ఓటరు జాబితాతో ఆధార్‌ అనుసంధానం | Linking of Aadhaar with Voter List Central Election Commission | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాతో ఆధార్‌ అనుసంధానం

Published Fri, Jul 29 2022 3:12 AM | Last Updated on Fri, Jul 29 2022 10:49 AM

Linking of Aadhaar with Voter List Central Election Commission - Sakshi

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి నూతన మార్గనిర్దేశకాలు అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 17 ఏళ్లు నిండినవారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు, ఇప్పటికే నమోదైన వారు ఆధార్‌ నంబరును అనుసంధానం చేయాల్సి ఉంటుందని తెలిపారు. నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్‌ ఒకటోతేదీ నాటికి తమ ఆధార్‌ నంబరు తెలియజేయాలని పేర్కొన్నారు.

అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్‌ నంబరు ఇవ్వని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించరని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి ఆధార్‌ నంబరు కోసం నూతనంగా ఫారం 6బీ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈసీఐ, ఇరోనెట్, గరుడ, ఎన్‌వీఎస్‌పీ, వీహెచ్‌ఏ తదితర వెబ్‌సైట్లలో ఈ నెలాఖరు నాటికి నూతన దరఖాస్తు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

త్వరలోనే ఇంటింటికి తిరిగి ఆధార్‌ నంబరును అనుసంధానించే ప్రక్రియను చేపడతామని, ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఆధార్‌ నంబరును అనుసంధానం చేయవచ్చని తెలిపారు. 6బీ ఇవ్వని వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 ప్రత్యామ్నాయాల్లో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్‌ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

ఫారం 6తో నియోజకవర్గం మార్పు కుదరదు
ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించారని, ఓటరు నియోజకవర్గం మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని తెలిపారు. జాబితాలో పేరు తొలగింపునకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధ్రువీకరణపత్రాన్ని జతచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఫారం 8 విషయంలో కీలక మార్పులు జరిగాయని తెలిపారు.

ఇప్పటివరకు దీన్ని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై విభిన్న అంశాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోనేగాక, ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించవచ్చని ఆయన వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement