కర్నూలు, సాక్షి: ఒక మనిషి చంపి.. పచ్చర్ల సమీప గ్రామ ప్రజలకు మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. కుక్క కోసం వచ్చి బోనులో చిరుత చిక్కుకుపోయింది.
నంద్యాల జిల్లాలో గత మూడు నెలలుగా సంచరిస్తున్న చిరుత పులి కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలించారు. పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. పచ్చర్ల టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో కుక్కను ఎరగా వేయగా.. గత అర్ధరాత్రి చిరుత వచ్చి చిక్కుకుపోయింది.
ఈ చిరుత మూడు రోజుల కిందట మెహరున్నీసాను చంపడంతో పాటు మరో ఇద్దరిపైనా దాడి చేసింది. చలమ దగ్గర రైల్వే కూలీల పైనా కూడా దాడి చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చివరికి.. చిరుతను బంధించడంతో పచర్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతను సురక్షిత ప్రాంతానికి తరలిస్తారా లేక తిరుపతి జూ కు తరలిస్తారా అనేది చూడాలి.
మరోవైపు.. మహానంది సమీపంలో సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానంది ఆలయ పరిసరాల్లో గత ఆరు రోజుల నుంచి ప్రతి రోజు తిరుగుతున్న మరో చిరుత.. భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారిస్తుండటంతో మహనందిలో భారీగా భక్తుల రద్దీ తగ్గిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment