డబ్బులను ఆ దళారులకే వడ్డీతో కలిసి తిరిగి చెల్లిస్తుంటారు.
   
జీవనం.. విశిష్టం 
చుట్టూ ప్రపంచం పాశ్చాత్య పోకడలతో విలాస జీవనం సాగిస్తుంటే.. వీరు మాత్రం కులాల కుంపట్లకు.. రాజకీయాలకు దూరంగా ఉంటారు. అందరిదీ ఒక్కటే మాట.. బాట. ఒక్క మాటలో చెప్పాలంటే.. తమకు తాముగా విధించుకున్న కట్టుబాట్లకు కట్టుబానిసలు. తప్పొప్పులు జరిగితే.. పరిష్కరించేందుకు వీరు పోలీస్‌స్టేషన్ల మెట్లు ఎక్కేది ఉండదు. వీరికి వీరు సృష్టించుకున్న చట్టం పేరు ‘దురాయి’. ఈ చట్టం కట్టుబాటును ఎవరూ ధిక్కరించరు. పెద్ద కాపు, నడింకాపు, చిన్నకాపు.. ఇలా ఈ ఊరిలో ముగ్గురిని గ్రామ పెద్దలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. వీరు చెప్పిందే ఆ ఊరందరికి వేదం. చేసిన తప్పులకు వీరు వేసే శిక్ష వారిలో మార్పు తీసుకువచ్చే విధంగా ఉంటుంది. గ్రామ పెద్దలు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే.. ఆ ఊరంతా అనుసరించాల్సిందే. ఎవరైనా ఈ నిర్ణయాన్ని ధిక్కరిస్తే.. అందరికీ ఆమోదయోగ్యంగా ‘దురాయి’ విధిస్తారు.  

విరామ సమయంలో.. 
వేట విరామ సమయంలో కూడా మత్స్యకారులు జీవనం కాస్త దుర్భరమైనప్పటికి కాయకష్టాన్నే నమ్ముకుంటారు. కొంత మంది అందుబాటులో ఉన్న ఆక్వా కల్చర్‌లో కూలీలుగా వెళ్తారు. రొయ్యల చెరువుల్లో పట్టడం,  ప్యాకింగ్‌ చేయడం, ఇతరత్రా పనులకు వెళ్తారు. ఆయా పనులు దొరకని పక్షంలో  కాలక్షేపం కోసం చింతబెత్తలతో ఆట, పులిమేక, కబడ్డీ ఇలా ఆడుకుంటున్నారు.  

మారుతున్న జీవన విధానం  
మత్స్యకారులు పల్లెల్లో ఇప్పుడిప్పుడే చేపల వేటతో పాటు ప్రత్యామ్నాయంగా వ్యవసాయం, ఉపాధి మార్గాలు అన్వేషించుకోవడం మొదలైంది. ఇందుకూరుపేట మండలంలో మైపాడులో మత్స్యకారులు వ్యవసాయం చేస్తున్నారు. వేరుశనగ, చేమ వంటి పంటలు సాగు చేస్తున్నారు. యువత  చదువులపై దుష్టి సారించి విద్యావంతులుగా మారి ఉద్యోగావకాశాలు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ చేపల వేటను నమ్ముకున్న వారు మాత్రం వేటనే జీవనంగా మార్చుకుని ఇతరత్రా వ్యాపకాలపై దృష్టి సారించడం లేదు.  

మత్స్యకారుల జీవనశైలి విభిన్నం
సముద్ర తీరం వారికి తల్లి ఒడి. కడలి ఘోష వారికి అమ్మ లాలిపాట. భీతిల్లే అలల్లో ఊయలలు ఊగినంతగా అలవోకగా జలరాసిపై అనునిత్యం సాగర మథనం. అగాధ జలనిధిలో సాహస సమరంతో జీవనం సాగించే మత్స్యకారుల దిన చర్య అర్ధరాత్రి నుంచి ఆరంభమవుతుంది. అందరూ జనం మధ్య తిరుగుతూ బతుకు జీవనం సాగిస్తుంటే.. వీరు మాత్రం నిర్మానుష్య కల్లోల కడలిలో మత్స్య వేట సాగిస్తుంటారు. ఇల్లు విడిచి కడలిలోకి వెళ్లి.. తిరిగొచ్చే వరకు అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటారు. మత్స్యకారుల జీవన విధానం.. శైలి విభిన్నంగా ఉంటుంది. కట్టుబాటుకు కట్టుబానిసలు వీరు.  

మూడేళ్లలో ఎంతో మార్పు 
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మత్స్యకారుల జీవితాల్లో చాలా మార్పు ప్రారంభమైంది. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు సముద్రంలో చేపల పునరుత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వేటకు విరామం కల్పిస్తోంది. గత ప్రభుత్వాల కాలంలో అరకొర మందికి.. అదీ ఏడాదికి రూ.4 వేలు ఆర్థిక సాయం.. 20 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేవి.

అయితే ఈ ప్రభుత్వం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వేట బోట్లకు డీజిల్‌ సబ్సిడీని గణనీయంగా పెంచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షలు పరిహారం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రూ.3.30 లక్షల విలువైన బోటు, మోటార్లు, వలలు రాయితీపై అందిస్తోంది.  మెకనైజ్డ్‌ బోట్లు పంపిణీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. 

విరామ సమయంలో ఇబ్బందులే 
చేపల వేట విరామం సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం.  మాకు వ్యవసాయ భూములు లేవు. పంటలు పండించే విధానం తెలియదు. మాకు తెలిసిందల్లా చేపలు వేట చేయడం తెలుసు. రెండు నెలల పాటు పనులు లేక ఇళ్లవద్దనే ఉంటున్నాం. ప్రభుత్వం మాకిచ్చేఆర్థిక సాయంతో పాటు వలలు బోటులకు రాయితీతో రుణాలు ఇవ్వాలి. 
– ఎస్‌.ఆర్ముగం, కృష్ణాపురం 

ప్రభుత్వ సాయంతోనే.. 
వేట విరామ సమయంలో రెండు నెలల పాటు ఖాళీగా ఉంటున్నాం. స్థానికంగా మాకు పనులు లేవు. ఆక్వా సాగు చేసే వారు ఏదైనా పనులకు పిలిస్తే పోతాం. అర్హత ఉన్నవారికి మాత్రం ప్రభుత్వం రూ.10 వేలు వంతున  సాయం చేస్తోంది. వీటితో పాటు సంక్షేమ పథకాల ద్వారా వచ్చే నగదుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. 
 – పి.చిన్న పిచ్చయ్య, కృష్ణాపురం 

అర్హులకు సంక్షేమ ఫలాలు 
మత్స్యకారులకు వేట విరామంలో ప్రభుత్వ సాయం అందిస్తోంది. జిల్లాలో ఉన్న 11 వేల మందికి రూ.10 వేలు వంతున ఆర్థిక సాయం అందించాం. ప్రధానమంత్రి మత్స్య సంపదయోజన పథకం ద్వారా కూడా బోట్లు, వలలు, అందిస్తున్నాం. మెకనైజ్డ్‌ బోట్లు పంపిణీకి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు రూపొందిస్తోంది. 
– నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement