సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి, పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి సర్కారు కొండంత అండగా నిలిచింది. ఏ పనీ చేయలేక కుటుంబానికి భారమై, కుటుంబ సభ్యుల ఈసడింపులతో క్షణక్షణం జీవితంతో పోరాటం చేస్తున్న వేలాది మంది ఇప్పుడా పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడ్డారు. చాలా మంది జబ్బు నయం చేసుకునేందుకు మందుల కొనుగోలుకు డబ్బులు లేని పరిస్థితి. వారికి ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3 వేల నుంచి గరిష్టంగా 10 వేల రూపాయల వరకు నెలనెలా పెన్షన్ ఇస్తూండటంతో ఆయా కుటుంబాలు ఇప్పుడు సంతోషంగా ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి పెన్షన్ ఇవ్వలేదు. ఇలా రాష్ట్రంలో దీర్ఘకాలిక జబ్బులతో పెన్షన్ పొందుతూ లబ్ధి పొందుతున్న వారు నవంబర్ 23 నాటికి 45,871 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువగా పక్షవాతంతో కదలలేని స్థితిలో ఉన్నవారే ఎక్కువ.
ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు
► దీర్ఘకాలిక జబ్బులు లేదా మంచానికే పరిమితమైన వారికి ఏ రాష్ట్రంలోనూ పెన్షన్లు లేవు. అలాంటి వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 45,871 మంది పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీరిలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారు 17,443 మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ పెన్షన్లను ప్రభుత్వం అందజేస్తోంది.
► దీర్ఘకాలిక జబ్బు బాధితులకు నెలవారీ ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.23.17 కోట్లు ఖర్చు చేస్తోంది. బాధితుల సంఖ్య పెరిగితే ఈ వ్యయం కూడా పెరుగుతుంది. ప్రతి నెలా 1వ తేదీనే గ్రామ లేదా వార్డు వలంటీర్లు పింఛన్‌దారుల ఇంటికెళ్లి సొమ్ము అందజేస్తున్నారు.
► ఏపీలో మెడికల్ కాలేజీల్లో వైద్యుల బృందం సర్టిఫై చేసి, అర్హత పొందిన వారికే పెన్షన్ ఇస్తారు. తలసేమియా, సికిల్‌సెల్ డిసీజ్ బాధితులు ప్రతినెలా మందులకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు వారికి ఉచితంగా మందులివ్వడమే కాకుండా నెలకు రూ.10 వేలు ఇస్తుండటంతో ధైర్యంగా ఉన్నారు.
► ఏప్రిల్‌లో 39 వేలు పింఛన్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 45 వేలకు పైగా పెరిగాయి. ఈ లెక్కన 15 % పింఛన్లు ఈ ఆరు నెలల్లోనే పెరగడం గమనార్హం. సచివాలయాల ఏర్పాటు వల్ల బాధితులకు త్వరితగతిన లబ్ధి చేకూరుతోంది.
ఆ సాయమే బతికిస్తోంది
నేను రైతును. ఆరు మాసాల క్రితం ఆసుపత్రికి వెళ్లగా రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నెలకు రూ.10 వేలు పింఛన్ మంజూరు చేసింది. డయాలసిస్ ఉచితంగా చేస్తున్నారు. ఆ సాయమే నన్ను బతికిస్తోంది.
– పి.మోహనరావు, అన్నాపురం, శ్రీకాకుళం జిల్లా
ఈ సాయం మరువలేనిది
పేద గిరిజన కుటుంబానికి చెందిన నాకు తండ్రి చనిపోయాడు. సికిల్‌సెల్ ఎనీమియా వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాకు ఈ ఏడాది మార్చినుంచి రూ.10 వేల పింఛన్ అందుతోంది. ఈ సాయం మరువలేనిది.
– సాంబే చరణ్, ఇంటర్ విద్యార్థి, గుత్తులపుట్టు, విశాఖ
అప్పుడు మందులు కొనలేని పరిస్థితి
మాది చాలా పేద కుటుంబం. నాకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. మందులు కూడా కొనుక్కోలేని స్థితి. ఈ పరిస్థితుల్లో నాకు ఈ ప్రభుత్వం రూ.5 వేలు íపింఛను ఇస్తోంది. దీంతో జీవనం సాగిస్తున్నా.
– ఎన్.ఎర్నిమ్మ, పెదవేమలి, విజయనగరం జిల్లా
భరోసా దొరికింది
మా కుమారుడు ఉదయ్‌కుమార్‌కు పుట్టుకతోనే తలసేమియా వ్యాధి వచ్చింది. గతంలో వైద్యం చేయించేందుకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. జగన్ పుణ్యమా అని ఈ ఏడాది జనవరి నుంచి బాబుకు నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తున్నారు. వైద్యానికి ఇబ్బంది లేదు.
– మీసాల లక్ష్మీ, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment