ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో స్క్యూ బ్రిడ్జి వద్ద మామిడి కాయల లోడు లారీ బోల్తా పడటంతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం నూజివీడు నుంచి మామిడి కాయల లోడుతో చిత్తూరు వెళుతున్న లారీ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ అదపు తప్పి స్క్యూబ్రిడ్జి తూర్పు భాగంలో కిందపడింది.
ఆ సమయంలో బ్రిడ్జి కింద కొందదిటి శివ, మల్లేశ్వరి దంపతుల కుమారుడు సంజీవ్ (3)కు స్నానం చేయించి, బట్టలు వేసేందుకు తల్లి ఇంటిలోకి వెళ్లింది. ఇంతలో పెద్ద శబ్దంతో లారీ బోల్తా పడింది. లారీ బాలుడిపై పడింది. స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసలు సంఘటన స్ధలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కింద పడిన లారీని అర్ధరాత్రికి పైకి తీశారు. దాని కింద ఉన్న సంజీవ్‌ను 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు.
పిల్లాడి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి క్యాజువాలిటి ముందు నిరసనకు దిగారు. మృతదేహాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఎస్‌కె ఖాదర్‌బాషా, పటమట, కృష్ణలంక సీఐలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తీవ్ర గాయాలైన లారీ డ్రైవర్ హరిబాబు, క్లీనర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment